Skip to main content

దేశంలో పేదరికం నిజంగానే తగ్గిందా!

గ్రూప్స్ సిలబస్‌లో ‘ఆర్థిక వ్యవస్థ- అభివృద్ధి’ పేపర్‌లో దారిద్య్రం, నిరుద్యోగం అంశాలకు ప్రాధాన్యం కల్పించారు. వీటి అభ్యాస ప్రక్రియలో మూలసూత్రాలు, అంచనా పద్ధతులు, దారిద్య్రం తీరుతెన్నులను గుర్తించి అవగాహన కోసం ఉపయోగపడే అన్నిరకాల కొలమానాలు, మాపసూచికలను సూత్రబద్ధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయేతర దారిద్య్రం లాంటి ధోరణులు ఉన్నాయి. ఆయా అంశాలు గ్రూప్స్‌కు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న అభ్యర్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు, హెచ్‌సీయూ ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు..
దారిద్య్రం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించాలి? అనే అంశాన్ని ముందుగా పరిశీలిద్దాం... ఒక మనిషి తన కనీస మౌలిక అవసరాలైన ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని, తాగడానికి సురక్షిత తాగు నీటినీ, ఉండటానికి ఓ గూడునీ పొందలేని దయనీయస్థితినే దారిద్య్రంగా నిర్వచించవచ్చు. మానవుడు జీవించటానికి అవసరమైన కూడు, గూడుతోపాటు కట్టుకోవడానికి దుస్తులు ముఖ్యమైన మౌలికావసరాలు. వీటితోపాటు అందుబాటులోని విద్య, వైద్య సౌకర్యాలు పొందడానికి కావల్సిన ఆదాయ సంపాదన లేకపోవడం నిరుద్యోగం అవుతుంది. దారిద్య్రాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, సంపూర్ణ దారిద్య్రం లేదా నిరపేక్ష పేదరికం. రెండోది, తులనాత్మక దారిద్య్రం లేదా సాపేక్షిక దారిద్య్రంగా చెప్పవచ్చు.

తిండి, దుస్తులు, గూడు అనే కనీస జీవనావసరాలను పొందలేనప్పుడు ఆ స్థితిని సంపూర్ణ దారిద్య్ర స్థితి అని వ్యవహరిస్తాం. కనీస భౌతిక జీవనావసరాన్ని ద్రవ్య రూపంలో లెక్కించి కనీస జీవన వినియోగ వ్యయాన్ని నిర్ధారిస్తారు. నిర్ధారించిన కనీస ఆదాయం లేదా వినియోగం కంటే తక్కువగా పొందుతున్న ప్రజలను నిరపేక్ష పేదలు అంటారు. అలాగే సాపేక్షిక పేదరికాన్ని లెక్కించడానికి ప్రజల ఆదాయ పంపిణీని తులనాత్మకంగా అంచనా వేసి ఎగువ 5 నుంచి 10 శాతం ప్రజల జీవన స్థాయితో పోల్చి చూసి దిగువ 5 నుంచి 10 శాతం ప్రజలను సాపేక్షిక పేదలుగా పరిగణిస్తారు. తక్కువ ఆదాయం గల ప్రజల జీవన ప్రమాణం అధికంగా ఉన్నప్పటికీ అధిక ఆదాయ ప్రజల జీవన ప్రమాణంతో పోల్చి వారిని సాపేక్షిక పేదలు అంటారు. భారతదేశంలో పేదరిక స్థితిగతులను బ్రిటిష్ పాలనలో వేరా అన్‌స్టే లాంటి ఆర్థిక వేత్తలు ప్రస్తావించారు. అయితే ఒక స్పష్టమైన జాతీయ దృక్పథం మాత్రం 1901లో దాదాభాయ్ నౌరోజీ రాసిన ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అనే గ్రంథంలో 1867-68 బేస్ ఇయర్‌గా నిర్ధారించిన ఆదాయ గణాంకాల ద్వారా పేదరికాన్ని నిర్వచించటంతో మొదలయింది. ఒక వ్యక్తి ఇబ్బందులు పడకుండా, సాధారణ జీవనం సాగించటానికి తప్పనిసరిగా అవసరమైన ఆహారం, వస్త్రాలు, నివాసం, దీపానికి కావాల్సిన నూనె, వంట సామాగ్రి అంతా వెరసి ఒక ‘తలసరి జీవిక’గా కనీస స్థాయిలో నౌరోజీ నిర్ధారించిన జీవన ప్రమాణం రూ.16-35గా అంచనా వేశారు. రూ.16 నుంచి రూ.35 ఒక విస్తృత పరిధి అయినా.. ఇది వివిధ ప్రాంతాల (ప్రావిన్సెస్) ప్రజల జీవన ప్రమాణాలను దృష్టిలోపెట్టుకొని నిర్ణయించారు. నౌరోజికి స్పష్టమైన ఆదాయ గణాంక వివరాలు అందుబాటులో లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నౌరోజీ అధ్యయనం భారత ఆర్థిక వ్యవస్థలో పేదరిక అంచనాల గమనంలో దారిద్య్ర రేఖ అనే పద్ధతిని ప్రవేశపెట్టడంలో ఒక మైలురాయి. జీవిక స్థాయిని కేవలం ఒక వ్యక్తి ఉపయోగంలో ఉండే ఖర్చుల ఆధారంగా నిర్ణయించి.. వినియోగదారుడి ఆదాయం, వ్యయం మొదలైనవి సూచించే గృహ గణాంకాలు అందుబాటులో లేని దశలో.. తలసరి ఉత్పత్తి దామాషాలో భారీ సాముదాయిక దారిద్య్రాన్ని లెక్కగట్టిన ఘనత దాదాభాయ్ నౌరోజీకి దక్కుతుంది.

