Skip to main content

భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా

దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 7న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన రూ.31,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో రెండు థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు సహా జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మించతలపెట్టిన హైడ్రో ప్రాజెక్టు కూడా ఉంది.

మరికొన్ని కేబినెట్ కమిటీ నిర్ణయాలు...
  • రుణ సమస్యల్లో చిక్కుకున్న ల్యాంకో గ్రూపునకు చెందిన 500 మెగావాట్ల తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును (సిక్కిం) ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలుకు అనుమతి.
  • 25 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు హోదా ఇవ్వడం.
  • బిహార్‌లోని బుక్సర్‌లో ఒక్కోటి 660 మెగావాట్ల రెండు యూనిట్లను రూ.10,439 కోట్లతో ప్రభుత్వరంగ ఎస్‌జేవీఎన్ అనుబంధ కంపెనీ ఎస్‌జేవీఎన్ థర్మల్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం.
  • ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 660 మెగావాట్ల రెండు సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను రూ.11,089 కోట్ల వ్యయ అంచనాలతో ఏర్పాటుకు ఆమోదం.
  • కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంపై నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు గాను ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అధికారాలను కట్టబెడుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) 2017లో ఏర్పాటైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 08 Mar 2019 04:39PM

Photo Stories