Skip to main content

మహిళల భద్రత కోసం అభయం యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?

ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన `అభయం ప్రాజెక్టు`(యాప్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది.
Current Affairs రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 23న తన క్యాంపు కార్యాలయంలో ఈ యాప్‌ను ప్రారంభించారు. తొలుత విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా 1,000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. 2021, నాటికి విజయవాడ, తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలను అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఎవరి పర్యవేక్షణలో...
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘అభయం’ పాజెక్టును అమలు చేయనున్నాయి. రవాణాశాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు అమలవుతుంది. దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
  • మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. దీనిలో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది.

ఏమిటీ ‘అభయం’?..
  • ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇది.
  • ఈ ప్రాజెక్టులో భాగంగా ఆటోలు, టాక్సీల్లో ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థిం‌గ్స్‌) ఉపకరణాన్ని అమరుస్తారు.
  • ఆటో/టాక్సీ ఎక్కిన వెంటనే అక్క చెల్లెమ్మలు స్మార్ట్ ఫోన్ ద్వారా వాహనానికి అంటించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి.
  • ఏదైనా ఆపద సమయంలో మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది.
  • స్మార్ట్ ఫోన్ లేకుంటే అభయం ఐఓటీ ఉపకరణంలో రెడ్ బటన్ నొక్కితే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని ఆదుకుంటారు. రెడ్ బటన్ నొక్కగానే అలారమ్ మోగడంతోపాటు వాహనం ఆగిపోతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అభయం యాప్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా...
ఎందుకు : ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం
Published date : 24 Nov 2020 06:29PM

Photo Stories