పేదరికం ఏ మేరకు?
ప్రభుత్వ స్థాయిలో దారిద్య్రరేఖను నిర్వచించడానికి బ్రిటిషర్లు 1936లో శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టారు. 2400- 2800 కేలరీల పోషణ ఒక ప్రౌఢ శ్రామికుడి దినసరి అవసరంగా గుర్తించారు. దాంతోపాటే సాలీనా 30 గజాల వస్త్రం, 100 చదరపు అడుగుల నివాసం ఉండాలని, అవి లేనివారంతా దారిద్య్రరేఖకు దిగువ ఉన్నట్లుగా నిర్ధారణ చేశారు. బ్రిటిష్ పాలనలో మొదలై న దారిద్య్రరేఖ నిర్ధారణ విధానాన్నే స్వాతంత్య్రానంతర భారతదేశంలోనూ పేదరికాన్ని అంచనా వేసేందుకు కొనసాగించారు. 1960 దశకంలో ప్రభుత్వంపేదరిక నిర్మూలన లక్ష్యాల్ని వేగవంతం చేయడం; దాంతోపాటు ప్రణాళికా సంఘం రకరకాల పథకాలను చేపట్టడంతో ఆర్థిక వేత్తల అధ్యయనాలు కూడా ముమ్మరం అయ్యాయి. గ్రామీణ పేదరికం, పట్టణ పేదరికాలను వేర్వేరుగా అంచనా వేయాల్సిన ఆవశ్యకతను ఆర్థికవేత్తలు గుర్తించారు. 1960-70 కాలంలో సుప్రసిద్ధ ఆర్థికవేత్తలైన బి.ఎస్. మిన్హాస్, ఎం.ఎస్.అహ్లువాలియా, పి.కె.బర్ధన్, వి.ఎం.దాండేకర్ - నీల కంఠరథ్ అంచనాలను ప్రతిపాదించారు. మిన్హాస్ (37.1%), అహ్లువాలియా (56.5%), బర్ధన్ (54%), దాండేకర్-రథ్ (40%) గా గ్రామీణ పేదరికాన్ని నిర్ధారించారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (తర్వాత దాన్ని స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజనగా రూపాంతరీకరణ చేశారు) అమల్లోకి వచ్చాక.. జాతీయ స్థాయిలో గణాంకాలను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (జాతీయ నమూనా సేకరణ సంస్థ) ఆధ్వర్యంలో వివరాలను శాస్త్రీయపద్ధతిలో సేకరించి, పొందుపర్చి పటిష్టం చేశారు. 1973-74 ధరల దృష్ట్యా తలసరి నెలసరి వ్యయం రూ.49.63 కంటే తక్కువ ఉన్న గ్రామీణ జనాభా; అలాగే తలసరి నెలసరి వ్యయం రూ. 56.64 కంటే తక్కువ ఉన్న పట్టణ జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లుగా ప్రణాళికా సంఘం నిర్ణయించింది. ధరల్లో వస్తున్న మార్పుల దృష్ట్యా దారిద్య్రరేఖను కాలానుగుణంగా మారుస్తున్నారు. ఈ అంచనాల లెక్కింపుల ఆధారంగా ప్రణాళికా సంఘం 1973-74 నుంచి 1993-94 వరకు రెండు దశాబ్దాల కాలంలో.. పేదరికం గణనీయంగా తగ్గిందని గట్టిగా వాదిస్తోంది. పేదరికం స్థాయి తగ్గిన మాట వాస్తవమే అయినా.. ఏ మేరకు తగ్గింది? గ్రామీణ, పట్టణ పేదరికాల వ్యత్యాసాల తారతమ్యాలు ఎంత? అనే విషయాల్లో ఆర్థికవేత్తల్లో విభిన్న దృక్పథాలు, అభిప్రాయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2010లో రిజర్‌‌వబ్యాంక్ ప్రచురించిన భారతీయ ఆర్థిక వ్యవస్థ గణాంకాల లఘు పుస్తకం ప్రకారం దేశంలో పేదరికం 1973-74లో 54.9 శాతం ఉండగా, 1993-94లో అది 35.6 శాతానికి తగ్గింది. అయితే గౌరవ్ దత్, ఓజ్లర్, సుందరం, టెండూల్కర్ లాంటి ఆర్థికవేత్తలు ఈ అంచనాలతో విభేదించారు. గ్రామీణ పేదరికం 45 శాతం, పట్టణ పేదరికం 32 శాతంగా అంచనా వేశారు. 2015లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఆంగస్ డీటన్ భారత ఆర్థిక పెరుగుదల రేటు గణాంకాలు వాస్తవం కంటే పెంచి చూపించారని ఇటీవలే పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు యదార్థ అంచనాలు, పద్ధతులు తప్పనిసరిగా ఉండాలి. ఈ దిశగా భారత ప్రభుత్వం చేసిన కృషిలో భాగంగా వివిధ కమిటీలు ఏర్పాటయ్యాయి. అలఘ్ కమిటీ (1977), లక్డావాలా కమిటీ (1989), టెండూల్కర్ కమిటీ (2005), సక్సేనా కమిటీ, హాషిం కమిటీ (2010), రంగరాజన్ కమిటీ (2012). 