Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 19 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-19th

Badminton: ఇంగ్లండ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన తొలి భారతీయ జోడీ?

Gayatri Gopichand and Treesa Jolly

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2022 మహిళల డబుల్స్‌ విభాగంలో భారత టీనేజ్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌–త్రిషా జాలీ.. సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మార్చి 18న జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్‌ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్‌ ద్వయం లీ సోహీ–షిన్‌ సెయుంగ్‌చాన్‌ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్‌ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ షిప్‌లో డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది. మార్చి 19న జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్‌ జోడీ జెంగ్‌ యు–షు జియాన్‌ జాంగ్‌ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2022 మహిళల డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరిన తొలి భారతీయ జోడీ? 
ఎప్పుడు  : మార్చి 18
ఎవరు    : భారత టీనేజ్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌–త్రిషా జాలీ
ఎక్కడ    : బర్మింగ్‌హమ్, ఇంగ్లండ్‌
ఎందుకు : మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్‌ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్‌ ద్వయం లీ సోహీ–షిన్‌ సెయుంగ్‌చాన్‌ (దక్షిణ కొరియా)పై గెలిచినందున..

MAARS: మానవ రహిత రోబో మార్స్‌ను ఏ అవసరాల కోసం తయారు చేశారు?

Military Robot

Top 10 Best Military Robots In The World: మానవ జీవనం మరింత సౌకర్యవంతంగా చేయాలన్న సంకల్పంతో మరమనుషుల రూపకల్పన జరిగింది. కాలక్రమేణా వీటిని మారణహోమం సృష్టించే మిషన్లుగా వాడడం ఆరంభమైంది. సైనిక రంగంలో రోబోల వాడకం నైతికం కాదన్న వాదనలున్నా, వీటి వాడకం మాత్రం పెరిగిపోతూనే ఉంది. యుద్ధరంగంలోకి రోబోటిక్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రపంచ యుద్ధ నమూనాలను మార్చివేస్తోంది. ప్రస్తుతం మిలటరీలో ఉన్న రోబోలు అటు పోరాటంతో పాటు ఇటు రెస్క్యూ (కాపాడడం) ఆపరేషన్లలో, పేలుడు పదార్థాలను కనిపెట్టి నిర్వీర్యం చేయడంలో, గూఢాచర్యంలో, రవాణాలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి రాక సాంప్రదాయక యుద్ధ విధానాలను ఒక్కపెట్టున మార్చేసింది. ఆధునిక రోబో సాంకేతికత అందుబాటులో ఉన్న మిలటరీ అత్యంత బలంగా మారుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు నైతికతను పక్కనపెట్టి మరీ, తమ తమ మిలటరీకి మరమనిషి సాయం అందించేందుకు కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో టాప్‌ 10 మిలటరీ రోబోల వివరాలు ఇలా ఉన్నాయి.

మార్స్‌ (ఎంఏఏఆర్‌ఎస్‌)

  • మాడ్యులార్‌ అడ్వాన్స్‌డ్‌ ఆర్మ్‌డ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌కు సంక్షిప్త నామమే మార్స్‌.  
  • ఇది మానవ రహిత రోబో. మిలటరీ ఆవసరాల కోసమే తయారు చేశారు.  
  • దీంట్లో శాటిలైట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను, కెమెరాలను, ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను అమర్చారు.  
  • గ్రెనేడ్‌ లాంచర్‌ లాంటి భయంకర జనహనన ఆయుధాలను దీనికి అనుసంధానిస్తారు.  
  • ఈ ఆయుధాలను రిమోట్‌తో నిర్వహించి విధ్వంసం సృష్టిస్తారు.  
  • ధర సుమారు 3 లక్షల డాలర్లు. 
  • వేగంగంటకు 11 కిలోమీటర్లు.  

సఫిర్‌ (ఎస్‌ఏఎఫ్‌ఎఫ్‌ఐఆర్‌)  

  • చూడ్డానికి మనిషిలాగా రెండు కాళ్లతో ఉంటుంది.  
  • డామేజ్‌ కంట్రోల్‌లో మనిషి చేయలేని పనులు చేసేందుకు దీన్ని రూపొందించారు.  
  • ఇది కూడా మానవ రహిత రోబోనే.  
  • దూరంలో ఉన్న శత్రు నౌకలను పసిగట్టగలదు. నావికాదళంలో వాడుతున్నారు.  
  • ధర సుమారు 1.5– 2.25 లక్షల డాలర్లు.  

