Skip to main content

Inspire Success Story : మ‌న‌దేశంలో ఎవ‌రు లేరు... ఈ వ‌య‌స్సులో ఈ ఫెలోషిప్‌ సాధించిన వారు..

ఇప్పుడు దేశం మొత్తం కేరళలోని ఆ అమ్మాయిని చూసి గర్విస్తోంది. 14 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక ‘ట్రినిటీ కాలేజ్‌ లండన్‌’ వారి ఫెలోషిప్‌కు ఎంపికై రికార్డు సృష్టించింది మార్టినా.
Inspiring Youth, Kerala Teen Makes History, Martina's Trinity College Success, Martina youngest Indian violinist news in telugu,  Martina's Trinity College Fellowship at 14,

ఈ వయసులో ఈ ఫెలోషిప్‌ సాధించిన వారు దేశంలో లేరు. ఏ వయసు వారైనా కేరళలో లేరు. సంగీతంతో ఆరోహణ దిశలో పయనిస్తోంది మార్టినా. ఆ అమ్మాయి వయొలిన్‌ సాధన చేస్తుంటే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. 

ఇలాంటి త్యాగమే..
సుప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు రాసిన ‘వాయులీనం’ కథలో భార్య తీవ్రంగా జబ్బు పడితే ఆమెను కాపాడుకోవడానికి భర్త ఆమె ఎన్నాళ్లుగానో కాపాడుకుంటూ వస్తున్న వయొలిన్‌ని అమ్మేస్తాడు. ఆమె బతుకుతుంది. అమ్మకానికి వెళ్లిపోయిన వయొలిన్‌ని తలుచుకుని, మిగిలిన డబ్బుతో భర్త కొన్న చీరను చూస్తూ ‘పోనీలేండి జ్ఞాపకంగా పడి ఉంటుంది’ అంటుంది వేదనగా. జీవితంలో కళాసాధన, కళాసాధనకు ఎదురు నిలిచే జీవితం గురించి చెప్పిన కథ ఇది. మార్టినా జీవితంలో తండ్రి కూడా ఇలాంటి త్యాగమే చేశాడు. 

నా ప్రయాణం ఇలా..
14 ఏళ్ల మార్టినా ఇప్పుడు వయొలిన్‌లో గొప్ప పేరు సంపాదించి ‘ట్రినిటీ కాలేజ్‌ లండన్‌’ ఫెలోషిప్‌ పోందిందిగాని ఇక్కడి వరకూ చేరడానికి ఆమె తండ్రి పడిన కష్టం ఉంది. మార్టినాది కన్నూరు జిల్లాలోని పెరవూర్‌. తండ్రి చార్లెస్‌కు బాల్యంలో గొప్ప మ్యుజీషియన్‌ కావాలని ఉండేది కాని ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొద్దోగొప్పో నేర్చుకున్న కీబోర్డుతో చర్చ్‌లో సంగీతం వాయించేవాడు. ఆ డబ్బు సరిపోక మిగిలిన సమయాల్లో ఆటో నడిపేవాడు. భార్య షైనీ గృహిణిగా ఉన్నంతలో సంసారాన్ని లాక్కువచ్చేది.

ఇక్కడ మొదలైంది సమస్య..

Martina youngest Indian violinist family

అయితే ఐదారేళ్ల వయసు నుంచే కూతురు మార్టినా సంగీతంలో విశేష ప్రతిభ చూపడం వారికి ఒకవైపు ఆనందం, మరొక వైపు ఆందోళన కలిగించాయి. ఆనందం కూతురికి సంగీతం వచ్చినందుకు, ఆందోళన అందుకు తగ్గట్టుగా నేర్పేందుకు వనరులు లేనందుకు. ఎనిమిదవ తరగతి వరకూ పెరవూర్‌లోనే చదువుకున్న మార్టినా అక్కడే ఉన్న ‘రాగం స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’లో వయొలిన్‌ నేర్చుకుంది. కానీ తర్వాతి స్థాయి వయొలిన్‌ నేర్చుకోవాలంటే త్రిశూర్‌లో చేరాలి. అంటే కుటుంబం మొత్తం త్రిశూర్‌కు మారాలి. అక్కడ మొదలైంది సమస్య.

నా తండ్రి ఆటో అమ్మిన డబ్బుతో..
ఉంటున్న పెరవూర్‌ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిశూర్‌కు కాపురం మారాలంటే చాలా ఖర్చు. సాధనకు వీలైన ఇల్లు తీసుకోవాలి. ముఖ్యంగా కనీసం లక్ష రూపాయల విలువైన కొత్త వయొలిన్‌ కొనాలి. ఇవన్నీ ఆలోచించి తండ్రి ఆటో అమ్మేశాడు. అంతేకాదు తమ చిన్నపాటి ఇంటిని కూడా అమ్మేద్దామనుకున్నాడు. కాని బంధువులకు సంగతి తెలిసి వారు తలా ఒక చేయి వేశారు. 2019లో త్రిశూర్‌కు షిఫ్ట్‌ అయినప్పటి నుంచి మార్టినా సాధన పెంచింది. ఉదయం ఐదు గంటలకు లేచి స్కూల్‌ సమయం అయ్యే వరకు సాధన చేసేది. అయితే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. దాంతో మరో ఇంట్లోకి మారాల్సి వచ్చింది. ఏమైనా సరే కూతురిని గొప్ప వయొలినిస్ట్‌ చేయాలని చార్లెస్‌ సంకల్పం బూనాడు.

ఇప్పుడు ఈమె విజేత..

martina violin from kerala news telugu

త్రిశూర్‌లో, కొచ్చిలో గొప్ప గొప్ప గురువుల దగ్గర సాధన చేసి వయొలిన్‌ నేర్చుకుంది మార్టినా. తీగలను మీటి మీటి ఆమె చేతి వేలికొసలు రక్తాన్ని చిమ్మేవి. మెడ మీద వయొలిన్‌ ఉంచి ఉంచి కదుములు కట్టేవి. అయినా సరే మార్టినా తన సాధన మానలేదు. ఫలితం? ఆల్‌ ఇండియా వయొలిన్‌ కాంటెస్ట్‌ 2022, 2023... రెండు సంవత్సరాలూ ఆమే విజేతగా నిలిచింది. 100 మంది వయొలినిస్ట్‌లను ఓడించి మరీ! ఆ తర్వాత ‘సౌత్‌ ఏసియన్‌ సింఫనీ’లో సభ్యురాలు కాగలిగింది. ఈ సింఫనీ కోసం 11 దేశాల వయొలినిస్ట్‌లు పోటీ పడుతుంటారు. చివరగా ప్రతిష్ఠాత్మక ట్రినిటీ కాలేజ్‌ లండన్‌ ఫెలోషిప్‌ పోందింది. 14 ఏళ్ల వయసులో ఈ ఫెలోషిప్‌ను పోందిన వారు లేదు. చార్లెస్, షైనీల ఆనందానికి అవధులు లేవు. ఈ గొప్ప కళాకారిణి సంగీతానికి కొత్త శోభను తేవాలని కోరుకుందాం.

Published date : 18 Nov 2023 01:27PM

Photo Stories