2014లో పట్టణ దారిద్య్రరేఖను రూ.47 (తలసరి రోజూ వ్యయం)గా, గ్రామీణ దారిద్య్ర రేఖను రూ.32 (తలసరి రోజూ వ్యయం)గా నిర్ణయించారు. ఈ గణాంకాల ద్వారా 27 కోట్ల గ్రామీణ జనాభా, 37 కోట్ల పట్టణ జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు భావించొచ్చు. అంటే.. 125 కోట్ల దేశ జనాభాలో దాదాపు 64 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని గ్రహించాలి. పోషణ గణాంకాల ప్రకారం పేదరికాన్ని అధిగమించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు; పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీలు అవసరం.

వినూత్న అంచనా పద్ధతులు
ప్రణాళికా సంఘం 2004-05లో జాతీయ నమూనా సేకరణ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) 61వ సర్వే రౌండ్ సమాచారం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేసేందుకు రెండు వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టింది.
  1. ఏకరీతి ఉపసంహరణ దశ (uniform recall period)
  2. మిశ్రమ ఉపసంహరణ దశ (mixed recall period)
మొదటి పద్ధతిలో 30 రోజుల కాలాన్ని పరిగణిస్తారు. ఈ కాలంలో ఉపయోగించే అన్ని వస్తువుల (ఆహారం, దినుసులు, నూనెలు, కరెంటు, నీరు, ఇంధనం మొదలైన) వినిమయ గణాంకాలను ఉపయోగిస్తారు. మిశ్రమ ఉపసంహరణ దశ పద్ధతిలో మాత్రం 365 రోజుల్లో తరచుగా ఉపయోగించని (నిత్యావసరానికి కాకుండా) 5 రకాల ఆహారం కాకుండా.. ఖరీదు చేసే వస్తువుల (వస్రాలు, పాదరక్షలు, మన్నికైన వస్తువులు, విద్య, వైద్య ఖర్చులు) వివరాలను ‘గృహస్థ ఖర్చు’ అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. 2009-10లో విడుదల చేసిన 66 జాతీయ నమూనా సేకరణ గణాంకాల్లో దారిద్య్ర రేఖలను చాలామేరకు తగ్గించారు. గ్రామీణ తలసరి వ్యయం రోజువారీగా రూ.22.40, పట్టణ ప్రాంతాలకు తలసరి వ్యయం రోజువారీగా రూ.28.60గా నిర్ణయిస్తూ దారిద్య్ర రేఖను అన్వయించారు. అంటే.. 2009-10లో 33.8 శాతం గ్రామీణ జనాభా.. 20 శాతం పట్టణ జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తేలింది. సమగ్రంగా చూస్తే 29.8 శాతం దేశ జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అవగతమవుతుంది. పేదలను ఒక సామాజిక వర్గంగా పరిగణించి లేదా ఆర్థికవర్గంగా పరిగణించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిశీలించడం సంక్లిష్ట ప్రక్రియ అని భారత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకోవాలంటే.. మొదటి దశలో ఎవరికెంత ఆదాయం సమకూరుతుందో స్పష్టంగా తేల్చాలి. రెండో దశలో ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసి ప్రస్తుత స్థితిని దారుణం నుంచి అతి దారుణంగా మారకుండా కాపాడుకోవాలంటే.. అసలు పేదరికం ఎంత అన్నది కాకుండా పేదరికానికి కారణాలు శోధిస్తే తప్ప పేదరికాన్ని నిర్మూలించలేమని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల స్థితిగతులను పరిశీలిస్తే ప్రస్తుతం గోవాలో పేదరికం తక్కువగా ఉంది. ఇక్కడ 5.09 శాతం మంది పేదలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. మే 2014లో ప్రపంచ బ్యాంకు ప్రవేశపెట్టిన కొనుగోలు శక్తిసామ్యత (పర్చేజ్ పవర్ పారిటీ) పద్ధతి ప్రకారం- రోజువారీగా 1.78 డాలర్ల (దాదాపు రూ.117) కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లుగా పరిగణించాలి. ఈ లెక్కప్రకారం భారతదేశంలో 18 కోట్ల మంది, చైనాలో 18 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినా ప్రపంచంలోని పేదల్లో దాదాపు 20 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు.

