Skip to main content

దేశంలో వీవీఐపీల ప్రయాణం కోసం తయారు చేసిన ప్రత్యేక విమానం?

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ‘ఎయిర్ ఇండియా వన్’ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది.
Current Affairs

అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన ఈ ‘బోయింగ్-777 విమానం’ అమెరికాలోని టెక్సాస్ నుంచి అక్టోబర్ 1న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు.

విమానంపై అశోక చక్రం...
వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్(అమెరికా)లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. 2020, జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రి ఎయిర్‌ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు.

ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు...

  • ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు.
  • ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్‌పీఎస్)ను అమర్చారు.
  • అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు.
  • అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఒకసారి ఇంధనం నింపితే ఏకబిగిన 17 గంటలు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది.
  • కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
  • విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది.
  • ఈ రెండు విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది.
  • ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు.
  • ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు.
Published date : 02 Oct 2020 05:30PM

Photo Stories