Skip to main content

Civils Interview Important Tips: ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. సివిల్స్ ఇంటర్వ్యూలో విజ‌యం మీదే..!

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2021.. ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
Civils Interview
Civils Interview Tips

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా మొత్తం.. 19 కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు.. నిర్వహించే మూడు దశల ఎంపిక ప్రక్రియలో..రెండో దశ మెయిన్‌ పరీక్ష ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. ఇక..మిగిలింది.. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్‌గా పిలిచే ఇంటర్వ్యూ!! వ్యక్తిగత, వృత్తిగత, సమకాలీన అంశాలపై అవగాహనను పరిశీలించేలా.. పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. ఇందులోనూ విజయం సాధిస్తే.. సర్వీస్ సొంతమైనట్లే! ఏప్రిల్‌ 5 నుంచే సివిల్స్‌–2021 ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో.. పర్సనాలిటీ టెస్ట్‌లో విజయం సాధించడానికి మార్గాలపై ప్రత్యక కథనం.. 

మొత్తం 2025 మార్కులకు జరిగే సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో.. చివరి దశ ఇంటర్వ్యూకు 275 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ, అందులో పొందిన మార్కులే.. అంతిమ విజయాన్ని, అదే విధంగా కేడర్‌ కేటాయింపును నిర్దేశిస్తున్నాయి. కాబట్టి మెయిన్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో నిమిత్తం లేకుండా ఇంటర్వ్యూకు సర్వ సన్నద్ధమవ్వాలి అంటున్నారు నిపుణులు.

712 పోస్టులు.. 1,823 మంది అభ్యర్థులు..
సివిల్‌ సర్వీసెస్‌ 2021 పరీక్ష ద్వారా.. 19 కేంద్ర సర్వీసుల్లో 712 పోస్ట్‌లు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఇందుకోసం నిర్వహించిన తొలి దశ ప్రిలిమ్స్‌లో విజయం సాధించి.. 9,214 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన మెయిన్స్‌ ఫలితాల ద్వారా 1,823 మందిని చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. అంటే.. ఒక్కో పోస్ట్‌కు 2.5 మంది చొప్పున(1:2.5 నిష్పత్తిలో) చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరిలో 25 నుంచి 30 శాతం మంది గత ఏడాది విజయం సాధించి.. ఐఏఎస్‌ కాకుండా ఇతర సర్వీసులు ఎంచుకున్న వారు ఉంటారని అంచనా. వీరు ఐఏఎస్‌ లక్ష్యంగా ఈసారి కూడా పరీక్షకు హాజరై ఇంటర్వ్యూకు ఎంపికై ఉంటారని నిపుణులు అంటున్నారు. తాజా అభ్యర్థులతో పోల్చితే ఇంటర్వ్యూను ఎదుర్కొనే విషయంలో వీరికి కొంత అవగాహన ఉంటుంది.. కానీ దీని గురించి తాజాగా ఇంటర్వ్యూకు ఎంపికైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

నో టెన్షన్‌..
సివిల్స్‌–2021 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. కాబట్టి అభ్యర్థులు సన్నద్ధత పొందడానికి కొంత తక్కువ సమయమే ఉందని చెప్పొచ్చు. నిర్దిష్ట షెడ్యూల్, మాక్‌ ఇంటర్వ్యూల ద్వారా నిపుణుల గైడెన్స్‌ వంటి చిట్కాలతో ఇంటర్వ్యూలో విజయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. 

వ్యక్తిగత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ..
సివిల్స్‌ ఇంటర్వ్యూకు సన్నద్ధతలో అభ్యర్థులు ప్రధానంగా వ్యక్తిగత వివరాలపై శ్రద్ధ పెట్టాలి. అకడమిక్‌ నేపథ్యం, ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రొఫెషన్, కుటుంబ నేపథ్యంపై ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేట్లు ఉండాలి. మెయిన్స్‌ ఎగ్జామ్‌ ముందు అందించిన డీఏఎఫ్‌–1, ఇంటర్వ్యూకు ముందు ఇవ్వాల్సిన డీఏఎఫ్‌–2లలో పొందుపరిచిన వివరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 

సమాధానం ఇచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా..

