ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు ఎంత?

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లని డిసెంబర్ 8న నేపాల్, చైనా దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.
1954లో ప్రకటించిన ఎత్తు 8,848 మీటర్ల కన్నా ఇది 86 సెంటీమీటర్లు అధికం. నేపాల్‌లో 2015లో సంభవించిన భారీ భూకంపం కారణంగా శిఖరం ఎత్తు మారిఉంటుందన్న అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 2017లో ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని నేపాల్ మొదలుపెట్టింది. ఇందుకోసం చైనా సాయం తీసుకుంది.

2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా.. ఎవరెస్ట్ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు చైనా, నేపాల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలా ఏడాది పాటు సర్వే జరిపిన అనంతరం సవరించిన ఎత్తును డిసెంబర్ 8న రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. శిఖరం ఎత్తును తెలుసుకోవడం వల్ల హిమాలయాల్లో, టిబెట్ పీఠభూమిలో ఎలివేషన్ మార్పుల అధ్యయనానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఎవరెస్ట్ గురించి...
  • 1954లో సర్వే ఆఫ్ ఇండియా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా నిర్ధారించింది. ఈ కొలతలనే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించారు.
  • గతంలో పలుమార్లు ఎవరెస్ట్ ఎత్తుపై చైనా సర్వేలు చేపట్టింది. చివరగా 2005లో చేసిన ప్రకటనలో ఈ శిఖరం ఎత్తు 8,844.43 మీటర్లే అని చెప్పింది.
  • ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌లో సాగర్‌మాత అని, టిబెట్‌లో చోమోలుంగ్‌‌మ అని పిలుస్తారు.
  • ఎవరెస్ట్ శిఖరం ఇరు దేశాలలోనూ విస్తరించి ఉంది. కానీ, దీని శిఖరాగ్రం మాత్రం నేపాల్‌లో ఉంది.
టెథీస్ సముద్రం నుంచి...
భారత ఉపఖండ ఫలకం, యూరోసియన్ ఫలకం మధ్యలో మౌంట్ ఎవరెస్ట్ ఉంది. ఈ ప్రాంతంలో కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల యూరోసియన్ ఫలకం లోనికి భారత ఫలకం చొచ్చుకుపోతూ ఉంటుంది. దీంతో కొన్ని లక్షల సంవత్సరాల కింద ఉన్న టెథీస్ అనే సముద్రం నుంచి హిమాలయాలు ఆవిర్భవించాయి. ఈ ఫలకాల నిత్య సంఘర్షణతో హిమాలయాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : నేపాల్, చైనా
#Tags