Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 1 కరెంట్‌ అఫైర్స్‌

Vatican City: పోప్‌ ఫ్రాన్సిస్‌తో సమావేశమైన తొలి భారత ప్రధాని ఎవరు?

జి–20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రోమన్‌ క్యాథలిక్‌ చర్చి అధినేత పోప్‌ ఫ్రాన్సిస్‌(84)తో సమావేశమయ్యారు. వాటికన్‌ సిటీలో అక్టోబర్‌ 30న జరిగిన ఈ భేటీలో కోవిడ్‌–19 మహమ్మారి, వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతోపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. త్వరలో భారత్‌లో పర్యటించాలంటూ పోప్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోదీ వెంట భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఉన్నారు.

ఫ్రాన్సిస్‌తో సమావేశమైన తొలి ప్రధాని...
2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టిన ఫ్రాన్సిస్‌తో సమావేశమైన తొలి భారత ప్రధాని మోదీయే.  రెండు దశాబ్దాలలో భారత ప్రధాని, పోప్‌ మధ్య భేటీ జరగడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2000 జూన్‌లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి పోప్‌ జాన్‌పాల్‌–2ను వాటికన్‌ సిటీలో కలిశారు. 1948 నుంచి పోప్, ఇండియా మధ్య సన్నిహిత, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆసియా ఖంఢంలో క్యాథలిక్‌ల జనాభా అధికంగా ఉన్న రెండో దేశం ఇండియా.

భారత పర్యటన...
భారత్‌లో పర్యటించాలంటూ ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిని పోప్‌ అంగీకరించారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే పోప్‌ ఫ్రాన్సిస్‌ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. చివరిసారిగా పోప్‌ జాన్‌పాల్‌–2 1999లో భారత్‌కు వచ్చారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రోమన్‌ క్యాథలిక్‌ చర్చి అధినేత పోప్‌ ఫ్రాన్సిస్‌(84)తో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్‌ 30
ఎవరు    : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : వాటికన్‌ సిటీ
ఎందుకు : కోవిడ్‌–19 మహమ్మారి, వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతోపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపేందుకు...


G-20 Summit 2021: జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు

జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు(జి–20 శిఖరాగ్ర సదస్సు–2021) ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలోని నువొలా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగాయి. అక్టోబర్‌ 30, 31వ తేదీలలో జరిగిన ఈ సదస్సుకు అతిథ్య దేశం ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ నేతృత్వం వహించారు. సదస్సులో ప్రధానంగా ఆరోగ్య రంగం, ఆర్థిక రంగం, వాతావరణ మార్పులపై చర్చలు జరిపారు. పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల గురించి వివరిస్తూ ‘రోమ్‌ డిక్లరేషన్‌’ జారీ చేశారు.

2021 జి–20 శిఖరాగ్ర సదస్సు నినాదం(Motto): పీపుల్, ప్లానెట్, అండ్‌ ప్రాస్పెరిటీ

రోమ్‌ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు...

  • వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలి. కర్బన తటస్థీకరణ లేదా ‘నెట్‌ జీరో’ ఉద్గారాల లక్ష్య సాధనకు అందరూ కట్టుబడి ఉండాలి. ఈ శతాబ్ధి మధ్య నాటికి..అంటే 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి.
  • కాలుష్యాన్ని అడ్డుకోవడానికి విదేశాల్లో బొగ్గు ఆధారిత(థర్మల్‌) విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరుత్సాహపర్చాలి. 2021, ఆఖరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలి.   
  • వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయడానికి గతంలోనే అంగీకరించినట్లుగా ధనిక దేశాలు ప్రతిఏటా 100 బిలియన్‌ డాలర్లు సమీకరించాలి. పేద దేశాలకు రుణ సాయాన్ని పెంచాలి.
  • 2021 ఆఖరుకల్లా ప్రపంచంలో కనీసం 40 శాతం మందికి కరోనా టీకా ఇవ్వాలి. 2022 జూన్‌ ఆఖ రుకి 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. టీకా సరఫరాలో అవరోధాలను తొలగించాలి.

కర్బన తటస్థీకరణ అంటే...
వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, వాతావరణం నుంచి తొలగించే ఉద్గారాల మధ్య సమతూకం ఉండడమే కర్బన తటస్థీకరణ. అంటే ఏ మేరకు ఉద్గారాలు విడుదలవుతాయో అంతేస్థాయిలో వాటిని వాతావరణం నుంచి తొలగించాలి.