గ్లాడియేటర్‌

  •  గ్లాడియేటర్‌ టాక్టికల్‌ అన్‌మాన్‌డ్‌ గ్రౌండ్‌ వెహికల్‌ను సంక్షిప్తంగా గ్లాడియేటర్‌ అంటారు.  
  •  గూఢచర్యం, నిఘా, నిర్దేశిత లక్ష్యాలను గుర్తించడం, అడ్డంకుల ఛేదనలో ఉపయోగిస్తారు.  
  •  దీంతో పాటు అణు, రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గుర్తించగలదు.  
  •  అవసరమైతే నేరుగా కాల్పులు జరపగలదు.  
  •  ధర దాదాపు 4 లక్షల డాలర్లు.  

బిగ్‌డాగ్‌  

  • పేరుకు తగ్గట్లు పెద్ద కుక్క సైజులో ఉంటుంది.  
  •  బోస్టన్‌ డైనమిక్స్‌ దీన్ని రూపొందించింది. 100 పౌండ్ల బరువును మోయగలదు.  
  •  ఎలాంటి ఉపరితలాలపైనైనా సులభంగా ప్రయాణం చేస్తుంది.  
  •  దీన్ని మిలటరీ లాజిస్టిక్స్‌లో వాడుతున్నారు.  
  •  సులభమైన కదలికల కోసం పలు రకాల సెన్సార్లు ఇందులో ఉంటాయి.  
  •  ధర దాదాపు 74 వేల డాలర్లు.  

డోగో  

  •  ఎనిమిది మైక్రో వీడియో కెమెరాలున్న ఈ రోబో 360 డిగ్రీల కోణంలో చూస్తుంది.  
  •  ఇందులో ఉన్న తుపాకీ గురితప్పకుండా పేల్చేందుకు మరో రెండు బోరోసైట్‌ కెమెరాలుంటాయి.  
  •  రేంజర్‌ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నియంత్రిస్తారు. జనరల్‌ రోబోటిక్స్‌ తయారు చేస్తోంది.  
  •  ఈ రోబోను భారతీయ ఎన్‌ఎస్‌జీ వాడుతోంది.  
  •  ధర సుమారు లక్ష డాలర్లు. 

పెట్‌మాన్‌

  •  ప్రొటెక్షన్‌ ఎన్సెంబుల్‌ టెస్ట్‌ మానిక్విన్‌ సంక్షిప్త నామమే పెట్‌మాన్‌.  
  •  ఇది చూడ్డానికి మనిషిలాగా ఉండే హ్యూమనాయిడ్‌ రోబో.  
  •  మానవ సైనికుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి రూపొందించారు.  
  •  ఇది మనిషిలాగా నడవడం, పాకడం, పరిగెత్తడంతో పాటు చెమట కూడా కారుస్తుంది.  
  •  భవిష్యత్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో వాడబోతున్నారు.  
  •  దీని రూపకల్పనకు దాదాపు 2.6 కోట్ల డాలర్లు ఖర్చైందని బోస్టన్‌ డైనమిక్స్‌ తెలిపింది.  

అట్లాస్‌ 

  • ఎమర్జెన్సీ సేవల కోసం రూపొందించారు.  
  • ప్రమాదకరమైన వాల్వులను మూసివేయడం, తెరుచుకోని బలమైన తలుపులను తెరవడం, మనిషి వెళ్లలేని వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్లి రావడం చేయగలదు.  
  • చూడటానికి మరుగుజ్జులాగా కనిపిస్తుంది.  
  • గాల్లోకి దూకడం, వేగంగా పరిగెత్తడం చేయగలదు.  
  • ధర సుమారు 75 వేల డాలర్లు.  

గార్డ్‌బోట్‌  

  • రక్షణ మిషన్లలో పాలుపంచుకుంటూనే పరిస్థితులను వీడియో తీసి లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయగలగడం దీని ప్రత్యేకత.  
  • గుండ్రంగా బంతిలాగా ఉండే ఈ రోబో ఉభయచర రోబో. 
  • నేలపై, నీళ్లలో ప్రయాణించగలదు.  
  • బురద, మంచును లెక్క చేయకుండా దొర్లుకుంటూ పోగలదు.  
  • నిఘా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది.  
  • ధర సుమారు లక్ష డాలర్లు.   

