Skip to main content

Actuarial Science: ఆకర్షణీయ కెరీర్‌.. యాక్చూరియల్‌ సైన్స్‌

Actuarial Science
Actuarial Science

గణిత, గణాంక పద్ధతులను ఉపయోగించి.. బీమా, అనుబంధ రంగాల్లో ఆర్థిక పరిణామాలను ముందుగానే అంచనావేసే విభాగమే.. యాక్చూరియల్‌ సైన్స్‌. యాక్చూరియల్‌ సైన్స్‌ నిపుణులకు బీమా రంగంలో మంచి డిమాండ్‌ ఉంది. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌పై ఆసక్తి ఉండి.. బీమా, అనుబంధ రంగాల్లో అవకాశాలు కోరుకునే విద్యార్థులు యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరొచ్చు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా
(ఐఏఐ) అందించే యాక్చూరియల్‌ కోర్సుకు మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏసెట్‌) లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది. ఇటీవల ఏసెట్‌ 2021 డిసెంబర్‌ ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో.. యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులతో ప్రయోజనాలు, అర్హతలు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం...

దేశంలో యాక్చూరియల్‌ సైన్స్‌కు సంబంధించి నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐఏఐ)ను ఏర్పాటు చేశారు. 2006లో పార్లమెంట్‌ చట్టం ద్వారా ఈ సంస్థ ఏర్పాటైంది. ఇది ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఐఏఐ యాక్చూరియల్‌ సైన్స్‌లో ప్రవేశాల కోసం యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏసెట్‌) పేరుతో ఏటా రెండుసార్లు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఇందులో అర్హత సాధించిన వారికి యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుంది. 

అర్హతలు

ఏసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియల్‌ లేదా తత్సమాన(10+2)విద్యను పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • యాక్చూరీ విభాగం పూర్తిగా గణాంకాలు, ఆర్థిక విశ్లేషణలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియెట్‌/10+2లో కామర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులు చదివిన వారికి ఇది కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. 

పరీక్ష విధానం

  • ఏసెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో హోమ్‌ బేస్డ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్దేశించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి.
  • మొత్తం 70 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. నెగిటివ్‌ మార్కులు లేవు. 
  • మొత్తం 70 ప్రశ్నల్లో.. 45 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 20 ప్రశ్నలకు 2 మార్కుల చొప్పున, 5 ప్రశ్నలకు 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు.
  • ఏసెట్‌ పరీక్షలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టుల వారీగా మార్కుల వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది. మ్యాథమెటిక్స్‌–30మార్కులు, స్టాటిస్టిక్స్‌–30మార్కులు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌–15మార్కులు, ఇంగ్లిష్‌–15 మార్కులు, లాజికల్‌ రీజనింగ్‌ల నుంచి 10మార్కుల చొప్పున ఉంటాయి.

అర్హత మార్కులు

ఏసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే..100 మార్కులకు గాను కనీసం 50 మార్కులు సాధించాలి. సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తేనే కనీస మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఏసెట్‌ ఉత్తీర్ణత తర్వాత

  • ఏసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు.. ఐఏఐ నాలుగు దశ (స్టేజ్‌ 1, స్టేజ్‌ 2, స్టేజ్‌ 3, స్టేజ్‌ 4)ల్లో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హత లభిస్తుంది.

నాలుగు దశలు

  • స్టేజ్‌–1: కోర్‌ ప్రిన్సిపుల్స్‌: యాక్చూరియల్‌ స్టాటిస్టిక్స్, యాక్చూరియల్‌ మ్యాథమెటిక్స్, యాక్చూరియల్‌ బిజినెస్‌ విభాగాల నుంచి ఏడు పేపర్లుంటాయి. 
  • స్టేజ్‌–2: కోర్‌ ప్రాక్టిసెస్‌: ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. 
  • స్టేజ్‌–3: స్పెషలిస్ట్‌ ప్రిన్సిపుల్స్‌: ఈ దశలో ఎనిమిది పేపర్లుంటాయి. ఈ ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండింటిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. 
  • స్టేజ్‌–4: స్పెషలిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌: యాక్చూరియల్‌ సైన్స్‌కు సంబంధించి ఐఏఐ నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఐదు పేపర్లుంటాయి. అభ్యర్థులు ఏదో ఒక పేపర్‌ను ఎంపిక చేసుకొని.. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఐఏఐ యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సు పూర్తిచేసినట్లే!

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి: 26.10.2021
పరీక్ష తేదీ: 11.12.2021
వెబ్‌సైట్‌: http://www.actuariesindia.org/


ఐఏఐ కోర్సు స్వరూపం

యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సుకు సంబంధించి ఐఏఐ నాలుగు స్థాయిలో పరీక్షలు నిర్వహించి.. సదరు స్థాయికి అనుగుణంగా మెంబర్‌షిప్‌ హోదాలను కల్పిస్తోంది. 

స్టూడెంట్‌ మెంబర్‌షిప్‌

ఐఏఐ అందించే మూడు స్థాయిల మెంబర్‌షిప్‌ హోదాల్లో.. మొదట స్టూడెంట్‌ మెంబర్‌గా గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అందుకోసం సంస్థ యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏసెట్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. 

అసోసియేట్‌ మెంబర్‌

ఏసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి స్టూడెంట్‌ మెంబర్‌ హోదాతో.. ఆ తర్వాత నిర్వహించే నాలుగు దశల్లో మొదటి రెండు దశ పరీక్ష(స్టేజ్‌1, స్టేజ్‌2)ల్లో ప్రతిభ చూపితే.. అసోసియేట్‌ మెంబర్‌ హోదా లభిస్తుంది.

ఫెలో మెంబర్‌

ఏసెట్‌ ఉత్తీర్ణత తర్వాత మొత్తం నాలుగు దశలు(స్టేజ్‌1,2,3,4) పూర్తిచేసుకొని.. మూడేళ్ల పని అనుభవం సాధిస్తే.. ఫెలో మెంబర్‌ హోదా దక్కుతుంది. 

కెరీర్‌

  • ప్రస్తుతం సమాజంలో బీమా పట్ల ఆసక్తి పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా.. ఇలా ప్రతిరంగానికి సంబంధించి బీమా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌కు తగినట్లు బీమా కంపెనీలు కొత్త కొత్త పాలసీలు ప్రవేశపెడుతున్నాయి. పాలసీని ప్రవేశ పెట్టేముందే వయసుకు అనుగుణంగా బీమా ప్రీమియం, ప్రీమియం కాలం, చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచార గణనపై పనిచేసే వారే యాక్చూరియల్‌ స్పెషలిస్ట్‌లు. యాక్చురియల్‌ నైపుణ్యాలు ఉన్న వారికి దేశ విదేశాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. 
  • యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులను పూర్తిచేసిన వారికి యాక్చూరియల్‌ అనలిస్ట్, రిస్క్‌ అనలిస్ట్‌ ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకులు, బీమా సంస్థలు, బిజినెస్‌ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లో సైతం వీరు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అలాగే లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ, కన్సల్టింగ్‌ సంస్థల్లోనూ కొలువులు లభిస్తాయి. ఇవేకాకుండా అకౌంటింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్, క్రెడిట్‌ రిస్క్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, స్టాక్‌ మార్కెట్లు వంటి వాటిల్లోనూ పనిచేయెచ్చు. 
  • యాక్చూరీలుగా పనిచేసే వారికి సగటున రూ.10 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. పనిచేసే సంస్థ, అనుభవాన్ని బట్టి ఇంకా అధిక వేతనాలు సైతం పొందవచ్చు.
Published date : 20 Sep 2021 05:10PM

Photo Stories