Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 6 కరెంట్‌ అఫైర్స్‌

Corona Virsus: కోవిడ్‌ సంబంధ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం?

కరోనా కట్టడి కోసం యాంటీవైరల్‌ మాత్రలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్‌ లాగెవ్రియో (మోల్నూపిరావిర్‌)ని కోవిడ్‌ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్‌కు చెందిన ది మెడిసన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) నవంబర్‌ 4న అనుమతులు మంజూరు చేసింది. దీంతో ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్‌ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిచింది. రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరపిటిక్స్, మెర్క్‌ షార్ప్‌ అండ్‌ ధోమె (ఎంఎస్‌డీ) కంపెనీలు సంయుక్తంగా మోల్నూపిరావిర్‌ మాత్రను రూపొందించాయి.

త్వరలో మార్కెట్లోకి ఫైజర్‌ మాత్ర..
అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్‌ కంపెనీ తయారు చేసిన మాత్ర 90 శాతం కరోనా మరణాలను నివారిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్‌ కంపెనీ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మైకేల్‌ డోల్‌స్టెన్‌ నవంబర్‌ 5న వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కోవిడ్‌ సంబంధ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 4
ఎవరు    : యునైటెడ్‌ కింగ్‌డ్‌
ఎందుకు : ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్‌ లాగెవ్రియో (మోల్నూపిరావిర్‌)ని కోవిడ్‌ చికిత్సకి అనుమతించినందున...


Shankaracharya Statue: ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రాంరభించారు?

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రప్రయాగ్‌ జిల్లా కేదార్‌నాథ్‌లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని, ఆయన విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 5న శంకుస్థాపన చేశారు. అలాగే కేదార్‌నాథ్‌లో రూ.400 కోట్లకు పైగా విలువైన పునర్నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలోని కాలడి గ్రామంలో జన్మించిన ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.

ఎక్కడ జరిగిన దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 4న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మారుతున్న ప్రపంచం, మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా... దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పునర్నిర్మించిన ఆది శంకరాచార్య విగ్రహావిష్కరణ
ఎప్పుడు : నవంబర్‌ 4
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : కేదార్‌నాథ్, రుద్రప్రయాగ్‌ జిల్లా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం


T20 World Cup 2021: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌?

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. నవంబర్‌ 6న ఆస్ట్రేలియాతో జరిగే టి20 ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌ అతని కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కానుంది. 2004లో తొలి మ్యాచ్‌ ఆడిన బ్రావో విండీస్‌ జట్టు పరిమిత ఓవర్ల విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2012, 2016లలో టి20 వరల్డ్‌కప్‌ నెగ్గిన టీమ్‌ లో ఉన్న బ్రావో... 2004 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన టీమ్‌లో కూడా సభ్యుడు. 2010 తర్వాత టెస్టుల నుంచి తప్పుకొని బ్రావో పూర్తిగా వన్డేలు, టి20లపైనే దృష్టి పెట్టాడు. బ్రావో 90 అంతర్జాతీయ టి20ల్లో 1,245 పరుగులు చేసి, 78 వికెట్లు పడగొట్టాడు.


AIBA: వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌-2021కు ఆతిథ్యం ఇచ్చిన నగరం?

ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌(2021 ఏఐబీఏ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌) భారత బాక్సర్‌ ఆకాశ్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో నవంబర్‌ 5న జరిగిన 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్‌ 0–5తో మక్మూద్‌ సబీర్‌ఖాన్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన ఆకాశ్‌కు 25 వేల డాలర్ల (రూ. 18 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.

అమిత్‌ పంఘాల్‌ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్‌ సింగ్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధూరి (2017), మనీశ్‌ కౌశిక్‌ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్‌ పంఘాల్‌ (2019) రజతం సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌(2021 ఏఐబీఏ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌)లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్‌?
ఎప్పుడు  : నవంబర్‌ 4
ఎవరు    : ఆకాశ్‌ కుమార్‌
ఎక్కడ    : బెల్‌గ్రేడ్, సెర్బియా
ఎందుకు : 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్‌ 0–5తో మక్మూద్‌ సబీర్‌ఖాన్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయినందున...


IFFI: ఇండియన్‌ పనోరమ వేడుకలను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?

గోవా రాష్ట్ర రాజధాని పనాజిలో ఇండియన్‌ పనోరమా 52వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)ను నిర్వహించనున్నారు. 2021, నవంబర్‌ 20 నుంచి 28 వరకూ తొమ్మిదిరోజులపాటు జరిగే ఈ వేడుకల్లో 25 ఫీచర్‌ ఫిల్మ్‌లు, 20 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌లు ప్రదర్శించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ కూచిపూడి నృత్య కారిణి సంధ్యా రాజు నటించి, నిర్మించిన తెలుగు చిత్రం ‘‘నాట్యం’’ను ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. రేవంత్‌కుమార్‌ కోరుకొండ దర్శకత్వం వహించిన నాట్యం చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొంది.

కూచిపూడి...
కూచిపూడి నృత్యం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాలోని కూచిపూడి (మొవ్వ మండలం) గ్రామంలో ఆవిర్భవించింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది.