పీడీ100 బ్లాక్‌ హార్నెట్‌  

  • ఫ్లిర్‌ సిస్టమ్స్‌ తయారీ. ఎక్కువగా గూఢచర్యంలో ఉపయోగపడతుంది.  
  • వాడుకలో ఉన్న అతిచిన్న డ్రోన్‌ రోబో. కీటకం సైజులో కనిపిస్తుంది.  
  • భారత్‌ సహా పలు దేశాల మిలటరీలు చాలా రోజులుగా వాడుతున్నాయి.  
  • దీన్ని అపరేట్‌ చేసే విధానాన్ని కేవలం 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చు.  
  • అరగంట చార్జింగ్‌తో అరగంట పాటు గాల్లో తిరగగలదు.  
  • గరిష్ఠ వేగం గంటకు 21 కిలోమీటర్లు. ధర దాదాపు 1.95లక్షల డాలర్లు. 

ఎల్‌ఎస్‌3

  • లెగ్గడ్‌ స్క్వాడ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ అంటారు.  
  • నాలుగు కాళ్లుండే ఈ రోబో సైనికులకు సామాన్లు మోసే గుర్రంలాగా ఉపయోగపడుతుంది.  
  • ఎలాంటి ఆర్డర్లు లేకుండానే నాయకుడిని ఫాలో కావడం దీని ప్రత్యేకత.  
  • చిన్న పాటి వాయిస్‌ కమాండ్స్‌ను ఆర్థం చేసుకుంటుంది.  
  • 400 పౌండ్ల బరువును మోయగలదు. 
  • బిగ్‌డాగ్‌ రోబోతో పోటీ పడుతుంది.  
  • ధర దాదాపు లక్ష డాలర్లు.

2023 మార్చి నాటికి 77.5కి రూపాయి పతనం: క్రిసిల్‌ రేటింగ్స్‌ 

Rupee and Dollar

భారత్‌ కరెన్సీ రూపాయి విలువ డాలర్‌ మారకంలో 2023 మార్చి నాటికి 77.5కు బలహీనపడుతుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనావేసింది. అధిక ఇంధన ధరలతో పెరగనున్న కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక నిల్వల మధ్య నికర వ్యత్యాసం), అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు వల్ల క్యాపిటల్‌ అవుట్‌ఫ్లోస్‌ (విదేశీ నిధులు దేశం నుంచి వెనక్కు మళ్లడం) వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని తెలిపింది. ఈ మేరకు మార్చి 18న ఒక నివేదికను విడుదల చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తొలినాళ్లలో జరిగిన ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో 2022 మార్చి8వ తేదీన రూపాయి విలువ 77 కనిష్ట స్థాయిలో ముగియగా, ఇంట్రాడేలో 77.05 స్థాయినీ చూసింది.

క్రిసిల్‌ నివేదిక ప్రకారం..

  • రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫారెక్స్‌ మార్కెట్‌లో తన జోక్యాన్ని కొనసాగిస్తుంది. 630 బిలియన్‌ డాలర్లకుపైగా 12 నెలలకు సరిపడా పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలను భారత్‌ కొనసాగిస్తుండడమే దీనికి కారణం. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ‘ఆర్‌బీఐ జోక్యం’ కొంత నివారించవచ్చు.
  • 2022–23 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ఆయిల్‌ బేరల్‌కు 85 డాలర్ల నుంచి 90 డాలర్ల శ్రేణిలో ఉండే వీలుంది. ఈ ప్రాతిపదికన దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి (జీడీపీలో) పెరగవచ్చు. 2021–22లో ఈ రేటు 1.6 శాతం.
  • ఫిబ్రవరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో 13.1 బిలియన్‌ డాలర్ల విదేశీ నిధులు వెనక్కు మళ్లాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో ఉపసంహరణలు ఇదే తొలిసారి. ఇది రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది.

CJI NV Ramana: భారత సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఏ దేశ సుప్రీంకోర్టును సందర్శించారు?

Justice NV Ramana at UAE Court

CJI NV Ramana visited the Union Supreme Court of UAE in Abu Dhabi: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మార్చి 17న అబూదాబీలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) సుప్రీంకోర్టును సందర్శించారు. యూఏఈ  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్‌ హమాద్‌ అలీ బాదీ ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయనతోపాటు  సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ హిమా కోహ్లీ, భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ వచ్చారు. యూఏఈ జడ్జీలు హాజరయ్యారు. యూఏఈ సుప్రీంకోర్టును ఫెడరల్‌ సుప్రీంకోర్టు ఆఫ్‌ ది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లేదా యూనియన్‌ సుప్రీంకోర్టు ఆఫ్‌ ది యూఏఈ అని పిలుస్తారు.

