Skip to main content

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రాకు స్వ‌ర్ణ ప‌త‌కం

టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా అద్భుతం చేసి చూపించాడు.
ఆగ‌స్టు 7న‌ జ‌రిగిన‌ జావెలిన్‌ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ స్వర్ణం కొల్లగొట్టాడు. మొదటి నుంచి రౌండ్‌లోనే 87.03 మీటర్లు విసిరి టాప్‌ పొజీషన్‌లో ఉన్న నీరజ్‌ రెండో రౌండ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. ఆ తర్వాత మూడో రౌండ్లో 76. 79 మీటర్లు విసిరినప్పటికి తొలి రెండు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో తొలి స్థానంలో కొనసాగాడు. ఇక నాలుగో;ఐదో రౌండ్‌లో త్రో వేయడంలో విఫలమయ్యాడు.ఇక చివరగా ఆరో రౌండ్‌లో 84.24తో ముగించాడు. ఓవరాల్‌గా 87.58తో సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్‌ చోప్రా చరిత్రలోకెక్కాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో అభివన్‌ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు.

హ‌రియాణాకు చెందిన నీరజ్‌ చోప్రా పానిపట్‌ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్‌ చిన్న వయసులోనే ఇండియన్‌ ఆర్మీకి సెలక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో జావెలిన్‌ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Published date : 07 Aug 2021 06:22PM

Photo Stories