Skip to main content

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య

కడప దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్సార్ జిల్లాలో అజాతశత్రువుగా పేరుగాంచిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు.
పులివెందులలోని తన ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్నుమార్చి 15వేకువజామున దుండగులు తలపై నరికి దారుణంగా హత్య చేశారు. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా తలపై నరకడంతోనే మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.

పదునైన కత్తితో తలపై దాడి చేయడంతోనే: ఎస్పీ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి తలపై పదునైన కత్తితో నరకడం వల్లే చనిపోయారని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాకు మార్చి 15న మధ్యాహ్నం వెల్లడించారు. ‘ఉదయాన్నే తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఘటనాస్థలం పరిశీలిస్తే హత్య చేసినట్లుగా స్పష్టమైంది. తలపై బలమైన గాయాలవడం వల్లే మృతి చెందారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. హత్య ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటు చేశాం. క్లూస్ టీమ్ పరిశీలించింది.. వారికి కొన్ని ఆధారాలు లభించాయి. డ్రైవర్ పేరు మీద లెటర్ ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’అని సాయంత్రం మరోమారు ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

విలక్షణనాయకుడు..:
పులివెందుల సమితి ప్రెసిడెంటు.. ఎమ్మెల్యే.. కడప ఎంపీ.. రాష్ట్ర మంత్రి.. ఏ పదవిలో ఉన్నా, హోదాలతో నిమిత్తం లేకుండా సామాన్యులను గౌరవించడం ఆయన స్వభావం. అత్యంత మృదుస్వభావి. తాను చెప్పాలనుకున్న విషయం సున్నితంగా, సూటిగా వివరించే తత్వం ఆయన స్వంతం. తన సోదరుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా చిరుద్యోగులను సైతం సార్... అంటూ గౌరవంగా సంబోధించే వ్యక్తిత్వం. ప్రాంతం కోసం, ప్రజల ఉన్నతికోసం అంతే పట్టుదలతో మొండిగా పట్టుబట్టే మనస్తత్వం కలిగిన నేత. ఇన్ని సుగుణాలు కలగలిసిన నాయకుడే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి. వైఎస్సార్ జిల్లాలో విలక్షణ నాయకుడు. ప్రాంత ఉన్నతికోసం ఏస్థాయిలో ఆరాటం ప్రదర్శిస్తారో, నమ్ముకున్న వారికోసం అంతే పట్టుదలతో అండగా నిలుస్తారు. ఈ సుగుణమే ఆయన్ను దార్శనికుడుగా నిలిపింది. జిల్లాలో ఎక్కడికెళ్లినా రాజకీయాలకు అతీతంగా ఆదరించేవారు అధికం. స్వతహాగా ప్రత్యర్థులను సైతం అభిమానించే స్వభావి. మాట ఇచ్చారంటే ఎంత కష్టమైనా వెనుతిరగని ధీరత్వం కలిగిన నాయకుడు.

ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం ఆయన లక్షణం
పులివెందుల సమితి ప్రెసిడెంటుగా 1981లో వైఎస్ వివేకానందరెడ్డి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. రాయలసీమ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. ఆపై తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించడంతో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను వివేకానందరెడ్డి తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 1989లో తొలిసారిగా పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 47,746 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1994లో మరోమారు పులివెందుల ఎమ్మెల్యేగా 71,563 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో, కడప పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ వివేకా పోటీ చేశారు. 26,597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2004లో మరోమారు కడప ఎంపీగా పోటీ చేసిన ఆయన 1,29,744 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిత్యం ప్రజాజీవితంలో ఉన్న ఆయన పదవులు, హోదాతో నిమిత్తం లేకుండా ప్రజాసేవకు అంకితమయ్యారు. ఎంత ఎదిగినా అత్యంత అణకువగా మెలగడం ఆయనకే స్వంతమైంది.

అభివృద్ధి సాధించడంలో ప్రత్యేక చొరవ...
జిల్లా అభివృద్ధికోసం వైఎస్ వివేకానందరెడ్డి పరితపించేవారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలనే సంకల్పమున్న నాయకుడు కావడంతో.. నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన అనంతరం ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆయా పథకాలు సాధించేవారు. పులివెందుల గడ్డకు కృష్ణా జలాలు చేరుతున్నాయంటే అందులో ఆయన పాత్ర అత్యంత కీలకం. పైడిపాళెం రిజర్వాయర్ ఏర్పాటుకు తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో చర్చించి జీఎన్‌ఎస్‌ఎస్ పథకంలో ఆ ప్రాజెక్టును చేర్పించిన ఘనత ఆయనదే. పైడిపాళెం ప్రాజెక్టు పూర్తయి్యంది కాబట్టే నేడు పులివెందుల గడ్డపైకి కృష్ణా జలాలు చేరాయి. అంతేకాదు రైతులు చెల్లించిన ప్రీమియం మేరకు పంటల బీమా రాకపోతే.. ఎంపీగా ఆయన రైతులకోసం ప్రత్యక్ష ఆందోళన చేసిన ఘటనలెన్నో ఉన్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమంలో భాగంగా పులివెందులలో కొంతమంది బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌కు నిప్పుపెట్టారు. ఎంపీగా ఎంతో శ్రమకోర్చి పులివెందులలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మిస్తే నిప్పుపెట్టారనే ఆవేదన ఆయన్ను వెంటాడింది. నిప్పుపెట్టిన వారిపై చర్యలు చేపట్టాలని ధర్నా చేపట్టారు. ప్రాంతం వృద్ధికి పరితపించే గుణమున్న నేపథ్యమే ఇలాంటి చర్యలకు ఉపక్రమించేలా చేసిందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : వైఎస్ వివేకానందరెడ్డి
ఎక్కడ : పులివెందుల (వైఎస్సార్ కడప జిల్లా)
Published date : 16 Mar 2019 06:13PM

Photo Stories