కేరళలోని కోళీకోడ్‌లో ఘోర విమానం ప్రమాదం
Sakshi Education
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్–కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆగస్టు 7న కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లోని టేబుల్ టాప్ రన్ వేపై దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది.
భారీగా వర్షం పడుతుండటంతో రన్ వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. దాంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే సహా 17 మంది(ఆగస్టు 7నాటి వివరాల ప్రకారం) ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. రన్ వేపై చివరి వరకు విమానం వేగంగా వెళ్లి లోయలో పడి, రెండు ముక్కలుగా విరిగిపోయిందని డీజీసీఏ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విమానం ప్రమాదంలో 17 మంది మృతి
ఎప్పుడు : ఆగస్టు 7
ఎక్కడ : కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్, కేరళ
ఎందుకు :భారీ వర్షం కారణంగా
Published date : 08 Aug 2020 08:49PM