Skip to main content

TS ICET 2023 Notification: బెస్ట్‌ ర్యాంకుకు ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషన్‌.. ఐటీ ప్రొఫెషనల్స్‌. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న లక్షల మంది విద్యార్థుల లక్ష్యం! భవిష్యత్‌ మేనేజర్లుగా, ఐటీ ప్రొఫెషనల్స్‌గా మారేందుకు మార్గం.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు!! వీటిల్లో చేరేందుకు ఐసెట్‌లో ర్యాంకు తప్పనిసరి. తాజాగా.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి టీఎస్‌ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ ఐసెట్‌-2023 వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, బెస్ట్‌ ర్యాంకుకు ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
ts icet 2023 notification and exam preparation tips
  • మొదలైన టీఎస్‌ ఐసెట్‌ 2023 దరఖాస్తు ప్రక్రియ
  • మే 26, 27 తేదీల్లో నాలుగు స్లాట్లలో ఎంట్రెన్స్‌ టెస్ట్‌
  • ఈ ర్యాంకు ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశం

ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా ఐసెట్‌! ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా..మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌(ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మేనేజ్‌మెంట్, ఐటీ విభాగాల్లో కొలువులు కోరుకునే విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

అర్హతలు

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఎంసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్‌ గ్రూప్‌ సబ్జెక్ట్‌గా చదివుండాలి. 
  • బ్యాచిలర్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ICET - ANALYTICAL ABILITY | MATHEMATICAL ABILITY | COMMUNICATION ABILITY | COMPUTER TERMINOLOGY | MODEL PAPERS 

ఆన్‌లైన్‌ పరీక్ష

  • టీఎస్‌ ఐసెట్‌-2023 పరీక్ష మే 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్లుగా 200 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. -విభాగం-ఏలో డేటా సఫిషియన్సీ 20 ప్రశ్నలు-20 మార్కులు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ 55 ప్రశ్నలు-55 మార్కులకు; విభాగం-బిలో మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 75 ప్రశ్నలు-75 మార్కులకు, విభాగం-సిలో కమ్యూనికేషన్‌ ఎబిలిటీ 50 మార్కులకు ఉంటాయి. 
  • సెక్షన్‌-ఎలోని డేటా సఫిషియన్సీ విభాగంలో 15 ప్రశ్నలు మ్యాథమెటికల్, మరో అయిదు ప్రశ్నలు వెర్బల్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-ఎలోని ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగంలో.. సిరీస్‌ కొశ్చన్స్‌ 25; డేటా అనాలిసిస్‌ సంబంధిత ప్రశ్నలు 10; కోడింగ్‌ అండ్‌ డీ కోడింగ్‌ సంబంధిత ప్రశ్నలు 10, డేట్, టైమ్‌ అండ్‌ అరేంజ్‌మెంట్‌కు సంబంధిత 10 ప్రశ్నలు అడుగుతారు. 
  • సెక్షన్‌-బిలో అర్థమెటికల్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు; అల్జీబ్రకల్‌ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు; స్టాటిస్టికల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి.
  • సెక్షన్‌-సిలోని కమ్యూనికేషన్‌ ఎబిలిటీలో.. మీ­నింగ్స్,సినానిమ్స్‌ అండ్‌ యాంటానిమ్స్,వెర్బ్స్, ఫ్రేజల్‌ వెర్బ్స్‌ అండ్‌ ఇడియమ్స్, ఆర్టికల్స్‌ అండ్‌ ప్రిపొజిషన్స్, కంప్యూటర్‌ టెర్మినాలజీ, బిజినెస్‌ టెర్మినాలజీ, కాంప్రహెన్షన్‌ల నుంచి అయిదు ప్రశ్నలు చొప్పున అడుగుతారు. కాంప్రహెన్షన్‌ నుంచి మూడు ప్యాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో ప్యాసేజ్‌ నుంచి అయిదు ప్రశ్నలు అడుగుతారు. 
  • మొత్తం పరీక్షకు కేటాయించిన సమయం రెండున్నర గంటలు.

22 వేలకు పైగా సీట్లు

గత ఏడాది కౌన్సెలింగ్‌ గణాంకాల ప్రకారం-టీఎస్‌ ఐసెట్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో ఎంబీఏ, ఎంసీఏలకు సంబంధించి 272 కళాశాలల్లో దాదాపు 25 వేల సీట్లు ఉన్నాయి. 231 కళాశాలల్లో 20,481 ఎంబీఏ సీట్లు, 40 కళాశాలల్లో 2,370 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐసెట్‌ ర్యాంకు ఆధారంగా మలి దశలో ఆన్‌లైన్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్ల కేటాయిస్తారు. 

