Skip to main content

కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్

జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం-2019’ భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ 144వ జయంతి రోజైన2019, అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ అవతరించాయి. దీంతో దేశంలోని రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 నుంచి 9కి పెరిగింది.

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019, ఆగస్టు 5వ తేదీన కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ల ప్రమాణం
నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్‌జీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము, లదాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న ప్రమాణం స్వీకారం చేశారు. లదాఖ్ రాజధాని లెహ్‌లో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ మాథుర్(ఆర్‌కే మాథుర్)తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గిరీశ్ చందర్ ముర్ము(జీసీ ముర్ము)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.
 

           జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్ విడుదల

Published date : 01 Nov 2019 06:28PM

Photo Stories