Skip to main content

సివిల్‌ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ప్రవీణ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 Free training for civil services
Free training for civil services

విద్యార్థుల తండ్రి వార్షికాదాయం రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులన్నారు. ఎంపిక విధానంలో రిజర్వేషన్‌ నియమం అమలవుతుందన్నారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ వచ్చేనెల 23న నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 040– 23236112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

బీజేపీతోనే అభివృద్ధి

పార్టీ రాష్ట్ర మీడియా కన్వీనర్‌

సుధాకర్‌ శర్మ

తుక్కుగూడ: దేశంలో, రాష్ట్రంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర మీడియా కన్వీనర్‌ సుధాకర్‌ శర్మ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని మంఖాల్‌లో ఆ పార్టీ చేపట్టిన మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ యాత్ర ద్వారా గడపగడపకూ బీజేపీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. పార్టీ శ్రేణులు ఇంటింటా తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆ పార్టీ కౌన్సిలర్‌ బాకి విలాస్‌, నాయకులు రాచూరి మదన్మోహన్‌ గుప్తా, నాయకులు కోటకాడి శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ నాయక్‌, నర్సింహ, నాగార్జున, బూడిద అన్వేష్‌, రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.

అమరుల త్యాగ ఫలమే తెలంగాణ

అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: అమరవీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ అని అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను సన్మానించారు. అనంతరం అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్‌, తిరుపతిరావు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించామన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి అధికారులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఆధార్‌ సేవలను

వినియోగించుకోండి

తపాలశాఖ సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ జుబేర్‌

షాద్‌నగర్‌రూరల్‌: తపాలశాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తపాలశాఖ సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ జుబేర్‌ అన్నారు. పట్టణంలోని తపాలశాఖ కార్యాలయంలో కొనసాగుతున్న ఆధార్‌ సేవలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకునేవారు తపాలశాఖ కార్యాలయంలో కొనసాగుతున్న ఆధార్‌ కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ప్రతిరోజు 50 నుంచి 60 మంది ఆధార్‌ సేవలను వినయోగించుకొని అప్‌డేట్‌ చేసుకుంటున్నారని అన్నారు. తపాలశాఖ కార్యాలయంలో 1000 మందికి పైగా ఆధార్‌ సేవలను వినియోగించుకున్నారని వివరించారు.

Published date : 23 Jun 2023 06:49PM

Photo Stories