Skip to main content

ఇష్టపడి చదవాలి.. పవన్ సమీర్

వైఫల్యాలు ఎదురైనా చలించక పదమూడు వందల నూతన ఆవిష్కరణలు చేసిన ఎడిసన్.. నిరుపేద కుటుంబంలో పుట్టి అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్.. సదుపాయాలు లేని రోజుల్లో గణిత సిద్ధాంతాలను అందించిన పైథాగరస్.. నల్లజాతీయుల్లో అనూహ్య ఉత్తేజం కలిగించిన మార్టిన్ లూథర్ కింగ్.. సామాన్య కుటుంబంలో పుట్టి దేశాధ్యక్షుడైన అబ్దుల్ కలాం.. ఫేస్‌బుక్‌ని రూపొందించి ప్రపంచాన్ని దగ్గరి చుట్టంలా మార్చేసిన జుకర్‌బర్గ్.. ఇలా తమ ఆలోచనలతో ప్రపంచాన్ని కదిలించిన మహనీయులంతా తనకు స్ఫూర్తిప్రదాతలే అంటున్నారు తాజాగా విడుదలైన ఆల్ ఇండియా సివిల్స్ ఎగ్జామ్స్‌లో 142వ ర్యాంక్ సాధించిన పవన్ సమీర్ కుమార్. చదివినంత సేపు ఇష్టపడి చదవాలి కానీ.. విరక్తి పుట్టేలా చదివితే ఫలితం ఉండదంటున్న పవన్ సమీర్...
నాన్న వెంకట సుబ్రమణ్యం. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అమ్మ సౌభాగ్య లక్ష్మి గృహిణి. మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. కానీ నా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. పదో తరగతి వరకు బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో.. ఇంటర్మీడియట్ శ్రీచైతన్య కాలేజీలో చదివాను. పదో తరగతిలో 93 శాతం, ఇంటర్‌లో 96 శాతం మార్కులు వచ్చాయి. తర్వాత శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పూర్తిచేశాను. 85 శాతం మార్కులతో బీటెక్ పూర్తయింది.
 
ఆ తపనతోనే..
బీటెక్ అయిపోగానే తర్వాత ఏం చేయాలనే దానిపై కొద్ది రోజులు సీరియస్‌గా ఆలోచించాను. చాలామంది ఎంటెక్, ఎంబీఏ ఏదో ఒక కోర్సులో చేరమని సలహా ఇచ్చారు. కానీ, చిన్నప్పటి నుంచి సమాజానికి నావంతుగా ఏదో ఒకటి  చేయాలనే తపన ఉండేది. ఆ తపనతోనే సివిల్స్ వైపు అడుగులు వేశాను. రెండుసార్లు విజయం సాధించలేకపోయినా నిరాశ చెందలేదు. అపజయానికి కారణాలేవైనా.. ఆ బాధ కొన్నాళ్లే ఉండేది. వెంటనే మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రిపరేషన్ సాగించేవాడిని. ఎలాంటి కోచింగ్ లేకుండా.. ఒక్క మాక్ టెస్ట్‌కి కూడా హాజరు కాకుండా సొంతంగానే చదివా. చాలామంది స్నేహితులు కోచింగ్ తీసుకోమని సలహా ఇచ్చారు. కానీ నా మీద నాకు గట్టి నమ్మకం. అందుకే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ముందుకు సాగా. గత పరీక్షల్లో నేను చేసిన తప్పులను తెలుసుకొని.. అవి పునరావృతం కాకుండా సరిదిద్దుకుంటూ సివిల్స్ 2016కు సన్నద్ధమయ్యాను. 
 
వార్తా పత్రికలు తప్పనిసరి
ప్రతిరోజు వార్తా పత్రికలు తప్పనిసరిగా చదవాలి. దీనివల్ల ఏదైనా ఒక అంశానికి సంబంధించి కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా ఒక అంశాన్ని సూటిగా.. స్పష్టంగా.. అర్థవంతంగా ఎలా రాయాలో తెలుస్తుంది. కరెంట్ అఫైర్స్‌పై బాగా పట్టుండాలి. చేతిరాతే తలరాతను మారుస్తుంది. అందుకోసం రాత ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. మనం ఎంత చదివినా.. ఎన్ని అంశాలు తెలుసున్నా.. వాటిని అందంగా.. స్పష్టంగా.. అర్థవంతంగా.. వేగంగా ఎలా ప్రజెంట్ చేయాలో కూడా తెలియాలి. అందుకోసం ఒక అంశాన్ని రెండు మూడుసార్లు రాసి చెక్ చేసుకోవాలి. వెబ్‌సైట్లు ఫాలో కావాలి.
 
టైమ్ మేనేజ్‌మెంట్ :
సివిల్స్ ఎగ్జామ్స్ రాయడమంటే ఓ సముద్రాన్ని ఈదినట్లే. ఇందుకోసం సమయపాలన చాలా అవసరం. ప్రశ్నాపత్రం చూడగానే సగం ప్రశ్నలు మొదటిసారి అర్థం కావు. కొన్ని ప్రశ్నలు రెండు మూడు కాన్సెప్ట్‌లు కలిపి ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి మాత్రం మూడు గంటలే. సగటున ఒక్కో ప్రశ్నకు ఎనిమిది నిమిషాలకు మించి సమయం ఉండదు. ఈ సమయంలోనే ప్రశ్నను చదివి.. అర్థం చేసుకొని.. వ్యూహాన్ని ఎంచుకొని.. సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే.. అభ్యర్థి ఎంత వే గంగా.. సృజనాత్మకంగా ఆలోచించాలో అర్థం చేసుకోవచ్చు. అందుకే  పోటీ పరీక్షల్లో సమయం చాలా విలువైనది. కాబట్టి ప్రిపరేషన్ ప్రారంభించినప్పుటి నుంచే టైమ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
స్వీయ విశ్లేషణ :
అన్నింటి కంటే స్వీయ విశ్లేషణ చాలా ముఖ్యం. ప్రతి రోజూ మనం చదివినదాన్ని ఎంత మేరకు అర్థం చేసుకున్నామో చెక్ చేసుకోవాలి. మన ఆలోచనా విధానం సరైందా.. కాదా..? అని సీనియర్లతో, సమకాలీకులతో, సహచరులతో చర్చించాలి. చర్చల్లో చాలా అంశాలు తెలియడంతోపాటు మన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. 
 
రోజూ తప్పకుండా ఇంగ్లిష్, తెలుగు న్యూస్ పేపర్లు చదవాలి. ఎందుకంటే.. సివిల్స్ పరీక్షలంటేనే జాతీయ, అంతర్జాతీయ, స్థానిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ప్రిపరేషన్‌కు సాక్షి భవిత, విద్యలో ప్రచురితమైన వ్యాసాలు, సబ్జెక్టు అంశాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
Published date : 02 Jun 2017 05:26PM

Photo Stories