Smart Governance: ‘స్మార్ట్‌’గా ప్రపంచ పరిజ్ఞానం

Governing the Global Knowledge Society
  • విద్యార్థుల కోసం స్మార్టికల్స్‌ పేరిట యాప్‌
  • ఆవిష్కరించిన ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు
  • విభిన్న రంగాల్లోని విశ్లేషణాత్మక సమాచారమంతా యాప్‌లో నిక్షిప్తం  

విభిన్న రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా, వారికి విస్తృతమైన ప్రపంచ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘స్మార్టికల్స్‌’ పేరిట వినూత్న యాప్‌ను రూపొందించింది. విద్యార్థుల మానసిక వికాసానికి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దృశ్యాత్మక అంతర్జాతీయ కథనాలు అందించేందుకు ఈ ఎడ్‌టెక్‌ స్టార్ట్‌అప్‌ ప్రారంభించారు. వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, ఇతర జర్నల్స్‌లలో నిపుణులు రాసిన వార్తా కథనాలను, లోతైన అధ్యయనంతో కూడిన విద్యాసంబంధిత ప్రచురణలను అందరికీ అర్థమయ్యే రీతిలో ఇందులో పొందుపరిచారు. డిసెంబర్‌ 20న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు వెబినార్‌ ద్వారా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, కాలేజీ విద్య కమిషనర్‌ పోలా భాస్కర్, వివిధ యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు, రిజిస్ట్రార్లు, రెక్టార్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబినార్‌లో పాల్గొన్నారు. స్మార్టికల్స్‌ యాప్‌ ద్వారా పదేళ్ల విద్యార్థి నుంచి ఉన్నత విద్యాతరగతులు అభ్యసించేవారందరూ ఉచితంగా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చు. web.readingright.in వెబ్‌సైట్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమకు కావలసిన అంశంలోని పదాన్ని క్లిక్‌ చేయగానే యాప్‌లో పూర్తి సమాచారం వారి కళ్లముందు ఉంటుంది. విద్యార్థులు ఈ యాప్‌ ద్వారా ఎంతో సమాచారాన్ని అందిపుచ్చుకోగలుగుతారని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. సులభమైన రీతిలో కథనాల ద్వారా విజ్ఞానాన్ని అందించే ఈ యాప్‌ విద్యారంగంలో మేలిమలుపుగా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ అభివర్ణించారు. విద్యార్థులకే కాకుండా టీచర్లకూ ఈ యాప్‌ ప్రయోజనకరమని కాలేజీ విద్య కమిషనర్‌ పోలాభాస్కర్‌ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రీడింగ్‌ రైట్‌ వ్యవస్థాపక సీఈవో సృష్టి జైన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Also read: DSC: 2018 డీఎస్సీలో నియామకాలకు షెడ్యూల్‌ విడుదల


Click here for more Education News

#Tags