Skip to main content

NEET UG 2024: మే 5న నీట్‌ యూజీ పరీక్ష.. సిలబస్‌లో చాలా మార్పులు, అలా చదివితేనే బెస్ట్‌ అంటున్న నిపుణులు

NEET UG Exam 2024   NEET UG Exam Date May 5  Added Topics in Biology and Chemistry for NEET   NEET Preparation Tips   Removed Topics from NEET Syllabus

సాక్షి, అమరావతి: దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ యూజీని మే 5న నిర్వహించనున్నారు. పరీక్షకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మంచి ర్యాంక్‌ సాధించడంలో మాక్‌ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు రోజుకు ఒకటి చొప్పున మాక్‌ టెస్ట్‌ రాయడం మంచిదంటున్నారు. ప్రతి మాక్‌ టెస్ట్‌ తర్వాత స్వయంవిశ్లేషణ చేసుకుని.. బలహీనంగా ఉన్న విభాగాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.   

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో ప్రయోజనం..  
ఈ ఏడాది నీట్‌ సిలబస్‌లో చాలా మార్పులు చేశారు. దాదాపు 18 అంశాలను సిలబస్‌ నుంచి తొలగించారు. బయాలజీ, కెమిస్ట్రీల్లో కొన్ని కొత్త అంశాలను జోడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌లో లేని అంశాల జోలికి విద్యార్థులు వెళ్లకపోవడం ఉత్తమం. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు నీట్‌ విజయంలో కీలకపాత్ర పోషిస్తాయని.. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని నిపుణులు  చెబుతున్నారు.    
 
రాష్ట్రం నుంచి 70 వేల మంది.. 

నీట్‌ యూజీ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 23.80 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. గతేడాది 20.87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే గతేడాది ఆంధ్రప్రదేశ్‌ నుంచి 68 వేల మంది నీట్‌ రాయగా 42 వేల మంది అర్హత సాధించారు. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 70 వేల మందికిపైగా నీట్‌ రాసే అవకాశాలున్నాయి. గతేడాది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరుణ్‌ చక్రవర్తి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే.   

తరచూ పునశ్చరణ చేయాలి.. 
ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన అంశాలతో షార్ట్స్‌ నోట్స్‌ రాసుకోవాలి. వాటిని తరచూ పునశ్చరణ చేస్తూ ఉండాలి. బయాలజీలో ప్లాంట్‌ అండ్‌ యానిమల్, హ్యూమన్‌ ఫిజియాలజీ, మార్ఫాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ, బయోటెక్నాలజీ, రీప్రొడక్షన్‌ వంటివి ముఖ్యమైన అధ్యాయాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. పరీక్షకు తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్త విషయాలు, అంశాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించకపోవడం ఉత్తమం.   – కె. రవీంద్రకుమార్, నీట్‌ కోచింగ్‌ నిపుణులు,  శ్రీ చైతన్య విద్యా సంస్థలు 

ఏ రోజు సిలబస్‌ ఆ రోజే పూర్తి చేయాలి.. 
పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా సది్వనియోగం చేసుకోవాలి. ఏ రోజు సిలబస్‌ను ఆ రోజే పూర్తి చేస్తే ఒత్తిడి ఉండదు. నా స్నేహితులతో కలిసి గ్రూప్‌ స్టడీ చేసేవాడిని. వారితో కలిసి మాక్‌ టెస్ట్‌లు రాయడం వల్ల మాలో మాకు మంచి పోటీ ఉండేది. అత్యుత్తమ ప్రతిభ కనబరచడంలో గ్రూప్‌ స్టడీ నాకు ఎంతో మేలును చేకూర్చింది. ప్రశ్నను చదవడం, అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయొద్దు. పరీక్ష రాసేప్పుడు తొలుత బయాలజీ సెక్షన్‌ పూర్తి చేసి, తర్వాత ఫిజిక్స్, చివరలో కెమిస్ట్రీ రాయడం మంచిదని నా అభిప్రాయం.  – వరుణ్‌ చక్రవర్తి, నీట్‌ యూజీ–2023, ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌    

Published date : 18 Apr 2024 11:20AM

Photo Stories