Skip to main content

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అమరావతిలో సెప్టెంబర్ 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త ఇసుక విధానంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను అందజేసే నూతన విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇసుకపై ఇదీ విధానం..
రాష్ట్రంలో ఇసుక తవ్వకం, రవాణాను ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కాార్పొరేషన్ (ఏపీఎండీసీ) చేపట్టనుంది. ఇసుకపై పర్యావరణ హితమైన కొత్త విధానం సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా ఖర్చును నిర్థారించారు. 10 కిలోమీటర్ల లోపు వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా ఖర్చు రూ.500గా నిర్ణయించారు.

కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
  • 3.97 లక్షల మంది ఆటో, టాక్సీవాలాలకు రూ.397.93 కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సొంతంగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇస్తారు.
  • శ్రీరామనవమి నుంచి పెంచిన ‘వైఎస్‌ఆర్ పెళ్లి కానుక’ను అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఏడాదికి రూ.746.55 కోట్లు ఖర్చు కానుంది.
  • ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 నుంచి 2019 వరకు పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. ఇందుకోసం రూ. 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
  • డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాయనున్నారు.
  • కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం వద్ద డీఆర్డీఓకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అక్కడ రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థను డీఆర్డీఓ ఏర్పాటు చేయనుంది.
  • చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఇంటర్మీడియట్ లెవల్ పంపింగ్ కోసం సుమారు 25 ఎకరాలు భూమిని కేబినెట్ కేటాయించింది.
  • నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో దేకనకొండ బ్రాడ్‌గేజ్ కోసం 20.19 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు.
  • మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25 (ఎక్స్‌అఫీషియో సభ్యుడు కాకుండా)కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2005 నుంచి మావోయిస్టులపై నిషేధం కొనసాగుతోంది.
  • నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3,216.11 కోట్ల టెండర్ రద్దును కేబినెట్ ఆమోదించింది.
Published date : 06 Sep 2019 05:37PM

Photo Stories