UPSC


సివిల్స్‌ ఇంటర్వ్యూలలో అభ్యర్థుల గురించి తెలుసుకునేందుకు ముందుగా మీ గురించి చెప్పండి అనే రీతిలో ప్రశ్నలు మొదలవుతాయి. ఆ తర్వాత క్రమంగా డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాలు, సర్వీస్‌ ప్రాథమ్యతలు, సమకాలీన అంశాల వైపు ఇంటర్వ్యూ కొనసాగుతుంది. మీరు సివిల్‌ సర్వీసెస్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణం? అనే ప్రశ్న ఎదురయ్యే అవకాశముంది. దీనికి సమాధానం ఇచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. చాలా మంది ఈ ప్రశ్నకు సామాజిక సేవ లక్ష్యం అనే సమాధానం చెబుతారు. ఈ సమాధానాన్ని బలపరచుకునే విధంగా అభిప్రాయం వ్యక్తీకరించే నైపుణ్యం పొందాలి. ముఖ్యంగా టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్స్‌ ‘సోషల్‌ సర్వీస్‌ లక్ష్యంగా సివిల్స్‌ ఎంపిక’ అనే సమాధానం చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఇంటర్వ్యూ రోజు వరకు..
నిర్దిష్టంగా ఇంటర్వ్యూ తేదీ రోజు వరకు జరిగిన సమకాలీన అంశాలవైపు కూడా మళ్లుతుంది. ఉదాహరణకు..‘ఈ రోజు న్యూస్‌ చూశారా?ఏ పేపర్‌ చదివారు?అందులో మీకు బాగా ఆకట్టున్న వార్త ఏంటి?’వంటి ప్రశ్నలు లేదా ఈరోజు వార్తలో నిలిచిన ముఖ్యాంశం ఏంటి?వంటి ప్రశ్నలు సైతం ఎ దురవుతాయి.దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు.. ఇంటర్వ్యూ రోజున కూడా కనీసం రెండు ప్రామాణిక దినపత్రికలు చదవాలి. వాటిలో ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు గ్రహించాలి.

సమకాలీన అంశాలను..
అభ్యర్థులు సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, అణ్వాయుధ ప్రయోగాల వల్ల ఏర్పడే పరిణామాలు.. రష్యా విషయంలో మన దేశం అనుసరిస్తున్న వైఖరి.. దీనిపై ఇతర దేశాల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. వాటికి సంబంధించి మన దేశ వ్యూహాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పరచుకోవాలి. జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్న అంశాల(ఉదా: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఎల్‌ఐసీ ఐపీఓ, బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు తదితర)పై అవగాహన పెంచుకోవాలి. 

సమస్యలపై అవగాహన..
పర్సనల్‌ ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. తమ స్వస్థలానికి సంబంధించి సామాజిక, చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలి. అదే విధంగా ప్రస్తుతం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమస్యలు, వాటికి అభ్యర్థుల పరిష్కారాలు  తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. 

ఆకట్టుకునేలా..
సివిల్స్‌ ఇంటర్వ్యూ అభ్యర్థులు.. తాము అప్లికేషన్‌లో పేర్కొన్న హాబీలపై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. చాలామంది బుక్‌ రీడింగ్, వాచింగ్‌ టీవీ, సింగింగ్, ప్లేయింగ్, వాచింగ్‌ మూవీస్‌ వంటి వాటిని పేర్కొంటారు. ఇంటర్వ్యూలో వీటిపైనా ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని గమనించాలి. బుక్‌ రీడింగ్‌ హాబీకి సంబంధించి.. నిర్దిష్టంగా ఒక రచయిత పేరును పేర్కొన్న అభ్యర్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సదరు రచయిత ప్రచురణల్లో ముఖ్యమైనవి, వాటిలో పేర్కొన్న ముఖ్యమైన కొటేషన్లు, వాటి అర్థాలు, సదరు రచన సారాంశం లేదా ఉద్దేశం వంటి వాటిని తెలుసుకోవాలి. బోర్డ్‌లో పలు నేపథ్యాల నిపుణులు ఉంటారు. వారు సదరు రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివారా? అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? లేదా అందులో వివాదాస్పదమైన అంశం ఏంటి? వంటి ప్రశ్నలు అడిగే ఆస్కారముంది.

వ్యక్తిగత బలాలు, బలహీనతల‌పై..
సివిల్‌ సర్వెంట్‌ అనేది ఒక విభాగానికి, లేదా ఒక ప్రాంతానికి పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాల్సిన హోదా. ఇందులో వ్యక్తిగత లక్షణాలు కూడా కీలకంగా నిలుస్తాయి. కాబట్టి ఇటీవల కాలంలో అభ్యర్థుల వ్యక్తిగత బలాలు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అభ్యర్థులు తమకున్న బలహీనతల గురించి చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘అగ్రెసివ్‌నెస్‌’, ‘సహనం తక్కువ’ వంటి సమాధానాలు చెప్పడం సరికాదు.

అభిప్రాయం సూటిగా..
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలిగాలి. ఇందుకోసం తమ అభిప్రాయాలను బలపరిచే విధంగా ఉండే అంశాలను ఉదహరించేలా వ్యవహరించాలి. సానుకూల లేదా ప్రతికూల అభిప్రాయం ఏదైనా సరే తమ అభిప్రాయాన్ని ఎదుటి వారిని మెప్పించే రీతిలో చెప్పాలి.

ముఖాముఖి చర్చగా..
పర్సనల్‌ ఇంటర్వ్యూ అంటే.. కేవలం ప్రశ్న, సమాధానం అనే కోణంలోనే కాకుండా.. ఒక చర్చా వేదికగానూ భావించి ముందడుగు వేయాలి. కారణం.. 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో నిర్వహించే ఇంటర్వ్యూలో.. ఆ వ్యవధి మొత్తం ఒకే అంశంపై చిన్నపాటి చర్చ మాదిరిగా ప్రశ్న–సమాధానాలు ఎదురవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు కచ్చితంగా ఆయా అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడం మేలు.