కొందరు ప్రముఖ కూచిపూడి నర్తకులు

  • వెంపటి చినసత్యం
  • వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
  • ఉమా రామారావు
  • తాడేపల్లి పేరయ్య
  • చింతా కృష్ణమూర్తి
  • సి.ఆర్‌.ఆచార్యులు
  • నటరాజ రామకృష్ణ
  • శోభా నాయుడు
  • పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ
  • యామినీ కృష్ణమూర్తి
  • స్వప్నసుందరి
  • రాధారెడ్డి, రాజారెడ్డి
  • మంజు భార్గవి
  • వెంపటి రవి
  • వేదాంతం సత్యనారాయణ శర్మ
  • వేదాంతం వెంకట నాగ చలపతిరావు
  • వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్‌
  • ఆనంద శంకర్‌ జయంత్‌
  • పద్మజా రెడ్డి
  • యేలేశ్వరపు శ్రీనివాసులు
  • పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక

 

Father of the Indian Navy: భారత నావికా పితామహుడిగా ఎవరిని భావిస్తారు?

డిసెంబర్‌ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే భారత నావికాదళ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పు నౌకాదళం ఆహ్వానించింది. నవంబర్‌ 5న తాడేపల్లిలోని సీఎం నివాసంలో తూర్పు నౌకా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ ఇతర నౌకాదళ అధికారులతో పాటు సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేవీ డే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పేరుతో ముంబైలో నిర్మిస్తున్న యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

నేవీ డే కథ...
బంగ్లాదేశ్‌ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్‌–పాక్‌ మధ్య 1971 డిసెంబర్‌ 3న మొదలైన యుద్ధం డిసెంబర్‌ 16న పాకిస్తాన్‌ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్‌ 4న పాకిస్తాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్‌ 4న ‘భారత నౌకాదళ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. 17వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లేను ‘భారత నావికా పితామహుడి9(ఫాదర్‌ ఆఫ్‌ ద ఇండియన్‌ నేవీ)‘గా భావిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : డిసెంబర్‌ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే భారత నావికాదళ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం
ఎప్పుడు : నవంబర్‌ 5
ఎవరు    : తూర్పు నౌకా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌
ఎక్కడ : తాడేపల్లి, గుంటూరు జిల్లా 


Deepavali Day Act: దీపావళిని సెలవు బిల్లును ఏ దేశంలో ప్రవేశపెట్టారు?

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే దీపావళి పండుగ రోజును జాతీయ సెలవు రోజుగా ప్రకటించాలని అమెరికా కాంగ్రెస్‌లో దీపావళి డే బిల్లును ప్రవేశపెట్టారు. దీపావళి డే బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు న్యూయార్క్‌కు చెందిన కాంగ్రెస్‌ మహిళ కరోలిన్‌ బి మలోనీ నేతృత్వంలోని చట్టసభ సభ్యులు నవంబర్‌ 3న ప్రకటించారు. ఈ బిల్లుకు భారతీయ–అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా అనేక మంది చట్టసభ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఆమోద ముద్ర పడితే ఇకపై అమెరికాలో దీపావళి రోజున అధికారికంగా సెలవుగా ప్రకటిస్తారు.

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి పేరు?
దీపావళి మర్నాడు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరుపుకునే గోవర్ధన్‌ పూజను పురస్కరించుకొని ప్రజాసంక్షేమం, రాష్ట్ర సుసంపన్నం కోసమని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లా జంజ్‌గిరి గ్రామంలో నవంబర్‌ 5న జరిగిన వేడుకల్లో సీఎం భూపేశ్‌ పాల్గొని, కొరడా దెబ్బలు తిన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అమెరికా కాంగ్రెస్‌లో దీపావళి డే బిల్లు 
ఎప్పుడు : నవంబర్‌ 3
ఎవరు    : న్యూయార్క్‌కు చెందిన కాంగ్రెస్‌ మహిళ కరోలిన్‌ బి మలోనీ 
ఎందుకు : భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే దీపావళి పండుగ రోజును జాతీయ సెలవు రోజుగా ప్రకటించాలని...


Booker Prize 2021: బుకర్‌ ప్రైజ్‌ విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా రచయిత?

దక్షిణాఫ్రికా రచయిత డామన్‌ గల్గుట్‌ను ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ‘బుకర్‌ ప్రైజ్‌’ వరించింది. డామన్‌ రచించిన ‘‘ది ప్రామిస్‌’’ నవలకు గాను 2021 ఏడాది బుకర్‌ ప్రైజ్‌ లభించింది. ఈ మేరకు నవంబర్‌ 3న ప్రకటన వెలువడింది. బుకర్‌ ప్రైజ్‌ విజేతకు 50వేల పౌండ్ల(దాదాపు రూ. 50 లక్షలకుపైగా) నగదును అందిస్తారు. ది ప్రామిస్‌ నవల దక్షిణాఫ్రికా జాత్యహంకార చరిత్రతో ఒక శ్వేతజాతి కుటుంబం గురించి వివరిస్తుంది. ఒక శ్వేతజాతి మహిళ... నల్లజాతికి చెందిన పనిమనిషికి ఆమె సొంత ఇల్లు ఇస్తానని చేసిన ప్రామీస్‌ చుట్టూ ఈ కథ ఉంటుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బుకర్‌ ప్రైజ్‌–2021 విజేత
ఎప్పుడు : నవంబర్‌ 3
ఎవరు    : దక్షిణాఫ్రికా రచయిత డామన్‌ గల్గుట్‌
ఎందుకు : ‘‘ది ప్రామిస్‌’’ నవలను రచించినందుకు...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 5 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags