Law Course Admissions: లా కోర్సుల్లో ప్రవేశాలు.. ఆన్‌లైన్ కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: లా కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. లాసెట్, పీజీ లాసెట్‌లో అర్హత పొంది రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు నవంబర్ 25, 26, 27వ తేదీల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఏపీ లా–సెట్, పీజీ లా–సెట్ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసిన షెడ్యూల్లో భాగంగా (నవంబర్ 20) సోమవారం ముగిసిన రిజిస్ట్రేషన్ గడువును నవంబర్ 22వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయించుకోని విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ సమయంలో ఆన్‌లైన్‌లో విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నవంబర్ 24 వరకు కొనసాగనుంది. లాసెట్, పీజీ లాసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన, కళాశాలల ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. కాగా ప్రత్యేక కేటగిరీకి చెందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్ల పరిశీలన కోసం (నవంబర్ 21) మంగళవారం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో హాజరు కావాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మరోసారి ఆప్షన్లను మార్చుకునేందుకు నవంబర్ 28న ఒక్క రోజు అవకాశాన్ని కల్పించిన ఉన్నత విద్యామండలి నవంబర్ 30న సీట్ల కేటాయింపు జరపనుంది. సీట్లు పొందిన విద్యార్థులు డిసెంబర్ ఒకటి, రెండవ తేదీల్లో సంబంధిత కళాశాలలకు వెళ్లి చేరాల్సి ఉంది. ఎల్‌ఎల్‌బీ, బీఎల్ అర్హతతో రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం, ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్లు, డిగ్రీ అర్హతతో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ విధంగా న్యాయవిద్యలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపడుతున్న ఉన్నత విద్యామండలి విద్యార్థులు భౌతికంగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసింది.
చదవండి: Postal Jobs: 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం విధానం ఇదే
ప్రతి ఏటా పూర్తిస్థాయిలో సీట్ల భర్తీ..
కాగా ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతో పాటు ప్రైవేటు రంగంలో విజ్ఞాన్, కేఎల్ యూనివర్సిటీలతో పాటు గుంటూరు నగర పరిధిలో జేసీ లా కళాశాల, ఏసీ లా కళాశాలలు ఉన్నాయి. లా కోర్సులపై పెరిగిన అవగాహన, న్యాయ నిపుణులకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ప్రతి యేటా సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అవుతున్నాయి. కాగా లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశాలకు సంబంధించిన కళాశాలల జాబితాను ఉన్నత విద్యామండలి ఈనెల 25న అధికారిక సైట్‌లో ఉంచనుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆయా కళాశాలల్లో సీట్ల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది.
లాసెట్, పీజీ లాసెట్ రిజిస్ట్రేషన్ల గడువు నవంబర్ 22 వరకు పొడిగింపు ప్రవేశాల ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే.. 24 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన 25, 26, 27 తేదీల్లో కళాశాలల ఎంపికకై ఆప్షన్లు నమోదు 30న సీట్ల కేటాయింపు, డిసెంబర్ 1, 2 తేదీల్లో కళాశాలల్లో చేరికలు
Tags
- admissions
- Law Courses
- law course admissions
- Online Counselling
- LAWCET
- PG LAWCET
- Common Entrance Test
- Online web options
- State Board of Higher Education
- Students
- Education News
- andhra pradesh news
- Online Registration
- law set
- web options
- Qualified Students
- online admissions
- sakshi education latest admissions