సదస్సులో మోదీ...
జి–20 సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘గ్లోబల్‌ ఎకానమీ, గ్లోబల్‌ హెల్త్‌’ అంశంపై  మాట్లాడారు. తమ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ  చేశామని, 2020 ఏడాది చివరి నాటికల్లా 500 కోట్లకుపైగా కోవిడ్‌–19 టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. తద్వారా తమ దేశంతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుందన్నారు. కోవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ డబ్ల్యూహెచ్‌ఓ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. కనిష్ట కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

జి–20 గురించి...
జి–20(గ్రూప్‌ ఆఫ్‌ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. 1999లో ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్‌ల వేదికగా ఇది ఏర్పడింది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. జీ–20లో 19 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. జీ–20 దేశాలు ప్రపంచంలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 80 శాతం వాటా ఈ దేశాలదే. 

జి–20 సభ్యదేశాలు...
1. అర్జెంటీనా
2. ఆస్ట్రేలియా
3. బ్రెజిల్‌
4. కెనడా
5. చైనా
6. ఫ్రాన్స్‌
7. జర్మనీ
8. భారత్‌
9. ఇండోనేషియా
10. ఇటలీ
11. జపాన్‌
12. మెక్సికో
13. రష్యా
14. సౌదీ అరేబియా
15. దక్షిణ కొరియా
16. దక్షిణాఫ్రికా
17. టర్కీ
18. యునెటైడ్‌ కింగ్‌డమ్‌
19. యునెటైడ్‌ స్టేట్స్‌
20. యూరోపియన్‌ యూనియన్‌
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు(జి–20 శిఖరాగ్ర సదస్సు–2021) 
ఎప్పుడు : 30, 31 అక్టోబర్, 2021
ఎవరు    : జి–20 దేశాల అధినేతలు
ఎక్కడ    : నువొలా కన్వెన్షన్‌ సెంటర్, రోమ్, ఇటలీ 
ఎందుకు : ఆరోగ్య రంగం, ఆర్థిక రంగం, వాతావరణ మార్పులపై చర్చలు జరిపేందుకు... 


2021 COP26 Summit: కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26వ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది?

గ్లోబల్‌ వార్మింగ్‌ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపై... యునైటెడ్‌ కింగడమ్‌లో భాగమైన స్కాట్‌లాండ్‌లో ఉన్న గ్లాస్గో నగరంలో కాప్‌ –26 సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26వ సదస్సు-2021) అక్టోబర్‌ 31న ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు నవంబర్‌ 12 వరకు కొనసాగనుంది. ఇటలీ సహకారంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తోంది.

అలోక్‌ శర్మ నేతృత్వంలో...
భారత సంతతి వ్యక్తి, బ్రిటన్‌ కేబినెట్‌ మంత్రి, అలోక్‌ శర్మ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన  కాప్‌ –26కి అధ్యక్షత వహిస్తున్నారు. సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ఆయన.. పారిస్‌ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని చెప్పారు. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడమే మన ముందున్న లక్ష్యమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కాప్‌ –26 సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26వ సదస్సు-2021) ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 31
ఎవరు    : కాప్‌ –26 అధ్యక్షుడు అలోక్‌ శర్మ 
ఎక్కడ    : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : గ్లోబల్‌ వార్మింగ్‌ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపేందుకు...


Tennis: ఫెనెస్టా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారులు?

ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్‌), మహిళల సింగిల్స్‌ విభాగంలో జీల్‌ దేశాయ్‌ (గుజరాత్‌) చాంపియన్స్‌గా నిలిచారు. న్యూఢిల్లీలో అక్టోబర్‌ 30న ముగిసిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ నిక్కీ పునాచా 3–6, 7–6 (8/6), 6–4తో దిగ్విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (చండీగఢ్‌)పై... టాప్‌ సీడ్‌ జీల్‌ దేశాయ్‌ 6–3, 6–0తో క్వాలిఫయర్‌ షర్మదా బాలు (కర్ణాటక)పై గెలిచారు. విజేతలుగా నిలిచిన నిక్కీ పునాచా, జీల్‌ దేశాయ్‌లకు రూ. 3 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : అక్టోబర్‌ 31
ఎవరు    : పురుషుల సింగిల్స్‌ విభాగంలో నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్‌), మహిళల సింగిల్స్‌ విభాగంలో జీల్‌ దేశాయ్‌ (గుజరాత్‌) 
ఎక్కడ    : న్యూఢిల్లీ 


India-France: ప్రధాని మోదీతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఎక్కడ సమావేశమయ్యారు?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ సమావేశమయ్యారు. ఇటలీ రాజధాని నగరం రోమ్‌లో అక్టోబర్‌ 30న జరిగిన ఈ భేటీలో భారత్‌–ఫ్రాన్స్‌ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఉన్నారు. జి–20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ, మాక్రాన్‌లు రోమ్‌కి వెళ్లిన సంగతి విదితమే.

