Daily Current Affairs in Telugu: 2022, మార్చి 05 కరెంట్ అఫైర్స్
Russia-Ukraine War: యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్కేంద్రం పేరు?
ఉక్రెయిన్‌లో రష్యా అణు చెలగాటమాడుతోంది. వారం కింద చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైనాన్ని మర్చిపోకముందే మరో అణు ప్లాంట్‌పై దాడికి తెగబడింది. ఆగ్నేయ ప్రాంతంలో ఎనర్‌హోడర్ నగరంపై మార్చి 4న రష్యా దళాలు యుద్ధ ట్యాంకులతో భారీ దాడులకు దిగాయి. దాన్ని ఆక్రమించే ప్రయత్నంలో యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా బాంబుల వర్షం కురిపించినట్టు సమాచారం. దాంతో వాడుకలో లేని ఒకటో నంబర్‌రియాక్టర్‌కు మంటలంటుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి వాటిని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలకు కాల్పులే కారణమా అన్నది తెలియరాలేదు.
రష్యా దాడుల్లో ప్లాంటులోని శిక్షణ కేంద్రం దెబ్బ తిన్నది తప్పిస్తే అందులోని ఆరు రియాక్టర్లకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రోసీ అన్నారు. ఉక్రెయిన్ విద్యుత్ అవసరాల్లో 25 శాతాన్ని తీరుస్తున్న జపోరిజియా ప్లాంటులోని ఆరు అణు రియాక్టర్లలో ప్రస్తుతం ఒక్కటే 60 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది.
జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ప్రత్యేకతలు
- యూరప్‌లోనే అతి పెద్ద అణు విద్యు త్కేంద్రం. ప్రపంచంలో తొమ్మిదోది.
- ప్లాంట్‌లో 6 వీవీఈఆర్–1000 పీడబ్ల్యూఆర్ అణు రియాక్టర్లున్నాయి. ఒక్కోదాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 950 మెగావాట్లు.
- డాన్‌బాస్, కీవ్ మధ్య ఎనర్‌హోడార్ నగరంలోని కఖ్వోకా రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఈ ప్లాంటు 40 లక్షల గృహ అవసరాలను తీరుస్తోంది.
- ఉక్రెయిన్‌కు అవసరమైన విద్యుత్ సరఫరా లో సగం అణు ప్లాంట్ల నుంచే వస్తోంది. జపోరిజియా ప్లాంట్ నుంచి దేశ అవసరాల్లో ఐదో వంతు ఉత్పత్తవుతోంది.
- 1984–1995 మధ్య దీని నిర్మాణం జరిగింది. దీని డిజైన్ చెర్నోబిల్ ప్లాంట్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అగ్నిప్రమాదం తలెత్తినా అణుముప్పు సంభవించకుండా భద్రత ఏర్పాట్లున్నాయి.
Shane Warne: ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం
స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ షేన్ కీత్ వార్న్(52) మార్చి 4న హఠాన్మరణం చెందాడు. థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయ్‌లో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగర సమీపంలోని అప్పర్ ఫెర్న్ ట్రీ గల్లీ నగరంలో జన్మించిన వార్న్.. 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని దాటిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. సొంతగడ్డపై యాషెస్‌లో ఇంగ్లండ్‌ను 5–0తో చిత్తు చేసిన అనంతరం 2007 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు సగర్వంగా వీడ్కోలు పలికాడు. తదనంతరం క్రికెట్ కామెంటేటర్‌గా చురుగ్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాడు.
ఐపీఎల్‌తోనూ అనుబంధం..
2013లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌గా వార్న్ నిలిచాడు. 1999 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు. ఇక ఐపీఎల్‌తోనూ షేన్ వార్న్‌కు అనుబంధం ఉంది. 2008 ఆరంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో రాజస్తాన్ టైటిల్ గెలవడంలో అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా షేన్ వార్న్ కీలకపాత్ర పోషించాడు.
