Skip to main content

Mohammed Siraj: పెయింటింగ్‌ వేస్తూ ఎదిగాడు.. ఇప్పుడు 140కి.మీ వేగంతో ప్రత్యర్థులకు చుక్కలుచూపిస్తున్నాడు... మన హైదరబాదీ ఫాస్ట్‌ బౌలర్‌ గురించి ఈ విషయాలు తెలుసా

హైదరాబాద్‌.. మాసాబ్‌ట్యాంక్‌ సమీపంలో ఖాజానగర్‌లో ఓ ఇరుకైన అద్దె ఇల్లు.. ఓ ఆటో డ్రైవర్‌ తన కుటుంబంతో కలిసి జీవించే వాడు. కష్టపడి పెద్ద కొడుకును ఇంజనీరింగ్‌ చదివించలిగాడు.

ఇక చిన్నోడు.. తనకేమో ఆటే ప్రపంచం.. క్రికెట్‌ అంటే పిచ్చిప్రేమ.. పెద్దోడు ఎలాగోలా సెటిల్‌ అవుతాడు.. మరి ఈ చిన్నోడి పరిస్థితి ఏమవుతుందోనని తల్లి ఆందోళన.

పట్టువదలకుండా శ్రమిస్తే ఎంతటి విజయమైనా మనముందు నిలుస్తుందని గట్టిగా నమ్మాడు మహ్మద్‌ సిరాజ్‌. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తూ వికెట్లు పడగొట్టడం మొదలుపెట్టాడు. ప్రత్యర్థులకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపేవాడు. దీంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 

siraj

అంచెలంచెలుగా ఎదుగుతూ రంజీల్లోకి ప్రవేశించాడు. అక్కడ తన ప్రతిభ కొనసాగించాడు. కష్టానికి తోడు అదృష్టం తోడవడంతో 22 ఏళ్ల వయసులో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. 2017 వేలంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.2.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో ఆ కుర్రాడి దశ తిరిగింది. అదే ఇయర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

2019లో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2020లో ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌  సంచలనం సృష్టించాడు. అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా పేస్‌ విభాగంలో కీలక బౌలర్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు సొంత మైదానంలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడబోతున్నాడు.

siraj

28 ఏళ్ల మహ్మద్‌ సిరాజ్‌ ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2022 జనవరి 1 నుంచి చూస్తే 18 వన్డేల్లో అతను 19.87 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. అసోసియేట్‌ జట్లను మినహాయిస్తే ఒక బౌలర్‌ పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే. 42 మ్యాచ్‌ల కెరీర్‌ తర్వాత తన సొంత నగరంలో సిరాజ్‌ బుధవారం తన తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు. అతడి ప్రతిభ, నైపుణ్యంపై మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు ఎంత‌ నమ్మకం ఉందో.. రోహిత్‌ శర్మ ప్రెస్‌మీట్‌ చూసిన వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది. మనం కూడా మన హైదరాబాదీ కుర్రాడికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం!!

Published date : 18 Jan 2023 03:09PM

Photo Stories