Kanthi Rana Tata, IPS: సివిల్స్ ప్రిపరేషన్‌లో న్యూస్ పేపర్స్ ప్రాధాన్యత
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు న్యూస్ పేపర్‌ను ఏ విధంగా చదవాలి?
ఏ కాంపిటీటివ్ ఎగ్జాం ప్రిపరేషన్‌కైనా న్యూస్ పేపర్ రీడింగ్ తప్పనిసరి. ఎందుకంటే.. ప్రతీ రాత పరీక్షలో అడిగే ప్రశ్నలు కరెంట్ అఫైర్స్‌తో కలగలిపి ఉంటాయి. కాబట్టి మీరు న్యూస్ పేపర్లను, మ్యాగజైన్లను క్రమం తప్పకుండా చదివినట్టయితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. సంఘటనలు జరిగినప్పుడు మీరు చదివే తాజా సమాచారం చాలా కాలం సులభంగా గుర్తుండిపోతుంది. దీనితో ఆయా ముఖ్య అంశాలపై, సబ్జెక్టులపై మీరు ప్రావీణ్యం సంపాధించగలుగుతారు.
ప్రిలిమ్స్‌లో అడిగే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో కరెక్ట్ సమాధానం కనుక్కోవడానికి మాత్రమే కాకుండా, మెయిన్స్ లో అడిగే అకడమిక్ టాపిక్స్‌కు మీరు చదివిన ఫ్యాక్ట్స్ ను కనెక్ట్ చేసి వివరణాత్మకంగా రాయడానికి కూడా పేపర్ రీడింగ్ మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా సమగ్రమైన పేపర్ రీడింగ్... ఇంటర్వ్యూ బోర్డును ఎదుర్కోనేటప్పుడు మీ కాన్ఫిడెంట్ లెవెల్స్‌ను అధిక మోతాదులో పెంపొందిస్తుంది.
చదవండి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన 28 ముఖ్యమైన సందేహాలు - సమాధానాలు... మీ కోసం
న్యూస్ పేపర్ రీడింగ్ మీ ప్రిపరేషన్‌లో భాగమవ్వాలి
1. న్యూస్ పేపర్ అనేక రకాలైన పేజీలతో నిండి ఉండటం వల్ల, ఒక్క గంటలో లేదా రెండు గంటల్లో పూర్తి పేపర్‌ను చదవడం కష్టం. కాబట్టి, మీ ప్రిపరేషన్‌కు ఏ సెక్షన్‌లను రెగ్యులర్‌గా చదవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అయితే న్యూస్ పేపర్‌లో కొన్ని సెక్షన్లను మాత్రం ప్రతీరోజు ఖచ్చితంగా చదవాలి. అవేంటంటే..
- అంతర్జాతీయ / ద్వైపాక్షిక వ్యవహారాలు (ఇంటర్‌నేషనల్/బైలేటరల్ అఫైర్స్)
- ఇండియన్ అండ్ వరల్డ్ ఎకానమీ
- ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్
- ఎడిటోరియల్, ఎడిటోరియల్‌కు ముందు ఉండే పేజీలు
- సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద వెలువడే ఆర్టికల్స్
- స్పోర్ట్స్
- బిజినెస్ అండ్ ఫైనాన్స్
పొలిటికల్ న్యూస్, లోకల్ న్యూస్, యాక్సిటెంట్లు, మర్డర్లు, దొంగతనాలు, సినిమాలు.. వంటి వాటిని ఒకసారి చదవడానికి ప్రయత్నించండి లేదా వదిలేసినా నష్టం లేదు.
2. న్యూస్ పేపర్ చదివేటప్పుడు, ముఖ్యమైన పాయింట్లు రాసుకోవడానికి అనుగుణంగా పెన్ మరియు పేపర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. న్యూస్ ఆర్టికల్స్ లో, ఐటమ్స్ లో వచ్చే ఖఠినమైన పదాలను గుర్తించి న్యూస్ పేపర్ చదివిన తర్వాత డిక్షనరీలో వాటికి అర్ధాలను తెలుసుకోవాలి. అలాగే న్యూస్ పేపర్లలో వచ్చే ఏదైనా ఆర్టికల్ యొక్క దృక్పధం మీకు అర్ధంకాకపోతే వాటిని కూడా మార్క్ చేయండి. ప్రజా ప్రయోజనాలకోసం ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి.
3. న్యూస్ పేపర్‌ను చదవడం పూర్తి చేసిన తర్వాత కొత్తగా అనిపించిన పదాలను గుర్తించి, వాటి అర్ధాలను వెతికి తెలుసుకోవాలి. మీకు అర్ధంకాని న్యూస్ ఐటమ్స్‌ను, ఇతరులతో చర్చించి దాని నేపథ్యాన్ని తెలుసుకోవడానికి ప్రత్నించండి. సివిల్స్‌కు ప్రిపేరయ్యే ఇతర అభ్యర్ధులతో చర్చించడం వల్ల ఈ విధమైన టాపిక్స్ మంచి ట్రిగ్గర్ పాయింట్లుగా మారవచ్చు.
4. కరెంట్ అఫైర్స్/జనరల్ స్టడీస్ పరీక్ష పేపర్‌లోని అన్ని టాపిక్స్ తో మీరు చదివే వార్తా కథనాలను, ఆర్టికల్లను అనుసంధానించాలి.