దుబాయ్‌లో న్యాయ సహాయ కేంద్రం: జస్టిస్‌ రమణ
దుబాయ్‌లో ఉంటున్న భారతీయులంతా కలిసి లీగల్‌ అసిస్టెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని భారత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారతీయులకు అది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. మార్చి 18న దుబాయ్‌ పర్యటించిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు. యూఏఈలోని భారతీయులు, అబూదాబీ ఇండియన్‌ సోషల్, కల్చరల్‌ సెంటర్‌ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్‌ రమణ పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) సుప్రీంకోర్టును సందర్శించిన న్యాయమూర్తి?
ఎప్పుడు : మార్చి 17
ఎవరు    : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
ఎక్కడ    : అబూదాబీ, యూఏఈ
ఎందుకు : యూఏఈ  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్‌ హమాద్‌ అలీ బాదీ ఆహ్వానం మేరకు..

Miss World 2021: ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న యువతి?

Poland's Karolina Bielawska crowned Miss World 2021: పోలాండ్‌కి చెందిన కరోలినా బియెలాస్కా.. మిస్‌ వరల్డ్‌–2021 టైటిల్‌ను సాధించింది. ప్యూర్టో రికో రాజధాని నగరం శాన్‌ జువాన్‌లో మార్చి 16న నిర్వహించిన మిస్‌ వరల్డ్‌ 70వ ఎడిషన్‌ పోటీల్లో 97 దేశాల నుంచి వచ్చిన  సుందరాంగుల్ని తోసిరాజని 23 ఏళ్ల కరోలినా ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2020 మిస్‌ వరల్డ్‌గా ఎన్నికైన భారతసంతతికి చెందిన జమైకా వాసి టోనీ ఆన్‌సింగ్‌ మిస్‌ వరల్డ్‌ కిరిటాన్ని కరోలినాకు ధరింపజేశారు. ఈ పోటీల్లో ఫస్ట్‌ రన్నరప్‌గా భారతీయ అమెరికన్‌ మిస్‌ యూఎస్‌ఏ శ్రీ సైని, సెకండ్‌ రన్నరప్‌గా ఆఫ్రికా దేశం ఐవరీ కోస్ట్‌కు చెందిన ఒలివియా యేస్‌ నిలిచారు. ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన మిస్‌ ఇండియా మానస వారణాసి 11వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ కార్యక్రమం 2021, డిసెంబర్‌లోనే జరగాల్సి ఉంది. అయితే,  పలువురు పోటీదారులు, నిర్వాహకులకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో వాయిదా పడింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మిస్‌ వరల్డ్‌–2021 టైటిల్‌ను సాధించిన యువతి?
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : కరోలినా బియెలాస్కా(పోలాండ్‌)
ఎక్కడ : శాన్‌ జువాన్, ప్యూర్టో రికో
ఎందుకు : 70వ ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా నిలిచినందున..

Advanced Medium Combat Aircraft: ఏఎంసీఏ ప్రాజెక్టు కోసం నూతన భవనాన్ని ఎక్కడ నిర్మించారు?

Rajnath Singh in Bengaluru

దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే యుద్ధ విమానాలు.. అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఏఎంసీఏ)ల తయారీ కోసం బెంగళూరులో డీఆర్‌డీఓ 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మార్చి 17న ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ వైమానిక సామర్థ్యం మరింత పెంచేందుకు ఏఎంసీఏల వృద్ధి పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.15 వేల కోట్లని తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని భద్రతావ్యవహారాల కేబినెట్‌ కమిటీ త్వరలోనే దీనికి ఆమోదం తెలపనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, డీఆర్‌డీఓ చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఏడంతస్తుల భవనం–ముఖ్యాంశాలు

  • ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో భాగంగా డీఆర్‌డీఓ సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం 45 రోజుల్లోనే ఈ ఏడంతస్తుల భవనాన్ని నిర్మించారు.
  • దీని ద్వారా విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • ఐదో తరం మీడియం వెయిట్‌ డీప్‌ పెన్‌ట్రేషన్‌ ఫైటర్‌ జెట్‌కు అవసరమైన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
  • సంప్రదాయ, ప్రీ ఇంజినీర్డ్‌ ప్రీ కాస్ట్‌ మెథడాలజీతో రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్‌డీవో ఈ భవనాన్ని నిర్మించింది.
  • ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు డిజైన్‌కు సంబంధించి సహకారం అందించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనం ప్రారంభం 
ఎప్పుడు : మార్చి 17
ఎవరు    : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే యుద్ధ విమానాలు.. అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఏఎంసీఏ)ల తయారీ కోసం..

High Speed Boats: ఎకెర్‌ గ్రూప్, వాన్‌మోటో సంస్థ్దలతో ఒప్పందం చేసుకున్న సంస్థ?

