Skip to main content

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు(72) కన్నుమూశారు.
హైదరాబాద్‌లో తన స్వగృహంలో సెప్టెంబర్ 16న ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న కోడెలను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించినప్పటికీ కోడెల మృతి చెందారని ఆస్పత్రి వైద్యులు సెప్టెంబర్ 16న ప్రకటించారు.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2వ తేదీన సంజీవయ్య, లక్మీనర్సమ్మ దంపతులకు కోడెల శివప్రసాదరావు జన్మించారు. ప్రముఖ వైద్యుడిగా నరసరావుపేట ప్రాంతంలో పేరుపొందారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కోడెల ఎన్టీఆర్, చంద్రబాబునాయడు హయాంలో మంత్రి పదవులు చేపట్టారు. 1987 నుంచి 1988 వరకు హోం శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 1996 నుంచి 1997 మధ్య భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా, 1997 నుంచి 1999 మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : కోడెల శివప్రసాదరావు(72)
ఎక్కడ : హైదరాబాద్
Published date : 17 Sep 2019 05:47PM

Photo Stories