చ‌ద‌వండి: ICET Study Material

విజయం సాధించేలా

రాష్ట్రంలోని యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌కు పోటీ కూడా పెరుగుతోంది. గత ఏడాది ఐసెట్‌కు 62 వేల మంది దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కాబట్టి ఇందులో బెస్ట్‌ ర్యాంకు సాధించేందుకు సిలబస్‌ అంశాలపై గట్టి పట్టు సాధించాల్సి ఉంటుంది. 

అనలిటికల్‌ ఎబిలిటీ

విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించడానికి డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాల్లో నైపుణ్యం సాధించాలి. డేటాను ఇచ్చి దాని ఆధారంగా సమస్య సాధించేవిగా, స్టేట్‌మెంట్‌ ఆధారితంగా ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానాలు గుర్తించేందుకు బేసిక్‌ అర్థమెటిక్‌ అంశాల్లో పట్టు సాధించాలి. ఇది విభాగం-బిలోనూ రాణించేందుకు దోహదపడుతుంది. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే..గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగంలో రీజనింగ్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు కోడింగ్, డీ-కోడింగ్, బ్లడ్‌ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

మ్యాథమెటికల్‌ ఎబిలిటీ

ఈ విభాగం కోసం హైస్కూల్‌ స్థాయి మ్యాథమెటిక్స్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి కొంత క్లిష్టంగా ఉండే స్టాటిస్టికల్‌ ఎబిలిటీ కోసం ఇంటర్మీడియెట్‌ స్థాయి పుస్తకాలను అనుసరించాలి. అర్థమెటిక్‌ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే.. శాతాలు, లాభ నష్టాలు, నిష్పత్తులు, మెన్సురేషన్, పని-కాలం, పని-సమయం వంటి అంశాలు ముఖ్యమైనవి. అల్జీబ్రకల్‌ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌ ఆఫ్‌ యాంగిల్స్, సెట్స్, లీనియర్‌ ఈక్వేషన్స్, కోఆర్డినేట్‌ జామెట్రీలపై పట్టు సాధించాలి.

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ

  • ఈ విభాగంలో కొంత ఎక్కువ మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్, విశ్లేషణ సామర్థ్యం, కంపేరిటివ్‌ అప్రోచ్‌ ఉంటే.. మొత్తం 50 ప్రశ్నల్లో 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చు. బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. వొకాబ్యులరీ పెంచుకునేందుకు కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం 20 కొత్త పదాలు నేర్చుకోవడం, వాటి వినియోగాన్ని ప్రాక్టీస్‌ చేయాలి. బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీలో.. సామాజిక వ్యాపార-వాణిజ్య అంశాలు, అదే విధంగా తాజా పరిణామాలు, కంప్యూటర్‌ బేసిక్స్‌పై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రాణించాలంటే.. బిజినెస్‌ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు-వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. కంప్యూటర్‌ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్‌ ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూ­ల్స్, అదే విధంగా కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ముఖ్య భాగాలు, వాటి పనితీరుకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యం కలిసొస్తుంది. 
  • రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో.. ప్యాసేజ్‌ల ఆధారంగా అడిగే 15 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ముందుగా అభ్యర్థులు ఆయా అంశాన్ని, అందులోని కీలక పదాలను, ముఖ్య సారాంశాన్ని గుర్తించే నేర్పు పెంచుకోవాలి. ఇందుకోసం దినపత్రికల వ్యాసాలు, ఇంగ్లిష్‌ స్టోరీ బుక్స్‌ చదవాలి. ఫంక్షనల్‌ గ్రామర్‌లో మంచి మార్కుల కోసం బేసిక్‌ గ్రామర్‌ అంశాలుగా పేర్కొనే సినానిమ్స్, యాంటానిమ్స్, కొశ్చన్‌ ట్యాగ్స్, డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ గ్రామర్‌ బుక్స్‌ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. 

ప్రాక్టీస్‌తో పదును

ఐసెట్‌లో మంచి స్కోర్‌ సాధించేందుకు చక్కటి మార్గం.. ప్రాక్టీస్‌. కాబట్టి అభ్యర్థులు ఆయా టాపిక్స్‌ అధ్యయనంతోపాటు ప్రతి రోజూ కొంత సమయం ప్రాక్టీస్‌కు కేటాయించాలి. దీంతోపాటు పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌ అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌ కోణంలో అధ్యయనం చేయాలి.

ముఖ్య సమాచారం

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మార్చి 6-మే6, 2023
  • రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే22, 2023
  • ఐసెట్‌ పరీక్ష తేదీలు: మే 26, 27, 2023
  • వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in
Published date : 14 Mar 2023 05:11PM

Photo Stories