Vice President: పిల్లల్లో లోపాలను ముందే గుర్తిస్తే మేలు
తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ బోయినపల్లిలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ ఐఈపీఐడీ) దివ్యాంగుల శిక్షణా కేంద్రాన్ని ఆయన ఏప్రిల్ 17న సందర్శించారు. శిశువుల్లో సమస్యల పరిష్కారానికి ఎన్‌ఐఈపీఐడీ సీసీఎంబీ వంటి సంస్థలతో అనుసంధానమై పనిచేయాలని వెంకయ్య సూచించారు. దేశ జనాభాలో 2.21% దివ్యాంగులున్నారని, వారికి చేయూత అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘యాక్సెసెబుల్ ఇండియా’ ఉద్యమం ద్వారా సానుకూల మార్పులు కనబడుతున్నాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో వారికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, సమాజం పాటుపడాలన్నారు. దివ్యాంగులకు శిక్షణ, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంలో ఎన్ ఐఈపీఐడీ చేస్తున్న కృషిని వెంకయ్య అభినందించారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక సామర్ధ్యం ఉంటుందని, దానిని గుర్తించి తర్ఫీదునిచ్చి, వారు ఆర్థికంగా స్వతంత్రులు కావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈపీడబ్ల్యూడీ సంయుక్త కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎన్‌ఐఈపీఐడీ సంచాలకుడు మేజర్ బి.వి.రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.