Skip to main content

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో కలిస్, లీసా, జహీర్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో మరో ముగ్గురు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
Current Affairs
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌కలిస్‌... అలనాటి పాకిస్తాన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మన్, మాజీ సారథి జహీర్‌ అబ్బాస్‌... ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ లీసా స్థాలేకర్‌ కొత్తగా ఈ జాబితాలో చేరినట్లు ఆగస్టు 23న ఐసీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో షాన్‌ పొలాక్‌తో పాటు భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ పాల్గొన్నారు.

జాక్వస్‌కలిస్‌...
దక్షిణాఫ్రికా తరఫున 1995– 2014 మధ్య కాలంలో 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో కలిస్‌ ప్రాతినిధ్యం వహించాడు. సఫారీల తరఫున టెస్టుల్లో అత్యధికంగా 13,289 పరుగులు చేసి 292 వికెట్లు తీశాడు. వన్డేల్లో 11,579 పరుగులు సాధించి 273 వికెట్లు పడగొట్టాడు. గ్రేమ్‌ పొలాక్, బ్యారీ రిచర్డ్స్, డొనాల్డ్‌ తర్వాత ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు పొందిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ కలిస్‌.

లీసా స్థాలేకర్‌...
మహిళల వన్డే ప్రపంచకప్‌ (2005, 2013), టి20 ప్రపంచ కప్‌ (2010, 2012) గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యురాలైన 41 ఏళ్ల లీసా స్థాలేకర్‌... భారత్‌లోని పుణే నగరంలో పుట్టి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం పొందిన ఐదో మహిళా క్రికెటర్‌ లీసా. తన కెరీర్‌లో 8 టెస్టులు ఆడి 416 పరుగులు చేసి, 23 వికెట్లు తీసింది. 125 వన్డేలు ఆడి 2,728 పరుగులు చేసి 146 వికెట్లు పడగొట్టింది. 54 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన లీసా 769 పరుగులు చేసి 60 వికెట్లు తీసింది.

జహీర్‌ అబ్బాస్‌...
హనీఫ్‌ మొహమ్మద్, ఇమ్రాన్‌ ఖాన్, జావెద్‌ మియాందాద్, వసీమ్‌ అక్రమ్, వకార్‌ యూనిస్‌ తర్వాత ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం సంపాదించిన ఆరో పాకిస్తాన్‌ ప్లేయర్‌ జహీర్‌ అబ్బాస్‌. 73 ఏళ్ల జహీర్‌ అబ్బాస్‌ 1969 నుంచి 1985 వరకు పాక్‌ జట్టు తరఫున ఆడారు. 78 టెస్టులు ఆడిన ఆయన 5,062 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 62 వన్డేలు ఆడిన అబ్బాస్‌ 2,572 పరుగులు చేశారు. ఇందులో 7 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ఆసియా క్రికెటర్‌ జహీర్‌ అబ్బాస్‌ కావడం విశేషం.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లోచోటు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌కలిస్‌... అలనాటి పాకిస్తాన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మన్, మాజీ సారథి జహీర్‌ అబ్బాస్‌... ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ లీసా స్థాలేకర్‌
Published date : 24 Aug 2020 08:17PM

Photo Stories