Hindustan Shipyard limited

హైస్పీడ్‌ బోట్‌ల తయారీ రంగంలో తమ వ్యాపార వృద్ధిని వేగవంతం చేయడానికి నార్వేకి చెందిన ఎకెర్‌ గ్రూప్, వాన్‌మోటో సంస్థ్దలతో హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌) త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా.. దేశంలో హైస్పీడ్‌ బోట్‌ల తయారీకి ఎకెర్‌ మరియు వాన్‌మోటో కంపెనీలు హిందూస్తాన్‌ షిప్‌యార్డ్‌కు సహకరిస్తాయని  సంస్థ అధికారులు తెలిపారు. ఎకెర్‌ గ్రూప్, వాన్‌మోటో సంస్థలు నిర్మించే అత్యున్నత ప్రమాణ స్థాయి బోట్లను ఒడ్డు నుండి గరిష్టంగా 75 నాట్ల వేగంతో నడపవచ్చు. ఈ బోట్లు సెర్చ్, రెస్క్యూ, నిఘా, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్, మైన్‌ కౌంటర్‌ మెజర్స్, అంబులెన్స్, ఫైర్, హార్బర్‌ కంట్రోల్‌ మరియు క్లోజ్‌ ప్రొటెక్షన్‌ వంటి పనులకు ఉపయోగపడతాయి. ఎకెర్‌ గ్రూప్‌.. ఫెర్రీలు, విశ్రాంతి పడవలు, ప్రొఫెషనల్‌ బోట్‌లను డిజైన్‌ చేయడంలో ప్రసిద్ధి చెందింది. హెచ్‌ఎస్‌ఎల్‌ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నార్వేకి చెందిన ఎకెర్‌ గ్రూప్, వాన్‌మోటో సంస్థ్దలతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 17
ఎవరు    : హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌)
ఎందుకు : హైస్పీడ్‌ బోట్‌ల తయారీ రంగంలో తమ వ్యాపార వృద్ధిని వేగవంతం చేయడానికి..

44th Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?

Chess

Chennai To Host Chess Olympiad 2022: భారత చెస్‌ రాజధాని చెన్నై మరో మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత మరో ప్రధాన టోర్నీ అయిన ‘చెస్‌ ఒలింపియాడ్‌’కు 2022 ఏడాది చెన్నైలో జరగనుంది. ఉక్రెయిన్‌పై అనైతిక యుద్ధం చేస్తోన్న రష్యాకు కట్టబెట్టిన 44వ‌ చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్య హక్కుల్ని ఇదివరకే రద్దు చేసిన ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడే) తాజాగా కొత్త వేదికగా చెన్నైను ఖరారు చేసింది. అయితే తేదీలు తదితర వివరాలను ఇంకా ప్రకటించలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ చెన్నైలో మెగా టోర్నీ విషయాన్ని ప్రకటించారు. చెస్‌లో జరిగే పెద్ద టీమ్‌ ఈవెంట్‌ అయిన ఈ టోర్నిలో దాదాపు 190 దేశాలకు చెందిన 2000 పైగా క్రీడాకారులు తలపడతారు. ముందనుకున్న షెడ్యూలు ప్రకారమైతే మాస్కోలో 2022, జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు ఈ టీమ్‌ ఈవెంట్‌ జరగాల్సి ఉంది.

అవినీతి నిర్మూలనకు హెల్ప్‌లైన్‌: పంజాబ్‌ సీఎం
ప్రభుత్వ కార్యాలయాల్లో చోటుచేసుకునే అక్రమాలను ఎండగట్టేందుకు పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం నడుం బిగించింది. స్వాతంత్య్ర యోధుడు భగత్‌సింగ్‌ అమరత్వం పొందిన మార్చి 23వ తేదీ నుంచి రాష్ట్ర ప్రజల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పంజాబ్‌ కొత్త సీఎం భగవంత్‌æ మాన్‌ మార్చి 17న ప్రకటించారు. ఇది తన వ్యక్తిగత సెల్‌ఫోన్‌ నంబరని అన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చెస్‌ ఒలింపియాడ్‌–2022ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎప్పుడు : మార్చి 17
ఎవరు    : ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడే)
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : ఉక్రెయిన్‌పై అనైతిక యుద్ధం చేస్తోన్న రష్యాకు కట్టబెట్టిన ఆతిథ్య హక్కుల్ని రద్దు చేసిన నేపథ్యంలో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 16 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Mar 2022 07:55PM

Photo Stories