లూంగ్‌తోనూ బేటీ..
ప్రధాని నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు.

శాంచెజ్‌తో సమావేశం..
భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మ రిన్ని పెట్టుబడులు పెట్టాలని స్పెయిన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన రోమ్‌లో స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.

మెర్కెల్‌తో సమావేశం..
ప్రధాని మోదీ రోమ్‌లో జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తోనూ సమావేశమయ్యారు. భారత్‌–జర్మనీ నడుమ ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ మోదీ సమావేశమయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో సమావేశం
ఎప్పుడు  : అక్టోబర్‌ 30
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : రోమ్, ఇటలీ
ఎందుకు : భారత్‌–ఫ్రాన్స్‌ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించేందుకు...


Olympics Player: భారత్‌కి చెందిన షేక్‌ జాఫ్రీన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?

బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. విభిన్న ప్రతిభావంతుల సాధికారత–2020లో భాగంగా ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. నవంబర్‌ 3వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా జాఫ్రీన్‌ అవార్డును అందుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలుకు చెందిన జాఫ్రీన్‌ అంతర్జాతీయ స్థాయిలో 9 పతకాలు, జాతీయ స్థాయిలో 8 బంగారు పతకాలు సాధించింది. 2017లో టర్కీలో జరిగిన బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. భారత డెఫ్‌ టెన్నిస్‌ జట్టు సారథిగా ఉన్న ఆమె ర్యాంకింగ్స్‌ పరంగా దేశంలో 1వ, అంతర్జాతీయంగా 12వ స్థానంలో కొనసాగుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : విభిన్న ప్రతిభావంతుల సాధికారత–2020లో భాగంగా ఉత్తమ క్రీడాకారిణి అవార్డుకు ఎంపికైన క్రీడాకారిణి?
ఎప్పుడు : అక్టోబర్‌ 31
ఎవరు    : బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌
ఎందుకు : క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు...


Indian Navy: ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌకను తయారు చేసిన సంస్థ?

భారత నౌకాదళ అధికారులు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక విశేషాలివీ.

విశాఖపట్నం పేరెందుకు...
ప్రాజెక్ట్‌–15బీ పేరుతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మిౖసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్‌ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు.

వై–12704 పేరుతో శ్రీకారం..
2011 జనవరి 28న నాలుగు యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్ట్‌ ఒప్పందం జరిగింది. డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్, ఇండియన్‌ నేవీకి చెందిన సంస్థలు షిప్‌ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్‌ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) శ్రీకారం చుట్టింది. తదనంతరం 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్‌ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌకను 2021, అక్టోబర్‌ 28న అప్పగించారు. 2021, డిసెంబర్‌లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు.

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం విశేషాలు...

  • బరువు: 7,400 టన్నులు
  • పొడవు: 163 మీటర్లు
  • బీమ్‌: 17.4 మీటర్లు
  • డ్రాఫ్ట్‌: 5.4 మీటర్లు
  • వేగం గంటకు 30 నాటికల్‌ మైళ్లు
  • స్వదేశీ పరిజ్ఞానం 75 శాతం
  • పరిధి: ఏకధాటిన 4 వేల నాటికల్‌ మైళ్ల ప్రయాణం
  • ఆయుధాలు: 32 బరాక్‌ ఎయిర్‌ క్షిపణులు, 16 బ్రహ్మోస్‌ యాంటీషిప్, ల్యాండ్‌ అటాక్‌ క్షిపణులు, 76 ఎంఎం సూపర్‌ రాపిడ్‌ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్‌ లాంచర్స్‌ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్‌ లాంచర్లు
  • విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్‌ సీ కింగ్‌ విమానాలు లేదు రెండు హెచ్‌ఏఎల్‌ ధృవ్‌ విమానాల్ని తీసుకెళ్లగలదు

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌకను తయారు చేసిన సంస్థ?
ఎప్పుడు  : అక్టోబర్‌ 31
ఎవరు    : ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరించేందుకు...

