Skip to main content

సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలు ప్రారంభమయ్యాయి.
Current Affairs
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 17న సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ సేవలను ప్రారంభించారు. దీనిద్వారా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత సులభంగా, సురక్షితంగా, డిజిటల్, క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. కెనరా బ్యాంకు, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో ఈ యూపీఐ సేవలు అందనున్నాయి. యూపీఐ సేవల ప్రారంభం సందర్భంగా సీఎం ప్రసంగించారు.

సీఎం ప్రసంగం-ప్రధానాంశాలు
  • రాష్ట్రంలోని ప్రతి గడప వద్దకూ ప్రభుత్వ సేవలు, పరిపాలనను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వలంటీర్ల వ్యవస్థను తెచ్చాం.
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 545కిపైగా సేవలందిస్తున్నాం.
  • ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి వారికి బాధ్యతను అప్పగించాం.
  • ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాం.

జేఎన్‌టీయూకు శాశ్వత భవనాలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 17న తన క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్ నొక్కడం ద్వారా నరసరావుపేటలో శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం రూ.80 కోట్ల వ్యయంతో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే ఏడాది మరో రూ.40 కోట్లు మౌలిక సదుపాయాల కోసం వ్యయం చేస్తామని, నరసరావుపేట జేఎన్‌టీయూ కోసం మొత్తం రూ.120 కోట్లు వెచ్చిస్తామని సీఎం ప్రకటించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఎందుకు : సచివాలయాల్లో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు
Published date : 18 Aug 2020 04:50PM

Photo Stories