Skip to main content

ఆర్థికాభివృద్ధి

సుస్థిర, విధాన నిర్ణయాల ఫలితంగా సాధించే ఆర్థికాభివృద్ధి ఒక ప్రత్యేక ప్రదేశంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుంది. దీంతో పాటు ఆరోగ్యవంతమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పిస్తుంది. ఆర్థికాభివృద్ధిని ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మక, గుణాత్మక మార్పుగా పేర్కొనవచ్చు. మానవ మూలధనం, మౌలిక సౌకర్యాలు, ప్రాంతీయ పోటీ తత్వం, భద్రత, అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు లాంటి బహుళ అంశాల్లో అభివృద్ధి సాధించడం ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఉంటుంది.
ఆర్థికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలున్నాయి. ఆర్థిక, సాంఘిక శ్రేయస్సులో భాగంగా ఆర్థికాభివృద్ధి మొదటి దశలో ప్రభుత్వ జోక్యం అవసరమవుతుంది. ఆర్థిక వృద్ధి ప్రక్రియ అనేది మార్కెట్ ఉత్పాదకత, స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు సంబంధించింది. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ఆర్థికవృద్ధిని ఒక అంశంగా వర్ణించారు.

ఆర్థికాభివృద్ధి విధానాలు
  1. ధరల స్థిరత్వం, అధిక ఉద్యోగిత, సుస్థిర వృద్ధి సాధన మొదలైనవి ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాల్లో భాగంగా ఉంటాయి. వీటి సాధనలో ద్రవ్య విధానం, కోశ విధానం, విత్త సంస్థల నియంత్రణ, వాణిజ్యం, పన్నుల విధానం ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  2. వస్థాపనా సౌకర్యాలైన హైవేస్, పార్కులు, గృహ వసతి, విద్య తదితర సదుపాయాల కల్పనతో పాటు నేరాలను నిర్మూలించడానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం కూడా ఆర్థికాభివృద్ధి విధానాల్లో భాగం.
  3. ఉపాధి కల్పన, శ్రామిక శక్తి అభివృద్ధి, చిన్న వ్యాపారాల అభివృద్ధి, వ్యాపార విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసుకోవడం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం అవలంబించే విధానాలు ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి.
అంతర్జాతీయ వాణిజ్యం, వినిమయ రేటు అనేవి ఆర్థికాభివృద్ధిలో ప్రధానమైన అంశాలు. కరెన్సీ విలువలు తరచుగా ఒడుదొడుకులకు గురవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు వాణిజ్య మిగులు లేదా లోటును ఎదుర్కొంటున్నాయి. ఈ స్థితి ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక కోణంలో చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిర్దిష్ట ప్రదేశానికి ప్రాధాన్యం ఉంది. ఒక దేశం లేదా అందులోని ప్రత్యేక ప్రదేశం కాంపిటీటివ్ అడ్వాంటేజ్‌కు ఒక ముఖ్య సాధనంగా నిలిచిన పరిస్థితులు ఉండటమే దీనికి కారణం. మూడో ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధి ప్రక్రియ వేగవంతంపై దృష్టి సారించాయి.
 ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి అధిక రేటులో పెరిగినప్పటికీ అంటే అధిక ఆర్థికవృద్ధి సాధించినప్పటికీ దాని ఫలితాలు దేశంలో తక్కువ మందికి మాత్రమే అందవచ్చు. ఫలితంగా మిగిలిన ప్రజలు పేదరికంలో ఉంటారు. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల వల్ల ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యం కాకపోవచ్చు. కొన్ని దేశాల్లో గ్రామీణ - పట్టణ ప్రాంతాలు, వివిధ సామాజిక వర్గాల మధ్య అసమానతలు పెరగవచ్చు. దీంతో ప్రజల ఆదాయంలో వ్యత్యాసాలు అధికమవుతాయి. ఈ కారణంగా అన్ని వర్గాల వారి శ్రేయస్సు మెరుగుపడదు. ఈ విధమైన స్థితిని ఆర్థికాభివృద్ధిగా పరిగణించలేం. ఆదాయ అసమానతల నిర్మూలన; పేదరికం, నిరుద్యోగం తగ్గింపు; విద్య, ఆరోగ్య ప్రమాణాల మెరుగుదల; అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధితో పాటు అధిక పారిశ్రామికీకరణ లాంటి అంశాలను ఆర్థికాభివృద్ధిలో భాగంగా పరిగణనలోకి తీసుకుంటారు.
 ఆర్థిక వృద్ధి జాతీయోత్పత్తిలో పరిమాణాత్మక మార్పును మాత్రమే తెలుపుతుంది. ఆర్థిక వ్యవస్థలో జాతీయాదాయ పెరుగుదలతో పాటు సంస్థా పూర్వక, సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పును ఆర్థికాభివృద్ధి వెల్లడిస్తుంది.
నిర్దిష్ట ప్రాంతం లేదా ఒక దేశంలో సాపేక్ష ఆర్థిక పురోగతిని పరిశీలించడానికి ఆర్థికవేత్తలు అనేక స్థూల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సూచీలను ఉపయోగించారు. అవి:
 1. తలసరి స్థూల దేశీయోత్పత్తి
 2. ఆదాయ పంపిణీ
 3. అక్షరాస్యత, విద్య
 4. ఆరోగ్య సంరక్షణ అందుబాటు
 5. సామాజిక భద్రత, పింఛన్లు
 6. ఆధునిక రవాణా వ్యవస్థ

గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ (జీఎన్‌హెచ్‌ఐ)
 ఒక దేశ ప్రగతిని కొలవడానికి స్థూల దేశీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా ‘గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్’ను తీసుకోవచ్చు. దేశ పురోగతిని అంచనా వేయడంలో జీడీపీ లాంటి ఒకే కొలమానంపై ఆధారపడటానికి బదులుగా జీఎన్‌హెచ్‌ఐని పరిగణనలోకి తీసుకోవడం కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ప్రజల ఆధ్యాత్మిక, భౌతిక, సాంఘిక, పర్యావరణ అంశాలతో పాటు ఆరోగ్యం తదితరాలు ఇమిడి ఉంటాయి. జీఎన్‌హెచ్‌ఐ కొలమానంలో పర్యావరణం ఒక ముఖ్య కారకంగా ఉంటుంది. ‘గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్’ అనేది ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక ఉత్పత్తి విలువను మాత్రమే కాకుండా నికర పర్యావరణ ప్రభావం; పౌరుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రగతి; ప్రజల మానసిక, భౌతిక ఆరోగ్యం; కార్పొరెట్ల బలం; రాజకీయ వ్యవస్థ మొదలైనవాటి గురించి వెల్లడిస్తుంది. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఆధారంగా సుస్థిర అభివృద్ధిలో భాగంగా ప్రగతికి సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఆర్థికేతర అంశమైన శ్రేయస్సుకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ‘సెంటర్ ఫర్ భూటాన్ స్టడీస్’ అభిప్రాయపడింది.

 జీఎన్‌హెచ్‌ఐలో ఉండే ముఖ్యమైన అంశాలు (Domains):