ఒక సెంచరీ కూడా లేకుండానే..
- టెస్టుల్లో షేన్‌వార్న్ వికెట్ల సంఖ్య 708. మురళీధరన్ (800) తర్వాత రెండో స్థానం.
- 2005లో వార్న్ తీసిన వికెట్ల సంఖ్య 96. ఒక ఏడాదిలో ఇదే అత్యధిక వికెట్ల రికార్డు.
- టెస్టుల్లో వార్న్ పరుగులు 3154. కెరీర్‌లో ఒక సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు
రాడ్ మార్ష్ కన్నుమూత
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్(74) మార్చి 4న ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో కన్నుమూశారు. 1970, 80వ దశకాల్లో మరెవరికీ సాటిరాని మెరుపు వికెట్‌కీపింగ్‌తో ఆయన ఆకట్టుకున్నారు. కెరీర్‌లో ఆయన 355 వికెట్లను తీయడంలో భాగమయ్యారు. 96 టెస్టులు ఆడిన మార్ష్ 3,633 పరుగులు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ హఠాన్మరణం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : షేన్ కీత్ వార్న్(52)
ఎక్కడ : కోహ్ సమూయ్, థాయ్‌లాండ్
ఎందుకు : గుండెపోటు కారణంగా..
Reliance Industries: దేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది?
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మార్చి 4న ముంబైలో జియో వరల్డ్ సెంటర్‌ను ప్రారంభించింది. దాదాపు 18.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్‌లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెయిన్ మొదలైనవి ఉన్నాయి. ఇందులోని కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అతి పెద్దది. 5జీ నెట్‌వర్క్ ఆధారిత కన్వెన్షన్ సెంటర్‌లో 1.61 లక్షల చ.అ. పైగా విస్తీర్ణం ఉండే మూడు ఎగ్జిబిషన్ హాల్స్, 1.07 లక్షల చ.అ. విస్తీర్ణం ఉండే రెండు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. 2022 ఏడాది, 2023 ఏడాది దశలవారీగా ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. నవ భారత ఆకాంక్షలకు ప్రతిరూపంగా జియో వరల్డ్ సెంటర్ ఉంటుందని ఆర్‌ఐఎల్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)
ఎక్కడ : జియో వరల్డ్ సెంటర్, ముంబై, మహారాష్ట్ర
AP State Aquaculture Development Authority: అప్సడా చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్‌గా వడ్డి రఘురాంను నియమిస్తూ మార్చి 4న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో వైస్ చైర్మన్‌గా రఘురాం నియమితులయ్యారు. వడ్డి రఘురాం మూడు దశాబ్దాలుగా ఆక్వారంగంలో ఉన్నారు.
ఇవీ లక్ష్యాలు
ఆక్వాకల్చర్ కార్యకలాపాలన్నీ అప్పడా–2020 చట్టం పరిధిలోకి తెచ్చారు. సీడ్, ఫీడ్, నాణ్యతతో కూడిన ఉత్పత్తి, మార్కెట్ ధరలను ఈ చట్టం నియంత్రిస్తుంది. ఆక్వా ఉత్పత్తుల వాణిజ్యం, ఎగుమతులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. పంటకు అదనపు విలువ జోడించటం, సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్ సరఫరా వంటి చర్యలు చేపడుతుంది.
శాప్ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకొస్తున్న నూతన క్రీడా విధానం 2022–27 ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) పాలక మండలి ఆమోదం తెలిపింది. మార్చి 4న విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బోర్డు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. స్పోర్ట్స్ యాక్ట్–2022 ప్రకారం క్రీడా సంఘాలకు రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : వడ్డి రఘురాం
ఎందుకు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు..