- ఎడిటోరియల్:
ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను జాగ్రత్తగా చదవాలి. టాపిక్‌ను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడానికి, సమతుగే దృక్పధాన్ని అలవర్చుకోవడానికి ఎడిటోరియల్ ఆర్టికల్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఆర్టికల్స్ మంచి ఇంగ్లీష్ భాషలో రాయబడి ఉంటాయి. కాబట్టి, వీటిని చదవడంవల్ల మీ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్, వొకాబులరీ స్కిల్స్ ను కూడా మెరుగు పరచుకోవచ్చు.
- ఎడిటర్స్ కు లెటర్లు:
సాధారణంగా ఆర్టికల్స్ లేదా ఎడిటోరియల్లకు స్పందిస్తూ పాఠకులు లెటర్లు రాస్తారు. ఆర్టికల్‌లోని అభిప్రాయాలకు మద్ధతుగా లేదా వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను తెలుపుతూ రాస్తారు. ఈ విధమైన ఆర్టికల్స్ ను చదవడం ద్వారా మీరు కూడా ఆర్గుమెంట్ స్కిల్స్ ను పెంపొందిచుకోవచ్చు.
- అంతర్జాతీయ వార్తలు:
ప్రపంచవ్యాప్తపు ముఖ్యమైన సంఘటనలను ఈ విభాగం కవర్ చేస్తుంది. ఈ విభాగాన్ని జాగ్రత్తగా చదవడం వల్ల భారతదేశంతో సహా వివిధ దేశాల మధ్య ఉండే సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు, యుద్ధాల గురించిన సమాచారం, కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులు.. భారతదేశాన్ని లేదా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఇతర సంఘటనలు లేదా ఉందంతాలు తెసులుసుకోవచ్చు.
- ఫైనాన్స్/బిజినెస్ న్యూస్:
ఆర్బీఐ మరియు సెబీ వంటి రెగ్యులేటర్లు జారీ చేసే గైడ్ లైన్లు, ఎకానమీ, మానిటరీ పాలసీలు, స్టాక్ మార్కెట్‌లు బిజినెస్, ఫైనాన్షియల్ అఫైర్స్‌ల ను ప్రభావితం చేస్తాయి. పరిపాలనలో ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ విభాగం కూడా పరీక్షలకు సరిసమానమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
- స్పోర్ట్స్:
వివిధ క్రీడలు, అవార్డులు, క్రీడా ప్రముఖులకు సంబంధించిన వివిధ టోర్నమెంట్లు, కప్పులు మొదలైనవాటిని జనరల్ నాలెడ్జ్ లో భాగంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఒక పుస్తకంలో అన్ని విషయాలు ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవడం కంటే, వాస్తవాలకు సంబంధించిన సంఘలనలు, వ్యక్తుల గురించి చదివి గుర్తుంచుకోవడం చాలా సులభం. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్‌లో స్పోర్ట్స్ పేపర్ రీడింగ్ కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
చదవండి: సివిల్ సర్వెంట్ కావాలనే విద్యార్ధులకు ఐఏఎస్ మేఘనాథ్ రెడ్డి సూచనలు – సలహాలు..
ఏదైనా ఒక న్యూస్ పేపర్‌ను ఎంపిక చేసుకుని, సమగ్రంగా చదవండి. ఎగ్జాం ప్రిపరేషన్‌కు ఎక్కువ మంది నిపుణులు సూచించే న్యూస్ పేపర్ ‘ది హిందూ’. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ వంటి న్యూస్ పేపర్లను కూడా ఫాలో అవ్వండి.
న్యూస్ పేపర్ రీడింగ్ మీ దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలి. ముందుగా న్యూస్ పేపర్‌లో అన్ని ఐటమ్స్ ను చదవడంతో ప్రారంభించాలి. కొన్ని రోజుల తర్వాత సహజంగానే మీకు ఎంపిక చేసుకుని చదవడం అలవాటవుతుంది.
లెర్నింగ్ టూల్‌గా న్యూస్ పేపర్
ఇంటర్‌నెట్ లేదా వీక్లీ మ్యాగజైన్లలో నేపథ్య అధ్యయనం ద్వారా న్యూస్ పేపర్ రీడింగ్‌ను పూర్తి చేయాలి.
ఉదా: భారతదేశంలోని నూక్లియర్ రియాక్టర్స్‌కి సంబంధించిన న్యూస్‌ను వార్తా పత్రికలో మీరు చదివినట్లయితే, ఈ సబ్జెక్టుపై వికీపీడియాలో పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి లేదా మ్యాగజైన్‌లో విశ్లేషణను చదవాలి. ఈ విధమైన పద్ధతి ఒక టాపిక్‌ను పూర్తిగా అర్ధం చేసుకోవడానికి, మీ నాలెడ్జ్‌ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
మొదట్లో న్యూస్ పేపర్ రీడింగ్‌కు ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతుంది. న్యూస్ పేపర్‌ను క్షుణ్ణంగా చదివే క్రమంలో సమయం వృధా అవుతుందని విచారించకండి, క్రమేణా వేగం పుంజుకుంటారు. అన్నింటికంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం న్యూస్ పేపర్ రీడింగ్‌కు మీరు కేటాయించే సమయం చాలా విలువైనది. ఈ అలవాటు పుస్తకాలను సులభంగా చదివేలా చేస్తుంది.