Skip to main content

జీశాట్-30 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘జీ శాట్-30’ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.
Current Affairs3,357 కిలోలు బరువు కలిగిన సమాచార ఉపగ్రహం జీశాట్-30ని జనవరి 17న ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. 38 నిమిషాల 25 సెకండ్ల తరువాత ఉపగ్రహం క్షేమంగా భూస్థిర బదిలీ కక్ష్యను చేరింది. అత్యున్నత నాణ్యతతో కూడిన టీవీ, టెలీకం, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు లక్ష్యంగా జీ శాట్-30ని రూపొందించారు.

ఎంసీఎఫ్ ఆధీనంలోకి..
జీ శాట్-30 ఉపగ్రహం కక్ష్యకు చేరగానే కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కమాండ్ ఫెసిలిటీ(ఎంసీఎఫ్) దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఉపగ్రహ ప్రాథమిక పనితీరును పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో క్రమంగా జీశాట్ ఉపగ్రహాన్ని భూమధ్యరేఖకు 36 వేల కిమీల ఎత్తులో ఉన్న భూ స్థిర కక్ష్యలోకి చేరుస్తారు. ఆ తరువాత ఆ ఉపగ్రహం తన విధులను నిర్వర్తించడం ప్రారంభిస్తుంది.

జీ శాట్-30 ఉపగ్రహ విశేషాలు
  • బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో జీశాట్-30ని ఇస్రో రూపొందించింది.
  • ఈ ఉపగ్రహంలో 12సీ, 12కేయూ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లను పొందుపర్చారు. కేయూ బ్యాండ్ల ద్వారా భారత్‌కు, సీ బ్యాండ్ల ద్వారా ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాలకు సమాచార సేవలందుతాయి.
  • డీటీహెచ్, టీవీ అప్‌లింక్ సహా ఏటీఎం, స్టాక్ ఎక్సేంజ్, టెలిపోర్ట్ సర్వీసెస్, డిజిటల్ సాటిలైట్ న్యూస్ గాదరింగ్, ఈ గవర్నెన్స్, డేటా ట్రాన్స్ ఫర్ తదితర వీసాట్ అవసరాలను జీశాట్-30 దాదాపు 15 ఏళ్లపాటు తీర్చగలదు.
  • ఇన్‌శాట్ - 4ఏకు ఈ జీశాట్-30 ప్రత్యామ్నాయమని ఇస్రో పేర్కొంది. 2005లో ప్రయోగించిన ఇన్‌శాట్- 4ఏ కాలపరిమితి త్వరలో ముగియనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జీ శాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
ఎక్కడ : ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం
ఎందుకు : అత్యున్నత నాణ్యతతో కూడిన టీవీ, టెలీకం, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు లక్ష్యంగా

మాదిరి ప్రశ్నలు
Published date : 18 Jan 2020 05:47PM

Photo Stories