YSR Awards 2021: వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంతమందికి అందజేశారు?

వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం నవంబర్‌ 1న విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పురస్కారాలను అందజేశారు. 2021 సంవత్సరానికి 29 వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని–సంస్థలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డుల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు.

2021 ఏడాది పురస్కారాల విజేతలు...
ట్రస్టులు

1. ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ట్రస్ట్‌ – కాకినాడ(తూర్పుగోదావరి) 
2. సీపీ బ్రౌన్‌ లైబ్రరీ – వైఎస్సార్‌ జిల్లా 
3. సారస్వత నికేతన్‌ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం) 
4. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ – పుట్టపర్తి(అనంతపురం) 
5. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ – వైఎస్సార్‌ జిల్లా 
6. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డీటీ) – అనంతపురం 
7. గౌతమి రీజనల్‌ లైబ్రరీ – తూర్పుగోదావరి 
8. మహారాజా గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ – విజయనగరం 

రైతులు 
9. స్వర్గీయ పల్లా వెంకన్న  – కడియం(తూర్పుగోదావరి) 
10. మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – శ్రీకాకుళం 
11. ఎంసీ రామకృష్ణారెడ్డి     – అనంతపురం 
12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం 
13. విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ – కృష్ణా జిల్లా 
14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
15. ఎస్‌.రాఘవేంద్ర – చిత్తూరు 
16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం 
17. ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫ్మారింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – విశాఖపట్నం 
18. వల్లూరు రవికుమార్‌     – కృష్ణా జిల్లా 
19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా 

కళలు–సంస్కృతి 
20. పొందూరు ఖద్దర్‌(ఆంధ్రాపైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం 
21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం 
22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం 
23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు 
24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్‌ జిల్లా 
25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా 
26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం 
27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ 
28. సవర రాజు(సవర పెయింటింగ్స్‌) – శ్రీకాకుళం 
29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం 
30. ధర్మాడి సత్యం(డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) – తూర్పుగోదావరి 
31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి 
32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి 
33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా 
34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా     
35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు 
36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్‌) – కర్నూలు 
37. బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్టిజన్స్‌ సొసైటీ – చిత్తూరు 
38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు 
39. పూసపాటి పరమేశ్వర్‌రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం 

సాహిత్యం 
40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్‌) – శ్రీకాకుళం 
41. కత్తి పద్మారావు – గుంటూరు 
42. రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
43. బండి నారాయణ స్వామి – అనంతపురం 
44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
45. కొలకలూరి ఇనాక్‌ – గుంటూరు 
46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు 

జర్నలిజం 
47. ఏబీకే ప్రసాద్‌ – కృష్ణా 
48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు 
49. స్వర్గీయ ఖాజా హుస్సేన్‌ (దేవీప్రియ) – గుంటూరు 
50. స్వర్గీయ కె.అమరనాథ్‌ – పశ్చిమగోదావరి 
51. సురేంద్ర (కార్టునిస్ట్‌) – వైఎస్సార్‌ జిల్లా 
52. ఇమామ్‌ – అనంతపురం 

వైద్య–ఆరోగ్య విభాగం 
53. డాక్టర్‌ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్‌) – నెల్లూరు 
54. డాక్టర్‌ కె.కృష్ణ కిషోర్‌(ఈఎన్‌టీ ప్రొఫెసర్‌) – తూర్పుగోదావరి 
55. లక్ష్మి(స్టాఫ్‌ నర్స్‌) – విజయవాడ 
56. కె.జోతిర్మయి(స్టాఫ్‌ నర్స్‌) – అననంతపురం 
57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్‌ నర్స్‌) – విశాఖపట్నం 
58. ఎం.యోబు(మేల్‌ నర్స్‌) – వైఎస్సార్‌ జిల్లా 
59. ఆర్తి హోమ్స్‌ – వైఎస్సార్‌ జిల్లా
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : నవంబర్‌ 
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : ఏ–కన్వెన్షన్‌ సెంటర్, విజయవాడ, కృష్ణా జిల్లా
ఎందుకు : వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని–సంస్థలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 30 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags