Skip to main content

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే(జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే) నియమితులయ్యారు.
ఈ మేరకు జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 29న ఆమోదం తెలిపారు. 2019, నవంబరు 18న జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే 47వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. 2018, అక్టోబర్ 3న 46వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం 2019, నవంబర్ 17తో ముగియనుంది. అధికారిక నియామక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న జడ్జీలలో, సీనియర్ జడ్జీని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.

జస్టిస్ బాబ్డే 1956, ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. నాగపూర్ యూనివర్సిటీలో లా చదువుకున్న ఆయన 1978, సెప్టెంబర్ 13న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 2013 ఏప్రిల్ నుంచి సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో కీలక కేసులను సమర్ధవంతంగా నిర్వహించిన జస్టిస్ బాబ్డే...ఇటీవలే ముగిసిన బాబ్రీ మసీదు భూవివాదం విచారణకు సంబంధించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే(జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే)
Published date : 29 Oct 2019 06:11PM

Photo Stories