Skip to main content

రామ మందిర నిర్మాణానికి భూమిపూజ

అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిరం ‘శ్రీ రామ జన్మభూమి మందిర్’ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.
Edu news సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్‌ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చీఫ్‌ సంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది.

తొలి ప్రధాని మోదీనే...
భూమి పూజ సందర్భంగా ‘సియా(సీతా)వర్‌ రామచంద్రజీ కీ జై’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ... రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికిస్ఫూర్తిప్రదాయినిగానిలుస్తుందన్నారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి ‘రామసేతు’ నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని వ్యాఖ్యానించారు. భూమి పూజ కంటే ముందుగా హనుమాన్ గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు.

నాగర శైలిలో..
ఐదు గుమ్మటాలు.. 161 అడుగుల ఎత్తయిన గోపురంతో అలరారనున్న రామ మందిరం ‘నాగర’శైలిలో నిర్మాణం కానుంది. మూడు అంతస్తుల ఈ మందిర నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పడుతుందని అంచనా. 1990లో సిద్ధమైన మందిర డిజైన్ లో తాజాగా పలు మార్పులు చేశారు. మందిర నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌ అశీష్‌ సోంపుర డిజైన్ ఇచ్చారు. దేవాలయ నిర్మాణ శైలుల్లో ‘నాగర‘అనేది ఒకటి కాగా, ద్రావిడ, బాసర్‌ అనేవి మిగతావి. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మందిరాన్ని నిర్మిస్తున్నారు

1528 నుంచి 2019 తీర్పు వరకు...
కొన్ని దశాబ్దాలుగా అయోధ్య భూ వివాదం దేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక మతపరమైన చర్చగా కొనసాగుతూ వచ్చింది. హిందూ, ముస్లింల మధ్య దశాబ్దాల వివాదానికి కారణం హిందువుల ఆరాధ్య దైవం రాముడి జన్మభూమిగా భావించే ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని భూమికి సంబంధించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదని, ఆ తరువాత దాన్ని పడగొట్టి బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినట్టు కొందరి విశ్వాసం. అయితే మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ ఆదేశాల మేరకు 1528వ సంవత్సరంలో మీర్‌ బఖీ ఇక్కడ మసీదు నిర్మించారని, అందువల్ల ఆ స్థలం తమదేననిముస్లింలు వాదిస్తూ వచ్చారు.

యాజమాన్య హక్కుల కోసం
ఈ దేవాలయం కూల్చి వేత, దాని స్థానంలో మసీదు నిర్మాణం ఈ రెండు వర్గాల మధ్య వివాదానికి తెరతీసింది. 1949లో హిందువులు రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి మసీదులో పెట్టడాన్ని కొందరు ముస్లింలుచూసినట్లు కొందరి వాదన. అప్పటి నుంచి ఈ స్థలంపై యాజమాన్యపు హక్కులు మావంటే మావని ఇరు వర్గాలు వాదిస్తూవచ్చాయి. ఫలితంగా ప్రభుత్వం ఈ స్థలాన్ని పూర్తిగా మూసివేసింది. ఈ స్థలాన్ని అప్పగించాలని కోరుతూ 1959, డిసెంబర్‌ 17న నిర్మోహిఅఖారాకోర్టుకెళ్ళింది. ఇదే స్థలంపై యాజమాన్య హక్కుల కోసం డిసెంబర్‌ 18, 1961న సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డ్‌కూడా కోర్టుని ఆశ్రయించింది. ఈ వివాదం ఇరువర్గాల మధ్య కొన్ని దశాబ్దాల పాటు ఘర్షణాత్మక పరిస్థితులకు దారితీసింది.

బాబ్రీ మసీదు కూల్చివేత
తరువాత డిసెంబర్‌ 6, 1992న హిందూ కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చి వేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మతకలహాలకు దారితీసింది. 2,000 మందికి పైగా చనిపోయారు. ఆ తరువాతి కాలంలో ఈ అంశం పై ఇరువర్గాలు దేశంలోని పలుకోర్టులను ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా, అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందు వులు, ముస్లింలు, నిర్మోహిఅఖారాల మధ్య విభజన చేయాలని అలహాబాద్‌ హైకోర్టు సెప్టెంబర్‌ 30, 2010న ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ఈ కేసుపై 2016లో తిరిగి విచారణ ప్రారంభించింది. ఈ వివాదం అత్యంత సున్నితమైందని, దీన్ని కోర్టు వెలుపల తేల్చు కోవాలని సుప్రీంకోర్టు 2017లో చెప్పింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు.

సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టు 2018లో ఈ కేసు విచారణకు ఐదు గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఆగస్టు 6, 2019 నుంచి అక్టోబర్‌ 16 వరకు రోజువారీ వాదనలు చేపట్టింది. తుది తీర్పుని నవంబర్‌ 9న వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు రామజన్మభూమి ట్రస్ట్‌కి చెందుతాయని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అలాగే అయోధ్యలోనే ప్రత్యామ్నాయంగా ముస్లింలకు మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మూడు నెలల్లోపు ట్రస్ట్‌ ఏర్పాటు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది.
Published date : 07 Aug 2020 04:04PM

Photo Stories