Skip to main content

ఇటీవల పునఃప్రారంభమైన బాపు మ్యూజియం ఏ జిల్లాలో ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియం పునఃప్రారంభమైంది.
Current Affairs
రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 1న ప్రారంభించారు. మ్యూజియం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం పునః ప్రతిష్టించారు. అనంతరం మ్యూజియంను పరిశీలించిన ఆయన సందర్శకుల పుస్తకంలో 'Impressive Collection of Artifacts' (కళాఖండాల అద్భుతమైన సేకరణ) అని రాశారు.

దేశంలోనే మొదటిసారిగా...
మ్యూజియం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘దేశంలోనే మొదటిసారిగా మ్యూజియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రదర్శిత వస్తువులు ఒక యాప్ ద్వారా తమ చరిత్రను తామే చెప్పుకునే విధంగా మ్యూజియాన్ని రూపుదిద్దడం భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది’ అని అన్నారు. ఆదిమ మానవ యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 పురాతన వస్తువులకు సాంకేతికతను మేళవించి ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత..
తొలి చారిత్రక యుగ గ్యాలరీ: ఇందులో 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆదిమ మానవుడు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవ పేటిక, మట్టి బొమ్మలు కుండ పెంకులు సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి.
బుద్ధ జైన గ్యాలరీ: ఇందులో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు.
హిందూ శిల్ప కళా గ్యాలరీ: దీనిలో వివిధ హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు.
నాణెములు-శాసనముల గ్యాలరీ: క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి క్రీ.శ 20వ శతాబ్ధం వరకు ఉన్న వివిధ రాజ వంశముల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణెములను ప్రదర్శనకు పెట్టారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : బాపు మ్యూజియం పునఃప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, కృష్ణా, ఆంధ్రప్రదేశ్
Published date : 02 Oct 2020 05:16PM

Photo Stories