భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ముకేశ్
Sakshi Education
భారత్‌లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ముకేశ్ సంపద రూ.3,80,700 కోట్లుగా ఉంది.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 25న విడుదలైన ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ముకేశ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా జాబితాలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్‌పీ హిందూజా అండ్ ఫ్యామిలీ రెండవ స్థానంలో నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లుగా ఉంది. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు.
హురున్ రిచ్ లిస్ట్-ముఖ్యాంశాలు
భారత్‌లో టాప్-10 కుబేరులు...
హురున్ రిచ్ లిస్ట్-ముఖ్యాంశాలు
- రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే.
- అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు.
- రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం.
- సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2 శాతం పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది.
- మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26శాతం) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి.
- స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు.
- జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు.
- సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ నుంచి ఉన్నారు.
భారత్‌లో టాప్-10 కుబేరులు...
ర్యాంకు | వ్యక్తి | కంపెనీ | సంపద (రూ. కోట్లలో) |
1 | ముకేశ్ అంబానీ | రిలయన్స్ ఇండస్ట్రీస్ | 3,80,700 |
2 | హిందూజా సోదరులు | హిందూజా గ్రూప్ | 1,86,500 |
3 | అజీమ్ ప్రేమ్‌జీ | విప్రో | 1,17,100 |
4 | లక్ష్మీ నివాస్ మిట్టల్ | ఆర్సెలర్ మిట్టల్ | 1,07,300 |
5 | గౌతమ్ అదానీ | అదానీ ఎంటర్‌ప్రెజైస్ | 94,500 |
6 | ఉదయ్ కోటక్ | కోటక్ మహీంద్రా బ్యాంక్ | 94,100 |
7 | సైరస్ ఎస్ పూనావాలా | సీరమ్ ఇన్‌స్టిట్యూట్ | 88,800 |
8 | సైరస్ పలోంజీ మిస్త్రీ | షాపూర్‌జీ పలోంజీ గ్రూప్ | 76,800 |
9 | షాపూర్ పలోంజీ | షాపూర్‌జీ పలోంజీ గ్రూప్ | 76,800 |
10 | దిలీప్ సింఘ్వీ | సన్ ఫార్మా ఇండస్ట్రీస్ | 71,500 |
Published date : 26 Sep 2019 08:07PM