 1. ఆరోగ్యం
 2. పర్యావరణ వైవిధ్యం, సామర్థ్యం
 3. మానసిక శ్రేయస్సు
 4. సామాజిక ప్రగతి
 5. జీవన ప్రమాణాలు
 6. కాలం వినియోగం
 7. సాంస్కృతిక వైవిధ్యం, సామర్థ్యం
 8. సుపరిపాలన
 9. విద్య
 1972లో జిగ్మే సింఘీ వాంగ్‌చుక్ జీఎన్‌హెచ్ సూచీని ప్రతిపాదించారు. భూటాన్ ప్రగతికి ప్రామాణికంగా స్థూల దేశీయోత్పత్తికి బదులు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ కొలమానాన్ని ఉపయోగించడం ప్రయోజనకరమని ఆయన సూచించారు. 33 సూచీలను 9 డొమైన్ల కింద విభజించి ఈ సూచీని రూపొందించారు. ఈ ఇండెక్స్‌ను రూపొందించడంలో ఆల్కైరా-ఫోస్టర్ పద్ధతిని వినియోగించారు. అన్ని డొమైన్లకు ఒకేవిధమైన వెయిటేజీ ఇచ్చారు. ప్రతి డొమైన్‌లోనూ లక్షిత సూచీలకు అధిక వెయిటేజీ, సెల్ఫ్ రిపోర్టెడ్ సూచీలకు తక్కువ వెయిటేజీ ఇచ్చారు.
జీఎన్‌హెచ్‌ఐ ప్రధానంగా నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:
1. సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం.
2. సాంస్కృతిక విలువలను కాపాడుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం.
3. సహజ పర్యావరణాన్ని పరిరక్షించడం.
4. సుపరిపాలన స్థాపన
‘సెంటర్ ఫర్ భూటాన్ స్టడీస్’ సర్వేకు అవసరమైన ప్రశ్నావళిని మెరుగుపరుచుకొని గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సర్వేను మొదటిసారిగా 2007 డిసెంబర్‌లో నిర్వహించింది. సర్వే బడ్జెట్‌లో వ్యయ పరిమితి దృష్ట్యా 12 జిల్లాల్లో మాత్రమే ఈ సర్వే నిర్వహించారు. ఇందులో శాంపుల్ పరిమాణాన్ని 950కి పరిమితం చేశారు. రెండో సర్వే ఏప్రిల్ 2010లో ప్రారంభమై డిసెంబర్ 2010లో ముగిసింది. అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించడం ద్వారా ఇందులో 7142 శాంపుల్స్ తీసుకున్నారు.
ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు
1951లో భారత్‌లో 72 శాతం శ్రామిక శక్తివ్యవసాయంపై ఆధారపడగా, ప్రస్తుతం ఈ మొత్తం 49 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పారిశ్రామిక, సేవా రంగాలపై ఆధారపడే శ్రామిక శక్తి పెరిగింది. ఇప్పటికీ
ఆర్థికాభివృద్ధి కేవలం ఆర్థిక పరమైన అంశాల వల్ల మాత్రమే కాకుండా సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ అంశాల వల్ల కూడా ప్రభావితమవుతుంది. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రజల సంప్రదాయ విలువలు, మత ఆచారాలు, సాంఘిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి సహకరించేలా లేవు. ఉత్పత్తి కారకాల మధ్య గమనశీలత, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల మూలధనాన్ని వినియోగించుకునే శక్తి పరిమితం. స్వాతంత్య్రం వచ్చాక మొదటి మూడు దశాబ్దాల్లో భారతదేశ తలసరి ఆదాయం సగటు వార్షిక వృద్ధి ఒక శాతం మాత్రమే. 1980వ దశకం మధ్య భాగంలో ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల నెమ్మదిగా మార్కెట్లపై ఆంక్షలు తొలగాయి. 1991 తర్వాత సంస్కరణలు వేగవంతం కావడంతో భారత్ స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థగా రూపొందింది.
భారత్‌లో ఆర్థికాభివృద్ధి ప్రక్రియ
ఆర్థిక సంస్కరణలు వేగవంతం కావడంతో భారత జీడీపీ గణనీయంగా పెరిగింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2015లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 2.3 ట్రిలియన్ డాలర్లు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ జీడీపీ 7.5 శాతం వృద్ధి చెందగా, చైనా వృద్ధి 7 శాతం మాత్రమే. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2013-14లో జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందగా, 2014-15లో 7.3 శాతం వృద్ధి చెందింది. 2014-15లో భారత్‌లో సేవారంగం 10.1 శాతం, తయారీ రంగం 7.1 శాతం, వ్యవసాయ రంగం 0.2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. సంస్కరణల అనంతర కాలంలో పేదరిక రేటు అంతగా తగ్గలేదు. సామాజికాభివృద్ధికి సంబంధించి ఆర్థికేతర కోణాల్లోనూ అంతగా ప్రగతి లేదు. పౌష్టికాహార లోపం ఉన్న అయిదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. ‘2015ఫోర్‌‌బ్స గ్లోబల్ 2000’ కంపెనీల జాబితాలో 56 భారతీయ సంస్థలు స్థానం సంపాదించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ లాంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్-2015’లో భారత్ 142వ స్థానంలో ఉండటం కొంత ఆందోళన కలిగించే పరిణామం. ఈ సూచీలో చైనా 90, రష్యా 62, బ్రెజిల్ 120వ స్థానాలను దక్కించుకున్నాయి. ‘ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడమ్-2015’లో భారత్ 128వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో హాంకాంగ్,సింగపూర్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, చైనా 139, రష్యా 143వ స్థానాల్లో ఉన్నాయి.