CM KCR: తెలంగాణ, జార్ఖండ్ ముఖ్యమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. మార్చి 4న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగిన ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పొరుగున ఉన్న చైనా సహా ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందగా.. మన దేశం చాలా విషయాల్లో వెనుకబడిపోయిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఆ దిశగానే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హేమంత్ సోరెన్‌తో జాతీయ రాజకీయాల గురించి చర్చించానని, ఫలవంతంగా చర్చలు జరిగాయని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. అమర జవాన్ కుందన్ కుమార్ ఓఝా భార్య నమ్రతాకుమారికి.. మరో అమర జవాన్ గణేశ్ కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేశారు.
కేంద్ర జల శక్తి శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టుకు సందర్శించారు. ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరు, పశ్చిమ గోదావరి జిల్లా తాడ్వాయి వద్ద నిర్మించిన పునరావాస కాలనీలను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి షేకావత్ చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌తో సమావేశం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
ఎందుకు : జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకు..
Kavach Technology: రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను ఎక్కడ పరీక్షించారు?
రైలు ప్రమాదాలను నివారించేందుకు అభివృద్ధి చేసిన ‘కవచ్’ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ రైల్వే సెక్షన్ పరిధిలోని గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతంలో విజయవంతంగా పరీక్షించారు. మార్చి 4న భారతీయ రైల్వే నిర్వహించిన ఈ పరీక్షలో.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠీ పాల్గొన్నారు. తొలుత టి–కాస్ పేరుతో రూపొందిన కవచ్ పరిజ్ఞానంపై ఎనిమిదేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా మేకిన్ ఇండియాలో భాగంగా ‘కవచ్’ పేరిట పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.
పరీక్ష జరిగిన తీరు ఇలా..
మార్చి 4న గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతం.. ఒకవైపు నుంచి రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. అదే ట్రాక్‌పై ఎదురుగా లోకో ఇంజిన్ 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. రెండింటి మధ్య దూరం 600 మీటర్లే.. అయినా దేనికీ బ్రేకులు వేయలేదు. కానీ చూస్తుండగానే రెండూ ఆటోమేటిగ్గా వేగం తగ్గించుకున్నాయి. రెండింటి మధ్య 380 మీటర్ల దూరం ఉందనగా ఆగిపోయాయి. అంటే ఎదురెదురుగా దూసుకొస్తున్న రైళ్లు బ్రేకులతో ప్రమేయం లేకుండా, లోకో పైలట్ల (రైలు నడిపేవారు) జోక్యం లేకుండానే ఆగిపోయి ప్రమాదాన్ని నివారించాయి. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ‘కవచ్’ పరిజ్ఞానమే దీనికి కారణం.
దేశవ్యాప్తంగా ఏర్పాటు..
ఇలా ఒకేట్రాక్‌పై దూసుకొచ్చిన ఓ రైలులో స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉండగా.. ఎదురుగా వచ్చిన ఇంజన్‌లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠీ ఉన్నారు. త్వరలోనే ‘కవచ్’ను దేశవ్యాప్తంగా రైళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దీనిని స్వయంగా పరిశీలించేందుకు రైల్వే మంత్రి ఈ పరీక్షలో పాల్గొన్నారు.
కిలోమీటరుకు రూ. 50 లక్షల ఖర్చు..
కవచ్ పరీక్ష విజయవంతమైన సందర్భంగా మంత్రి అశ్వినీ మాట్లాడుతూ.. ‘‘కవచ్‌ను దేశవ్యాప్తంగా.. ఏటా నాలుగైదు వేల కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేస్తాం. కవచ్ పరిజ్ఞానం కోసం కిలోమీటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చవుతుంది. అదే యూరోపియన్ పరిజ్ఞానానికైతే కిలోమీటర్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైగా కవచ్ వాటి కంటే సమర్థవంతమైనది. అందుకే దీన్ని విదేశాలకు ఎగుమతి చేస్తాం’’ అని చెప్పారు.
అన్ని రూల్స్.. ఆటోమేటిగ్గా..