సమయస్ఫూర్తిగా..
సివిల్స్‌ అభ్యర్థులు అలవర్చుకోవాల్సిన మరో లక్షణం.. సమయస్ఫూర్తి. గత రెండు, మూడేళ్లుగా ఇంటర్వ్యూల శైలిని పరిగణనలోకి తీసుకుంటే.. బోర్డ్‌ సభ్యులు అభ్యర్థుల నుంచి సమయస్ఫూర్తిని ఆశిస్తున్నారు. దీంతోపాటు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ ఉండాలని కోరుకుంటున్నారు. ‘మీరు ఒక ఐఏఎస్‌ అధికారిగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక సమస్య ఎదురైంది? దీనికి తక్షణ పరిష్కారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’ వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి వాటికి సమాధానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎదుటి వారిని మెప్పించే విధంగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూనే.. వాటికి అనుగుణంగా పరిష్కార చర్యలు చేపడతామనే విధంగా సమాధానాలు చెప్పాలి.

ఆహార్యం.. అత్యంత ఆవశ్యకం..

upsc interview


ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు వ్యక్తిగత ఆహార్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. హుందాగా ఉండేలా వ్యవహరించాలి. పురుష అభ్యర్థులు లైట్‌ కలర్‌ షర్ట్స్‌ ధరించడం హుందాగా ఉంటుంది. అదే విధంగా మహిళా అభ్యర్థులు శారీ, లేదా సల్వార్‌ కమీజ్‌లను ధరించి ఇంటర్వ్యూకు హాజరవడం ఎదుటి వారిలో సదభిప్రాయం కలిగేలా చేస్తుంది. ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలిచ్చేటప్పుడు బాడీలాంగ్వేజ్‌ కూడా ఎంతో ముఖ్యం. హావ భావాలను నియంత్రించుకోవాలి. 

తక్కువ మార్కులే అనుకోవద్దు..
సివిల్‌ సర్వీస్‌ ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 275. మొత్తం మార్కుల్లో 275 తక్కువ మార్కులే కదా అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే.. ఇంటర్వ్యూలో పొందిన మార్కులే మెరిట్‌ లిస్ట్‌లో అభ్యర్థుల స్థానాన్ని నిర్దేశిస్తోంది. వాస్తవానికి మొత్తం 2025 మార్కుల్లో ఇంటర్వ్యూకు కేటాయించిన 275 మార్కులుæ తుది జాబితాలో నిలిపేందుకు కీలకంగా మారుతున్నాయి. కారణం.. ఇంటర్వ్యూ అంతా ముఖాముఖి విధానంలో ఉండడం, బోర్డ్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలు లేదా ఆయా అంశాలపై అవగాహనను, వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించే విధంగా ఇంటర్వ్యూ జరగడమే. ఈ విషయంలో ఏ మాత్రం తడబాటుకు గురైనా.. కొద్ది మార్కుల తేడాతో విజయం చేజారే ప్రమాదం లేదా కోరుకున్న సర్వీసు రాకపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు ప్రధానంగా కొన్ని నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి.

అత్యంత అప్రమత్తతగా..
సివిల్స్‌ ఇంటర్వ్యూ విషయంలో చాలా అప్రమత్తతో వ్యవహరించాలి. ఇందుకోసం ప్రిపరేషన్‌ సమయంలోనే వ్యూహం ఏర్పరచుకోవాలి. వ్యక్తిగతం నుంచి సమకాలీన అంశాల వరకూ.. అన్నింటిపైనా సంపూర్ణ అవగాహన ఉండడం మేలు చేస్తుంది. మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావడం, దిన పత్రికలను క్రమం తప్పకుండా చదవడం, అందులోని ఎడిటోరియల్స్, సమకాలీన ప్రాధాన్యత అంశాలపై వచ్చే కథనాల నుంచి సమాచారం సేకరించుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో ఏవైనా తెలియని ప్రశ్నలు అడిగితే.. ఆ విషయాన్ని ఏ మాత్రం బిడియం లేకుండా బోర్డ్‌ సభ్యులకు తెలియజేయాలి. 
                                                   –ఆర్‌.జగత్‌ సాయి, సివిల్స్‌–2020 విజేత(32వ ర్యాంకు)

ప్రాక్టికల్, పాలన దక్షత..
సివిల్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌లో ప్రధానంగా అభ్యర్థుల్లోని పరిపాలన దక్షతను, ప్రాక్టికల్‌గా ఆలోచించే నైపుణ్యాన్ని పరిశీలించే విధంగా బోర్డ్‌ సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. నిర్దిష్టంగా ఒక సమస్య పట్ల స్పందించే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం వంటి వాటిని పరీక్షిస్తారు. ఈ నైపుణ్యాలు పెంచుకోవాలి. ఏ అంశానికైనా సమాధానం ఇచ్చేటప్పుడు స్పష్టమైన భావ వ్యక్తీకరణ ఎంతో ప్రధానం. 
                                                –శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌

Published date : 28 Mar 2022 06:37PM

Photo Stories