ఆర్థికపరమైన, ఆర్థికేతర అంశాలు ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తాయి.
ఆర్థికపరమైన అంశాలు
1) మూలధన కల్పన
2) సహజ వనరులు
3) వ్యవసాయ రంగంలో విక్రయం కాగల మిగులు
4) విదేశీ వాణిజ్యం
5) మూలధన - ఉత్పత్తి నిష్పత్తి
ఆర్థికేతర అంశాలు
1) మానవ వనరులు
2) సాంకేతిక విజ్ఞానం, సాధారణ విద్య
3) రాజకీయ స్వేచ్ఛ
4) అవినీతి
5) అభివృద్ధి సాధించాలనే కోరిక
మూలధన కల్పన
ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో మూలధన కల్పన ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉత్పత్తికి అవసరమైన భౌతిక పునరుత్పాదక కారకాల రాశే మూలధనం. ఉత్పత్తి కోసం యంత్రాలు, పరికరాలను అధిక మొత్తంలో వినియోగించుకోవాలంటే మూలధన కల్పన రేటును పెంచాలి. అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యంగా జపాన్ త్వరితగతిన ఆర్థిక వృద్ధి సాధించడానికి అధిక మూలధన కల్పన రేటే కారణం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కల్పన రేటు తక్కువ. నిర్బంధ డిపాజిట్ పథకాలు, అంతగా అవసరం లేని(conspicuous) వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, పెద్ద మొత్తంలో ఎఫ్‌డీఐలను ఆకర్షించటం, డబ్ల్యూటీవో నియమావళికి లోబడి వినియోగ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు స్థూల దేశీయ పొదుపు రేటు పెంచుకోవాలి. తద్వారా అధిక మూలధన కల్పన సాధ్యమవుతుంది.
మూలధన - ఉత్పత్తి నిష్పత్తి
ఆర్థికాభివృద్ధి సాధనకు మూలధన-ఉత్పత్తి నిష్పత్తిని ఒక ముఖ్య కారకంగా పేర్కొనవచ్చు. ప్రతి యూనిట్ ఉత్పత్తికి అవసరమైన మూలధన యూనిట్ల సంఖ్యను మూలధన-ఉత్పత్తి నిష్పత్తి తెలుపుతుంది. ఇది నిర్ణీత కాలంలో వివిధ రంగాల్లో మూలధన ఉత్పాదకతను తెలుపుతుంది. మూలధన-ఉత్పత్తి నిష్పత్తి ఆర్థికాభివృద్ధి దశపై ఆధారపడి ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో జాతీయాదాయ వృద్ధి రేటును మూలధన-ఉత్పత్తి నిష్పత్తి, జాతీయ పొదుపు నిష్పత్తి తెలుపుతాయి.
స్థూల జాతీయోత్పత్తి వృద్ధి
స్థూల జాతీయోత్పత్తి వృద్ధి సమీకరణం హారడ్-డోమర్ నమూనాకు చెందింది. ఈ సమీకరణం ప్రకారం జీఎన్‌పీ వృద్ధి.. పొదుపు నిష్పత్తికి అనులోమానుపాతంలో, మూలధన-ఉత్పత్తి నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది. జాతీయాదాయంలో అధిక వృద్ధిరేటు సాధనకు ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి రేటు పెంచాలి, మూలధన-ఉత్పత్తి నిష్పత్తిని తగ్గించుకోవాలి.
సహజ వనరుల వినియోగం
సహజ వనరుల లభ్యత, అభిలషణీయ వినియోగం ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. సహజ వనరుల కొరత లేకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దేశాలు వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తాయి. సహజ వనరుల అభిలషణీయ వినియోగంలేని దేశాల్లో ఆర్థికాభివృద్ధి సాధ్యపడదు. సహజ వనరుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ, ఆయా వనరుల అల్పవినియోగం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆర్థికాభివృద్ధి ప్రక్రియ వేగవంతం కాలేదు. భూమి కొరత ఉన్నప్పటికీ బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించుకున్నాయి. సహజ వనరుల లభ్యత తక్కువగా ఉన్నా జపాన్‌లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందింది. ఖనిజాలు, ముడి సరుకుల దిగుమతి ద్వారా బ్రిటన్ తన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచింది. ప్రొఫెసర్ లూయిస్ అభిప్రాయం ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వెనుకబడటానికి ఆయా దేశాల్లో సహజ వనరులను వినియోగించుకోలేకపోవడం, అల్ప వినియోగం, దుర్వినియోగమే కారణం. ఆర్థికంగా, సాంకేతిక విజ్ఞాన పరంగా ఆయా దేశాలు వెనుకబడి ఉన్నందువల్ల సహజ వనరులను అభిలషణీయంగా వినియోగించుకోలేకపోతున్నాయని లూయిస్ అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగంలో విక్రయమయ్యే మిగులు
వ్యవసాయ ఉత్పాదకతతోపాటు ఉత్పత్తి పెరుగుదల ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తుంది. వ్యవసాయ రంగంలో విక్రయమయ్యే మిగులు అధికంగా ఉండటం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. రైతు తన కుటుంబ అవసరాలకు పోనూ మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఉత్పత్తిని విక్రయం కాగల మిగులుగా భావిస్తాం. పట్టణీకరణ పెరుగుతోన్న నేపథ్యంలో ఆహార ధాన్యాల డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్‌కు సరిపడా ఆహార ధాన్యాలు లభించకపోతే ఆహార ధాన్యాల కొరత ఏర్పడి వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
విదేశీ వాణిజ్యంలోని స్థితిగతులు
విదేశీ వాణిజ్యంలో ప్రగతి ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి తులనాత్మక వ్యయ ప్రయోజనం కలిగి ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు తయారీ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి తులనాత్మక వ్యయ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ప్రాథమిక ఉత్పత్తుల విలువ తక్కువగా ఉండి తయారీ ఉత్పత్తుల విలువ ఎక్కువగా ఉండటం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు వర్తక నిబంధనల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
స్వాతంత్య్రానంతరం రెండేళ్లు మినహా భారత్ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రాథమిక ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ అధిక విలువ ఉన్న తయారీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాయి. తద్వారా ఆయా దేశాలు చెల్లింపుల శేషంలో లోటు ఎదుర్కొంటాయి. ఫలితంగా ఈ దేశాలు విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు అవలంభించే విధానాలు ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.
సాంకేతిక పరిజ్ఞానం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ముఖ్య కారకం. సాంకేతిక ప్రగతి ద్వారా ఆయా దేశాలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతాయి. సంస్థలు అంతర్గత, బహిర్గత ప్రయోజనాలు పొందుతాయి. నవకల్పనలకు అవకాశం ఏర్పడి పెద్ద ఎత్తున నవ కల్పనలను వినియోగించుకునే అవకాశాలు ఆర్థికాభివృద్ధి రేటును పెంపొందిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన కారణంగా మూలధన వస్తువుల ఉత్పాదకత పెరుగుతుంది. ప్రొఫెసర్ శామ్యూల్ సన్ అభిప్రాయంలో అధిక పెట్టుబడులు పెట్టే దేశం కంటే అధిక నవ కల్పనలు చేయగల దేశం త్వరితగతంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది. సాంకేతిక ప్రగతి మూలధన పొదుపు, శ్రామిక పొదుపు స్థిరంగా ఉంటుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక ప్రగతి ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలంటే ‘పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరగాలి. దేశ అవసరాలకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు అవలంభించినప్పుడు ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.
బహిర్గత అంశాలు
ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశ ఆర్థికాభివృద్ధిని బాహ్య అంశాలు ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురుధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, యూరో దేశాల సంక్షోభం, యువాన్ మూల్యహీనీకరణ ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. నిర్ణీత స్థాయిలో లభ్యమయ్యే విదేశీ వనరులు ఒక దేశ ఆర్థికాభివృద్ధి స్థాయిని నిర్ణయిస్తాయి.
వృత్తి నిర్మాణత
ఒక దేశంలోని శ్రామిక జనాభా వృత్తి నిర్మాణతను ఆర్థికాభివృద్ధి నిర్ణయించే ప్రధాన కారకంగా పేర్కొనవచ్చు. వ్యవసాయ రంగంపై అధిక శ్రామిక శక్తి ఆధారపడటం ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉంటుంది. వ్యవసాయంపై పెరుగుతున్న శ్రామిక జనాభా ఒత్తిడిని ద్వితీయ, తృతీయ రంగాలకు తరలించగలిగినప్పుడు ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.

మాదిరి ప్రశ్నలు

1. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 2015’లో భారతదేశ స్థానం?
ఎ) 135
బి) 142
సి) 145
డి) 157

Published date : 28 Sep 2015 05:32PM

Photo Stories