Skip to main content

యువత కెరీర్‌కు చక్కని ఆతిథ్యం...

ఆకట్టుకొనే ఆతిథ్యం దేశ అభివృద్ధికి బాటలు వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ దీన్ని గుర్తించాయి. ఇండియాలోనూ అవకాశాల కల్పన, అభివృద్ధి సాధన పరంగా ఆతిథ్య రంగం దూసుకెళ్తోంది. ఏడాది పొడవునా నియామకాలు కల్పిస్తూ.. ఆకర్షణీయమైన వేతనాలు అందిస్తోంది. ఈ రంగంలో అవకాశాలు లక్షల్లో ఉంటే... వాటికి అర్హులైన అభ్యర్థులు వేలల్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ అర్హతతోనే అద్భుత కెరీర్‌ను అందించే ఆతిథ్య రంగంపై ప్రత్యేక కథనం...
  • కేంద్ర ప్రణాళికా విభాగం లెక్కల ప్రకారం దేశంలో ఉపాధి అవకాశాల కల్పన పరంగా ఐటీ తొలిస్థానంలో ఉండగా ఆతిథ్య రంగం రెండోస్థానంలో ఉంది. కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) గణాంకాల ప్రకారం 2014-15లో సేవారంగ వృద్ధి 10.3 శాతంగా నమోదైంది.
  • సేవారంగంలో భాగంగా ఉండే ట్రేడ్, హోటళ్లు, రెస్టారెంట్లు 10.7 శాతం మేర వృద్ధిని నమోదు చేసి సేవారంగం ప్రగతిలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

లైఫ్ స్టయిల్ మార్పులు.. హాస్పిటాలిటీ వెలుగులు
  • ప్రపంచీకరణ కారణంగా క్యాలెండర్‌లో తేదీలు మారినంత వేగంగా ప్రజల జీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రోజు రోజుకి హోటళ్లు, రెస్టారెంట్లకు ఆదరణ పెరుగుతోంది.
  • ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, ఎడ్వెంచర్ టూరిజం వంటి కాన్సెప్ట్‌లతో పర్యాటక ప్రదేశాలను సంద ర్శించే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆతిథ్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.
  • ఆతిథ్య రంగం అంటే కేవలం.. హాటళ్లు, రెస్టారెంట్లకే పరిమితం కాదు. సేవారంగంలోని లాడ్జింగ్, ఈవెంట్ ప్లానింగ్, థీమ్‌పార్కులు, రవాణా తదితర విభాగాల సమాహారమే ఆతిథ్య రంగం.
  • పర్యాటకాన్ని ప్రోత్సహించి విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ కార్యక్రమంతో పాటు ఆతిథ్య రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుతిచ్చింది. ఈ చర్యల ఫలితంగా రానున్న రోజుల్లో ఆతిథ్య రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఆ మూడింటి కలయికగా
  • ఆతిథ్య రంగం ట్రావెల్ అండ్ టూరిజం; హోటల్ మేనేజ్‌మెంట్; రెస్టారెంట్ మేనేజ్‌మెంట్.. కలయికగా ఉంటుంది.
  • విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తోన్న దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉంది. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఆతిథ్య రంగంలోని ప్రముఖ హాటళ్లు, రెస్టారెంట్లు కొత్త ప్రాజెక్టులతో తమ సేవలను మరింత విస్తరిస్తున్నాయి.
  • ఆయా సంస్థలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఫైవ్‌స్టార్, త్రీస్టార్ హోటళ్లను ఏర్పాటు చేస్తుండటంతో అర్హతలను బట్టి యువతకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి.
  • పర్యాటకులకు సంబంధిత ప్రదేశాల ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యాలను వివరించే టూరిస్ట్ గైడ్స్, పర్యాటకులకు అనుకూలంగా రవాణా సౌకర్యాలను కల్పించే ట్రావెల్ ఆపరేటర్లు ఆకర్షణీయ ఆదాయాన్ని అందుకుంటున్నారు.

