Skip to main content

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీకి నవంబర్ 8న రాజీనామా లేఖను సమర్పించారు.
ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఫడ్నవీస్‌ను గవర్నర్ కోరారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పక్షం రోజులు గడచినా.. ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ సాధించిన బీజేపీ, శివసేనల మధ్య అధికార పంపిణీ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం
దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో (ఆర్‌ఎస్‌ఎస్) సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ ఫడ్నవీస్ స్వస్థలం. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చదివారు.

1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించిన ఫడ్నవీస్ 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవిలో కొనసాగారు.

చదవండి: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : దేవేంద్ర ఫడ్నవీస్

మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
1. సత్యపాల్ మాలిక్
2. భగత్‌సింగ్ కోషియారీ
3. ద్రవుపాడి ముర్ము
4. ఆచార్య దేవవ్రత్
సమాధానం : 2

2. మహారాష్ట్రలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి?
1. 175
2. 119
3. 288
4. 151
సమాధానం : 3
Published date : 09 Nov 2019 06:01PM

Photo Stories