TS CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అద్భుత ప్రకటన.. భారీగా ఉద్యోగాల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు..?

60 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం..?
‘‘తెలంగాణలో ఎన్నో పనులు ప్రజలు అడగక ముందే చేసుకున్నాం. ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం. మార్చి 9వ తేదీన (బుధవారం) అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల కోసం అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం పది గంటలకు అందరూ టీవీలు పెట్టుకుని చూడండి. తెలంగాణ ప్రగతి కోసం చివరి ఊపిరి, రక్తం బొట్టు దాకా టీఆర్ఎస్ పని చేస్తుంది..’’ మార్చి 8వ తేదీన (మంగళవారం) వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామంటారా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ఎప్పుడో మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారా? ఎంత ఇస్తారు? అనే చర్చకు తెరతీసింది. రాజకీయ వర్గాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. అయితే 60 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది.
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు..!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను..
వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ల జారీపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయవచ్చనే చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఇచ్చిన హామీని సైతం ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. ఉపాధ్యాయ, పోలీసు కొలువులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2020 డిసెంబర్ 13న కేసీఆర్ ప్రకటన చేశారు.
ఏకకాలంలో నోటిఫికేషన్లు..?
ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించిన తర్వాత ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా అప్పట్లో ఆదేశించారు. అయితే పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత నియామకాల అంశం మరుగున పడిపోయింది. గతేడాది కరోనా రెండోవేవ్ రావడం, ఆ తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల పునర్విభజన చేపట్టాల్సి రావడంతో ఆ ప్రక్రియకు ఫుల్స్టాప్ పడింది. అయితే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం బదిలీల ప్రక్రియ సైతం ఇటీవల పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగినట్టయింది.
నిరుద్యోగులు ఉత్కంఠగా..
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటన కోసం నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, కేడర్ స్ట్రెంగ్త్ అవసరాలు, ఖాళీల భర్తీపై అధ్యయనానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గత జనవరి 16న కేసీఆర్ ప్రకటించడంతో నియామకాల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించడంతో పాటు ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో పని ఒత్తిడికి తగ్గట్టు కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం వంటి అంశాలపై అధ్యయనం జరపాలని అప్పట్లో కమిటీకి సూచించారు.
నిరుద్యోగ భృతి పథకాన్ని..
ఈ నేపథ్యంలో కొలువుల భర్తీపై ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించే పనిని ఈ కమిటీ ప్రారంభించింది. కానీ నిర్దిష్టమైన కాలవ్యవధి నిర్ణయించకపోవడం, విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాలయాపనకే ఈ కమిటీని వేశారనే విమర్శలు సైతం వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ముఖ్యమంత్రి నిరుద్యోగులు గురించి చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఈ కమిటీ ఆగమేఘాల మీద నివేదిక సమర్పించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా..నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర బడ్జెట్ 2022–23లో ఎలాంటి నిధులను ప్రతిపాదించకపోవడంతో దీనిపై సీఎం ప్రకటన ఉండే అవకాశాలు లేనట్టేనని సమాచారం
85 వేల ఖాళీల గుర్తింపు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 1.32 లక్షల పోస్టులను భర్తీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తెలంగాణ వచ్చాక తొలి నాలుగేళ్లలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, దాదాపుగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
1.91 లక్షల పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గతేడాది ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూ శాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది.
తొలి నోటిఫికేషన్‌ను..
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టింగ్‌లు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకుని తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫేజ్ 1లో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్యను ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని..
అయితే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ప్రణాళికలు కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలన తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది.
17 వేలు పోలీసు ఉద్యోగాలు..
పోలీసు ఉద్యోగాలు 17 వేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు టీఎస్పీఎస్ నుంచి గ్రూప్-2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయాని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
CM KCR: 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన..భర్తీ ప్రక్రియ ఎప్పుడంటే..?