ఇంటర్మీడియెట్ నుంచే మార్గాలు
  • ఇంటర్ అర్హతతో ఆతిథ్య రంగంలోని మూడు విభాగాల్లో నచ్చిన దాంట్లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. హోటల్ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కిచెన్ మేనేజ్‌మెంట్ విభాగాల వరకు పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
  • ఆయా కొలువుల్లో స్థిరపడేందుకు వీలుగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా స్థాయిల్లో పలు కోర్సులను అందిస్తున్నాయి. డిప్లొమా ఇన్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, టూరిజం వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి టూరిజంలో చక్కటి అవకాశాలుంటాయి.

అకడమిక్‌గా పెరుగుతున్న ప్రాధాన్యం
  • ఆతిథ్య రంగ అవసరాలకు అనుగుణంగా నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ దిశగా ఆతిథ్య రంగ ఔత్సాహికులకు ఆయా నైపుణ్యాలను అకడమిక్ స్థాయిలోనే అందిస్తోంది.
  • కేంద్ర పర్యాటక శాఖ తన పరిధిలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో ట్రావెల్ అండ్ టూరిజం స్పెషలైజేషన్లలో పీజీ డిప్లొమా కోర్సులు, ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం కోర్సులను నిర్వహిస్తోంది.

లభించే హోదాలు
  • యువత కెరీర్‌కు భరోసాగా నిలుస్తున్న ఆతిథ్య రంగంలో ఎంపిక చేసుకున్న విభాగం, పొందిన అర్హతల ఆధారంగా వివిధ హోదాల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
  • ట్రావెల్ అండ్ టూరిజం విభాగంలో రిజర్వేషన్ సేవలు, కౌంటర్ స్టాఫ్, టూర్ ప్లానర్స్, టూర్ గైడ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. టూర్ ఆపరేటింగ్ సంస్థల్లో మార్కెటింగ్ కొలువుల్లో స్థిరపడితే ఆకర్షణీయమైన వేతనాలను అందుకోవచ్చు.
  • ఎయిర్‌లైన్స్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్స్, కస్టమర్ సర్వీసెస్ విభాగాల్లో అవకాశాలు పొందవచ్చు.
  • హోటల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్, అకౌంటింగ్, ఇంజినీరింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ విభాగాల్లో అర్హతను బట్టి ఎంట్రీ లెవల్ నుంచి మేనేజర్ స్థాయి వరకు అవకాశాలుంటాయి.
  • హాస్పిటాలిటీ విభాగంలో ప్రత్యేకంగా కేటరింగ్, బేకరీ, బుక్ కీపింగ్, రెస్టారెంట్ తదితర శాఖల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.

ఆకర్షణీయమైన వేతనాలు
ఆతిథ్య రంగంలో అభ్యర్థులకు అర్హత, స్థాయిల ఆధారంగా ఆకర్షణీమైన వేతనాలు ఉంటున్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగంగా పేర్కొనే ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్‌కు ప్రారంభంలోనే నెలకు రూ.15 వేల వరకు లభిస్తోంది. ఈ విభాగంలో జీఎం స్థాయి ఉద్యోగులకు నెలకు సగటున రూ. లక్ష వేతనంగా లభిస్తోంది.

ఇన్‌స్టిట్యూట్‌లవైపు అడుగులు వేస్తున్న సంస్థలు
ఆతిథ్య రంగంలోని సంస్థలు సుశిక్షితులైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఆయా సంస్థలు ఈ రంగంలోని స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో ఏటా క్రమం తప్పకుండా బ్యాచిలర్, పీజీ డిగ్రీల ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహిస్తూ సగటున రూ. 5 లక్షల వార్షిక వేతనం అందిస్తున్నాయి. ఈ రంగంలో ప్రముఖ సంస్థలైన ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, తాజ్ హోటల్స్, ట్రైడెంట్ హోటల్స్, ఐటీసీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి.

హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
  • 2018 నాటికి 36 బిలియన్ డాలర్ల స్థాయికి టూరిజం అండ్ ట్రావెల్ రంగం చేరుకోనుంది. ఇందులో 12.17 బిలియన్ డాలర్ల వాటా దక్కించుకోనున్న ఆతిథ్య రంగం.
  • వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అంచనా ప్రకారం 2019 నాటికి ఆతిథ్య రంగ నియామకాల పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ నిలవనుంది.
  • నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంచనా ప్రకారం 2018 చివరికి ట్రావెల్ అండ్ టూరిజం విభాగాల్లో 18,84,000, హోటల్ విభాగంలో 2.9 మిలియన్లు, టూర్ ఆపరేటింగ్ సంస్థల్లో 1,40,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
  • 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆతిథ్య రంగంలో దాదాపు 63 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.

హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్
హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ అనుబంధ విభాగాల్లో శిక్షణ పరంగా బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌గా నిలుస్తున్న సంస్థలు..
  • ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్: వీటిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
    అర్హత: ఇంటర్మీడియెట్.
    వెబ్‌సైట్:  www.nchm.nic.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్: దేశవ్యాప్తంగా ఐదు క్యాంపస్ (నోయిడా, భువనేశ్వర్, గ్వాలియర్, గోవా, నెల్లూరు)లలో టూరిజం అండ్ ట్రావెల్ స్పెషలైజేషన్లతో ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.
    అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్/ మ్యాట్ / జీమ్యాట్ / సీమ్యాట్/ ఏటీఎంఏ/ ఎక్స్‌ఏటీలలో స్కోర్. లేదా ఐఐటీటీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్:  www.iittm.net
  • డాక్టర్ వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎం: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది.
    వెబ్‌సైట్:  www.nithm.ac.in
ఎమర్జింగ్ సెగ్మెంట్
ప్రస్తుతం సర్వీస్ సెక్టార్‌లోని ఇతర పరిశ్రమలతో పోల్చితే ఆతిథ్య రంగం ఎమర్జింగ్ సెక్టార్‌గా నిలుస్తోంది. ఏటా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటం, దేశీయంగానూ పర్యాటకం, విహారయాత్రల పట్ల ప్రజల్లో మక్కువ పెరగడం వంటి కారణాలు ఈ రంగ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నాయి. ఆతిథ్య రంగంలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. చక్కని వ్యవహార శైలి, ఎదుటి వారిని మెప్పించే తీరు, కొన్ని సందర్భాల్లో టైమ్ లైన్‌తో సంబంధం లేకుండా పనిచేయగల ఓర్పు ఉంటే ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌ల్లో ఇదే తరహా వ్యవహార శైలితో ఆయా ఉద్యోగాల్లో రాణించవచ్చు. ఇందులో భాగంగా విద్యార్థులు ముందుగా ఆయా విభాగాల్లో పనితీరుపై అవగాహన ఏర్పరచుకొని తమకు సరితూగే స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ప్రొఫెసర్ సంజయ్ కుమార్‌ఠాకూర్, ప్రిన్సిపాల్, ఐహెచ్‌ఎం- హైదరాబాద్

ఉత్సాహవంతులకు సరైన కెరీర్ ఆతిథ్యం...
హాస్పిటాలిటీ రంగంలో సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఐహెచ్‌ఎంలు, ఐఐటీటీఎంలు, డాక్టర్ వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎంలను ఏర్పాటు చేసి ఆతిథ్య రంగ ఔత్సాహికులకు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఉత్సాహవంతమైన, చురుకైన అభ్యర్థులకు ఆతిథ్య రంగం సరైన కెరీర్ ఎంపిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- కె. వాసుదేవన్, హెచ్‌ఓడీ (హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) డాక్టర్. వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎం
Published date : 31 Mar 2016 05:43PM

Photo Stories