Skip to main content

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం విఫలం

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదా కేసులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైంది.
ఈ మేరకు ఆగస్టు 2న సుప్రీంకోర్టుకు కమిటీ తన నివేదికను సమర్పించింది. క్లిష్టమైన అయోధ్య సమస్యకు హిందూ, ముస్లిం వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించడం లేదని నివేదికలో కమిటీ పేర్కొంది.

తామే విచారణ చేపడతాం...
రాజకీయంగా సున్నితమైన అయోధ్యకేసుకి మధ్యవర్తిత్వ కమిటీ పరిష్కారం చూపనందున ఇక ఈ కేసును తామే ప్రతి రోజూ విచారిస్తామని సుప్రీంకోర్టు ఆగస్టు 2న వెల్లడించింది. ఈ కేసుపై ఆగస్టు 6 నుంచి బహిరంగంగా విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

మధ్యవర్తిత్వం సాగిన తీరు...
  • అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
  • ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి.
  • వీటిని విచారించిన ధర్మాసనం మధ్యవర్తిత్వానికి ఒక అవకాశం ఇవ్వాలని భావించింది.
  • 2019, మార్చి 8న జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిత్వంలో పేరొందిన శ్రీరామ్ పంచు సభ్యులుగా త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది.
  • అయోధ్యకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇవన్నీ రహస్యంగా జరగాలని కమిటీని కోర్టు ఆదేశించింది.
  • ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.
  • జులై 18 వరకు జరిగిన పురోగతిపై కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నివేదికలోని వివరాలన్నీ రహస్యంగానే ఉంటాయని స్పష్టం చేసింది.
  • పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయనీ, మరికొంత సమయం కావాలని కమిటీ కోరడంతో, ఆగస్టు 15 వరకు కోర్టు గడువిచ్చింది.
  • ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఆ విషయాన్ని పేర్కొంటూ కమిటీ ముందుగానే నివేదికను సమర్పించింది.
Published date : 03 Aug 2019 05:47PM

Photo Stories