CM Revanth Reddy:కేలండర్‌ ప్రకారమే ఉద్యోగాలు!... మార్చి 31లోగా గ్రూప్‌–1 నియామకాలు పూర్తి :సీఎం రేవంత్‌

CM Revanth Reddy:కేలండర్‌ ప్రకారమే ఉద్యోగాలు!... మార్చి 31లోగా గ్రూప్‌–1 నియామకాలు పూర్తి :సీఎం రేవంత్‌

 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ కేలండర్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్‌–1 పరీక్ష నిర్వహించలేదని.. తాము అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు. 

సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం కింద ఆదివారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. 

ఇదీ చదవండి: Telangana High Court and District Courts 1673 jobs

సివిల్స్‌లో సత్తా చాటండి 
సివిల్స్‌లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం బిహార్‌ నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికవుతున్నారని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకంగా భావించాలని కోరారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.  

ఢిల్లీలో సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత బస: భట్టి విక్రమార్క 
సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సివిల్స్‌ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ పక్షాన ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది సివిల్స్‌ తుది పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

సింగరేణి కార్మికుల సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. సింగరేణిలో తవ్వి వదిలేసిన గనులు, ఇతర ఖాళీ స్థలాల్లో సోలార్, పంప్డ్‌ స్టోరేజ్‌ ద్వారా గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ సుస్థిర మనుగడ కోసం దేశవ్యాప్తంగా లిథియం, గ్రాఫైట్‌ వంటి మైనింగ్‌ రంగాల్లో విస్తరించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. 

ఇదీ చదవండి: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన కంప్యూటర్‌ కమాండర్‌....సిద్ధార్థ శ్రీవాత్సవ్‌.

సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు. ఈ కార్రక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.    

#Tags