Skip to main content

పరిశ్రమలకు దన్నుగా వైఎస్సార్‌ ఏపీ వన్‌

ఓ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన మొదలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా జీవితకాలం అండగా నిలిచే విధంగా దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Current Affairs
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టభయం లేకుండా హ్యాండ్‌ హోల్డింగ్‌ కల్పించాలన్న ఉద్దేశంతో... 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ను పొందుపరిచారు. ఏపీఐఐసీ కార్యాలయంలో ఆగస్టు 10న జరిగిన కార్యక్రమంలో నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా విడుదల చేశారు.

నూతన విధానంలోని ముఖ్యాంశాలు
  • మహిళా సాధికారితలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు నెలకొల్పే పరిశ్రమలకు అధిక రాయితీలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానం రూపొందింది.
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా రంగాలవారీగా క్లస్టర్ల విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల యజమానులకు నిర్వహణ వ్యయం బాగా తగ్గేవిధంగా నూతన విధానం అవకాశం కల్పిస్తుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎస్‌సీలకు 16.2 శాతం, ఎస్‌టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

ఏపీ వన్‌లో 10 కీలక సేవలు..

వైఎస్‌ఆర్‌ ఏపీ వన్‌ ద్వారా 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించనుంది. ఇందుకోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఫెసిలిటేషన్‌ సెల్, మార్కెట్‌ రీసెర్చ్‌ సెల్, మార్కెటింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌ సెల్, సేల్స్‌ సపోర్ట్‌ సెల్, స్కీం సపోర్ట్‌ సెల్, ఎంఎస్‌ఎంఈరీవిటలైజేషన్‌ స్కీం, బిజినెస్‌ ఏనేబుల్‌మెంట్‌ సెల్, ఇన్వెస్టర్‌ రీచ్‌ ఔట్‌ సెల్, ఇన్సెంటివ్‌ మేనేజ్‌మెంట్‌ సెల్, స్పెషల్‌ కేటగిరీ సెల్‌ ఏర్పాటు చేసింది.

తగ్గనున్న పెట్టుబడి వ్యయం

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడి వ్యయం చాలా తక్కువయ్యే విధంగా అన్ని మౌలిక వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులను క్లస్టర్ల విధానంలో అభివృద్ధి చేయనున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రంగాలవారీగా పారిశ్రామిక క్లస్టర్లు, పార్కులు అభివృద్ధి చేయనున్నారు. బొమ్మల తయారీ, ఫర్నిచర్, ఫుట్‌వేర్‌లెదర్, మెషినరీ, ఏయిరోస్పేస్, డిఫెన్స్‌ వంటి రంగాల పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య, వారికున్న నైపుణ్యాలు, రాష్ట్రంలో ఉన్న యూనిట్లకు ఎంత మంది ఉద్యోగులు అవసరం? తదితర వివరాలన్నీ ఒకేచోట లభించేలా డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు స్కిల్డ్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020–23 నూతన పారిశ్రామిక విధానం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా
ఎక్కడ :ఏపీఐఐసీ కార్యాలయం, అమరావతి
Published date : 12 Aug 2020 09:54PM

Photo Stories