Skip to main content

LocalCircles Survey: ‘నెట్‌’లో చిక్కుకున్న చిన్నారులు

సాక్షి, హైదరాబాద్‌: వానల్లు కురవాలి వానదేవుడా/ వరిచేలు పండాలి వానదేవుడా/..వానా వానా వల్లప్ప...వాకిట తిరుగు చెల్లప్ప/ చెట్టుమీద దెయ్యం/ నాకేం భయ్యం / వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమీ...ఇవన్నీ పల్లెటూళ్లలో చిన్నారులు ఆరుబయట ఆటలు ఆడుకుంటూ పాడుకునే పాటలు.
LocalCircles Survey
‘నెట్‌’లో చిక్కుకున్న చిన్నారులు

బడి నుంచి ఇంటికొచ్చేసి వీధి కూడలిలోనో, ఇంటిముందో పిల్లలు చేరుకుని ఇలా కబడ్డీ, పైలా పచ్చీస్, ఖోఖో, దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి వంటి ఆటలు ఆడుకుంటుంటే పెద్దవాళ్లు కూడా ఆ చిన్నారుల్ని చూసి ఆనందపడిపోయేవారు. అదంతా గతం..ఇప్పుడా ఆటల్లేవు పాటల్లేవు...ఆ ఆనందమూ లేదు. ఎందుకంటారా? ఇదిగో ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన అంతర్జాలం(ఇంటర్‌నెట్‌)...ఈ మాయ లో పడి నేటితరం పిల్లలు ఆటపాటలూ..ఆనందమూ అందులోనే వెతుక్కుంటున్నారు. నాటితరం ఆటలు శారీరక వ్యాయామానికి, మానసిక వికాసానికి దోహదపడితే నేటితరం ఆన్‌లైన్‌ ఆటలు పిల్లల్లో తీవ్ర ఒత్తిడిని, అసహనాన్ని పెంచుతున్నాయి. 

చదవండి: Internet: ఇంటర్నెట్‌లోనే సగం భారతం

సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు 

ఎంతమంది పిల్లలు ఆన్‌లైన్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఎటువంటివి ఎక్కువగా చూస్తున్నారు? వంటి అంశాలపై ‘లోకల్‌ సర్కిల్స్‌’అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోభాగంగా దేశవ్యాప్తంగా 46 వేలమంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. తొమ్మిది నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారు ఆన్‌లైన్‌లో ఆటలు ఆడటం, టీవీ వీక్షణం, ఓటీటీలు చూడటం వంటి పనుల్లో రోజుకు మూడు గంటలకు పైగానే గడుపుతున్నారని 61% మంది పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా వెల్లడయ్యాయి. 

చదవండి: Virtual Reality: ‘నెట్‌’స్పీడైతే.. బోధన ‘వీఆర్‌’అవుద్ది!

అంశాల వారీగా సర్వేలో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి

ఓటీటీలు, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం ఇంటర్‌నెట్‌పై రోజులో ఎంత సమయం గడుపుతున్నారు..?

ఎంత సమయం                  

 ఎంత శాతం మంది

ఆరు గంటలకుపైనే

15%

మూడు నుంచి ఆరు గంటలు

46%

గంట నుంచి మూడు గంటలపాటు

39%

9 నుంచి 17 ఏళ్ల వయసు వారు ఎక్కువ సమయం ఏం వీక్షిస్తున్నారు?

  • సోషల్‌ మీడియా (ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్, రీల్స్‌) 35%
  • వీడియోలు, ఓటీటీలు (యూట్యూబ్, ప్రైమ్‌వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌..) 37%
  • ఆన్‌లైన్‌ గేమ్స్‌ 33%
  • ఆన్‌లైన్‌లో ఇతర అంశాలు చూస్తున్నారు 10%
  • మా పిల్లలు వేటికీ వ్యసనం కాలేదు 8%
  • ఏమీ చెప్పలేం 2%

18 ఏళ్లలోపు వారు సోషల్‌ మీడియా ఖాతాలు తెరవాలన్నా, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలన్న నిబంధనను తీసుకొస్తే మీరు సమర్థిస్తారా..?

  • సమర్థిస్తాం 73%
  • లేదు.. కనీస వయసు 15 ఏళ్లు ఉన్నా చాలు.. 13%
  • లేదు, కనీస వయసు 13 ఏళ్లు ఉన్నా చాలు.. 9%
  • ఏమీ చెప్పలేం.. 5%

ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడంతో మీ పిల్లల ప్రవర్తనలో గమనించిన మార్పులు ఏమిటి? 

మార్పులు

శాతం మంది

అసహనం పెరిగింది

37%

దుందుడుకు స్వభావం పెరిగింది

39%

కుంగుబాటు (డిప్రెషన్‌) పెరిగింది

22%

చలాకీతనం (హైపర్‌ యాక్టివ్‌)

25%

నీరసపడిపోవడం

27%

ఇతర అనారోగ్యం

6%

సంతోషంగా ఉన్నారు

8%

కలుపుగోలుతనం పెరిగింది

10%

పైవేవీ కాదు

2%

(కొందరు తల్లిదండ్రులు ఒకటి కంటే ఎక్కువ అంశాలు గమనించినట్లు చెప్పారు)

డిజిటల్‌ ఎడిక్షన్‌ కాకుండా చూడాలి
ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా పిల్లలకు స్మార్ట్‌ ఫోన్ల అలవాటు తప్పనిసరైంది. అయితే అది డిజిటల్‌ ఎడిక్షన్‌ కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సైబర్‌ సెక్యూరిటీ అంశాలను వారికి తెలియజెప్పాలి. అవసరం మేరకు చైల్డ్‌ రిస్ట్రిక్షన్‌ ఆప్షన్లు ఎనేబుల్‌ చేసుకోవాలి
– డాక్టర్‌ ప్రజ్ఞా రష్మీ, మానసిక వైద్యురాలు

తల్లిదండ్రులు ఓ కన్నేయాలి
స్మార్ట్‌ ఫోన్లలో పిల్లలు ఏ వీడియోలు చూస్తున్నారు? ఎలాంటి గే మ్‌లు ఆడుతున్నారు ? వంటి విషయాలపై తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుండాలి. అవసరం మేరకు మాత్రమే పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వడం ఉత్తమం. 
– భాను పద్మజ, రిటైర్డ్‌ టీచర్‌

Published date : 28 Sep 2023 01:32PM

Photo Stories