- తొలుత రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ విడివిడిగా రెండు రైళ్లలో బయలుదేరారు. సనత్‌నగర్ దాటాక ఒకేట్రాక్‌లో ముందు మంత్రి ఉన్న రైలు, వెనుక బోర్డు చైర్మన్ ఉన్న రైలు ప్రయాణించాయి. ముందున్న రైలుకు వెనకాల ఉన్న రైలు చేరువగా వచ్చే ప్రయత్నం చేసింది. లోకో పైలట్ బ్రేకు వేయకున్నా.. వెనకాల ఉన్న రైలు దానంతట అదే వేగం తగ్గి, ఆగిపోయింది.
- ఒకచోట మధ్యలో రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలట్ బ్రేకు వేయకుండా ముందుకు నడిపించారు. కానీ ఆటోమేటిగ్గా బ్రేకు పడి రైలు ఆగిపోయింది.
- లెవల్ క్రాసింగ్ వద్ద నిర్ధారిత దూరం నుంచి హారన్ మోగించాలి. కానీ లోకోపైలట్ మోగించకున్నా.. నిర్ధారిత ప్రాంతానికి చేరుకోగానే ఆటోమేటిక్‌గా రైలు కూత వేసింది.
- లూప్‌లైన్‌లో వెళ్లేప్పుడు గంటకు 20 కిలోమీటర్ల లోపు వేగం ఉండాలన్న నిబంధన ఉంది. వేగంగా నడిపేందుకు లోకో పైలట్ ప్రయత్నించినా రైలు దానంతట అదే వేగం తగ్గింది.
- పెద్ద మలుపులో రైలుగరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు మించొద్దు. అంతకన్నా వేగంగా నడిపితే రైలు ఆటోమేటిగ్గా ఆ వేగానికి తగ్గిపోయింది.
కవచ్ ఎలా పనిచేస్తుంది? దీన్ని రూపొందించిన సంస్థ ఏది?
రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ)’ కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందించింది. కొన్ని దేశీ పరిశ్రమలు పరికరాలను తయారు చేసి సమకూర్చాయి. 2013లో ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం(టీకాస్)పేరుతో.. వికారాబాద్–వాడీ–సనత్ నగర్ సెక్షన్ల మధ్య ప్రయోగాలు చేసి, అభివృద్ధి చేశారు.
ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వేస్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాబ్‌లను అమర్చుతారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తు ఉండే టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్‌ఫేజ్‌లతో అన్నింటినీ అనుసంధానిస్తారు. ఈ మొత్తం పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైళ్లను పరిశీలిస్తుంటుంది. లోకోపైలట్ ముందుండే స్క్రీన్‌లో సమాచారం డిస్‌ప్లే అవుతుంది. ఏ చిన్న సమస్య చోటుచేసుకున్నా.. వెంటనే లోకోపైలట్‌ను, స్టేషన్‌లోని అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా పరస్పరం సమాచారాన్ని కూడా పంపించుకోవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కవచ్ వ్యవస్థను ఎక్కడ పరీక్షించారు?
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతం, వికారాబాద్ రైల్వే సెక్షన్, తెలంగాణ
ఎందుకు : రైలు ప్రమాదాలను నివారించేందుకు..
Tamil Nadu: చెన్నై మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ?
తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం చెన్నై మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్.ప్రియ మార్చి 4న మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. దీంతో చెన్నై మేయర్ పీఠం పై కూచున్న తొలి దళిత మహిళగా 29 ఏళ్ల ప్రియ రికార్డు నెలకొల్పింది. చెన్నైకు ప్రియ 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది.
ఏకగ్రీవంగా ఎన్నిక..
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక 2022, ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డీఎంకే పార్టీకి వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డీఎంకే మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డీఎంకే పార్టీకి కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చెన్నై మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ?
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఆర్.ప్రియ
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : ఇటీవలి ఎన్నికల్లో ఆర్.ప్రియ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో..
