Skip to main content

ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఎంవోయూ చేసుకున్న నాలుగు ప్రముఖ సంస్థలు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో నాలుగు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి.
Current Affairsనవంబర్ 12న వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో ఐబీఎం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్పీఐ), ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలు ఏపీఎస్‌ఎస్‌డీసీతో భాగస్వామ్యం అయ్యాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా మధుసూదన రెడ్డి ఉన్నారు. ఒప్పంద వివరాలను పరిశీలిస్తే...

ఐబీఎం ఇండియా...
ఈ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేయనుంది. ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, బ్లాక్ చెయిన్, డేటా సైన్స్ - అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా, ఫుల్ స్టాక్ తదితర కోర్సులు, ఇతర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తుంది.

ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ...
విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ తదితర కోర్సులతో పాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇస్తుంది.

సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్...
అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ - ఫుడ్ ప్రాసెసింగ్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు, నిర్వహణకు ఈ సంస్థ ముందుకు వచ్చింది.

ఐటీడీసీ...
ఆతిథ్య రంగంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కు అవసరమైన సహాయ సహకారాలను భారత పర్యాటకాభివృద్ధి సంస్థ అందజేస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటీడీసీ రూపొందిస్తుంది.
Published date : 13 Nov 2020 05:55PM

Photo Stories