ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్ కాలేజీలల్లో ఎంబీబీఎస్ సీట్లు
కోల్‌బెల్ట్ (జయశంకర్ భూపాలపల్లి): ఆ ఇంట్లోని ముగ్గురు పిల్లలు గజ ఈతగాళ్లు... పోటీకి వెళ్లారంటే జాతీయ, రాష్ట్ర స్థాయి పతకాలు రావాల్సిందే. అలా వందలాది పతకాలను సాధించిన ముగ్గురూ.. ఒకే ఏడాది మెడికల్ కళాశాలల్లో సీట్లనూ సాధించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన వరకోటి మదన్‌మోహన్, రజిత దంపతులకు కుమారుడు దత్త వెంకటసాయి, కవలలు అక్షిత, దక్షిత ఉన్నారు. చిన్నప్పటినుంచే ఈతలో మక్కువ కనబరుస్తుండటంతో సింగరేణి ఈత కొలనులో శిక్షణ ఇప్పించారు. అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న ముగ్గురూ వంద పతకాలు సాధించారు. చదువులోనూ వీరు చురుకే. దత్త వెంకటసాయి 2018లో, అక్షిత, దీక్షిత 2019లో ఇంటర్ పూర్తిచేశారు. తల్లిదండ్రుల ఆశయం మేరకు ఇంటర్ పూర్తయ్యాక ముగ్గురూ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. తాజాగా దీక్షిత, అక్షితకు వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో, దత్త వెంకటసాయికి కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ప్రవేశాలు పొందారు. ఈ సందర్భంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులనూ పలువురు అభినందించారు.