Russia-Ukraine War: చెర్నోబిల్ అణు ప్రమాదం ఏ సంవత్సరం జరిగింది?
ఉక్రెయిన్‌లో జపోరిజియా అణు విద్యుత్కేంద్రంపై రష్యా క్షిపణి దాడులతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రేడియో ధార్మికత విడుదల కాకుండా ప్లాంట్‌లో పకడ్బందీ భద్రత ఉండడంతో పెను ప్రమాదమే తప్పింది. అలాగాక అణు రియాక్టర్లు పేలి ఉంటే యూరప్ సర్వనాశనమై పోయేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. గతంలో జరిగిన చెర్నోబిల్, ఫుకుషిమా వంటి ఘోర అణు ప్రమాదాలను తలచుకొని యూరప్ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో యూరప్ మాత్రమే గాక యావత్ ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చెర్నోబిల్‌లో ఏం జరిగింది?
1986 ఏప్రిల్ 26వ తేదీన తెల్లవారుజామున 1:23 గంటల సమయంలో.. చెర్నోబిల్ అణు ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని నాలుగు అణు రియాక్టర్లలో ఒకటి ప్రమాదవశాత్తూ పేలిపోయింది. అణు విద్యుత్కేంద్రం భద్రతపై పరీక్షలు జరిపిన ఇంజనీర్లు కరెంటు సరఫరా ఆగిపోతే ఏమౌతుందన్న అంచనాలతో చేపట్టిన ప్రయోగం విఫలమై అతి పెద్ద అణు వినాశనానికి దారితీసింది. ఈ ప్రమాదం వల్ల చెలరేగిన మంటలు తొమ్మిది రోజుల పాటు ఎగసిపడుతూనే ఉన్నాయి.
2 లక్షల మంది వరకు..
అణు రియాక్టర్ పేలుడు జరిగినప్పుడు ప్లాంట్‌లో 130 మంది ఉన్నారు. అక్కడికక్కడే ఇద్దరే మరణించినా రేడియేషన్ దుష్ప్రభావాలతో తర్వాత 50 మంది ప్లాంట్ కార్మికులు, అగ్నిమాపక దళ సభ్యులు మరణించారు. మిగతా వారంతా అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ (ఏఆర్‌ఎస్)తో బాధపడుతూ జీవచ్ఛవాలుగా మిగిలారు. ప్రమాదం జరిగిన వెంటనే 30 వేల మందిని తరలించారు. తర్వాత మరో 3.5 లక్షల మంది తరలివెళ్లారు. వీరిలో 6 వేల మంది రేడియేషన్ కారణంగా థైరాయిడ్, కేన్సర్ బారిన పడినట్టు తేలింది. రేడియేషన్ వల్ల చర్మం, గొంతు కేన్సర్‌తో 2 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా. రేడియేషన్ దుష్ప్రభావాలతో ఎంతమంది మరణించారో ఇప్పటికీ పక్కాగా లెక్కల్లేవు.
అత్యధిక అణుధార్మికత ఉన్న జోన్..
చెర్నోబిల్ అణు ప్రమాదం వల్ల విడుదలైన.. రేడియేషన్ రష్యా నుంచి ఐర్లాండ్ దాకా 13 దేశాలకు వ్యాపించింది. చెర్నోబిల్ చుట్టుపక్కల 2,600 చదరపు కిలోమీటర్లను నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక అణుధార్మికత ఉన్న జోన్ ఇదే. రేడియో ధార్మికతని తట్టుకునే ఎలుగుబంట్లు, తోడేళ్లు వంటి జంతుజాలం మాత్రమే అక్కడ జీవిస్తోంది. అక్కడ మళ్లీ మనుషులు జీవించే పరిస్థితులు నెలకొనాలంటే 3,000 ఏళ్లు పడుతుందని అంచనా. చెర్నోబిల్‌ను డార్క్ టూరిజం ప్లేస్‌గా మార్చి సందర్శకులకు అనుమతిస్తున్నారు.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్