ఐరాస కృషి
ఐక్య రాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన కోసం నిర్విరామంగా కృషి జరుగుతోంది. 1990లో భారత ఆర్థికవేత్త అమర్త్యసేన్, పాకిస్తాన్‌కు చెందిన సుప్రసిద్ధ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్‌హక్ సంయుక్తంగా రూపొందించిన అభివృద్ధి సూచికే ‘మానవ అభివృద్ధి సూచిక’(హెచ్‌డీఐ-హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్). తర్వాత ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యాచరణ (యూఎన్‌డీపీ) హెచ్‌డీఐని సాధికారిక సూచికగా ప్రకటించింది. మానవ అభివృద్ధి సూచీని, జీవన ఆయుర్దాయ కాలం, విద్యాస్థాయి, ఆరోగ్య ప్రమాణాలు, ఆదాయ వివరాల ఆధారంగా రూపొందించిన ‘మిశ్రమ సూచీ’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అత్యధిక దేశాల ఆమోదం కూడా పొంది అమల్లో ఉంది. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యాచరణ ‘మానవ అభివృద్ధి నివేదిక’ పేరుతో అన్ని దేశాల ర్యాంకులను విడుదల చేస్తుంది. 1997లో విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదికకు అనుబంధంగా మానవ పేదరిక సూచీని (హెచ్‌పీఐ) ప్రకటించింది. హెచ్‌పీఐ సూచీని హెచ్‌డీఐ సూచీకి అనుబంధంగా మాత్రమే గుర్తించాలి. మానవ పేదరిక సూచీ ఒక బహుముఖీయ పేదరిక సూచీ. ఇందులో అభివృద్ధి చెందిన దేశాల కోసం హెచ్‌పీఐ 1, అభివృద్ధి చెందుతోన్న పేద దేశాల కోసం హెచ్‌పీఐ 2 ఉపయోగిస్తున్నారు. రెండు వేర్వేరు ఫార్ములాల సహాయంతో మానవ పేదరిక సూచీలను గణన చేయవచ్చు.
Current Affirs
ఇందులో P1: జన్మించిన సమయం నుంచి 40 ఏళ్ల వయసు వరకు జీవించలేని (40 ఏళ్ల లోపే మరణించడం) సంభావ్యతను 100తో హెచ్చించాలి.
P2: వయోజన నిరక్షరాస్యత రేటు
P3: వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు, వారితోపాటు భారాలు ఆపాదించని వృద్ధిపర్చిన జలవనరులు అందుబాటులో ఉన్నసగటు జనాభా (గణాంక శాస్త్రంలో ప్రాముఖ్యతను బట్టి భారాలు వివిధ చలిత విలువలకు (variables) ఆపాదిస్తున్నారు.) (Unweighted average of population without sustainable acces to an improved water source and children underweight for their age) మానవ పేదరిక సూచీ-2 నాలుగు విభిన్న పరిమాణాలను మిశ్రమ సూచికగా చూపిస్తుంది. అవి... ఆనందదాయకమైన, ఆరోగ్యప్రదమైన దీర్ఘజీవన ఆయుర్దాయం, విద్య, జ్ఞాన సముపార్జనతో కూడుకున్న గౌరవప్రదమైన జీవన ప్రమాణం. వెరసి సామాజిక అభివృద్ధి ఫలాలకు దూరమైన సముదాయాలు (social exclusion), స్థితిగతులను సంకలితంగా అంచనావేయగల ఈ సూచిక ఫార్ములాను కింది విధంగా నిర్వచించవచ్చు.
Current Affirs
P1: జన్మించిన సమయం నుంచి 60 ఏళ్ల వయసు వరకు జీవించ లేకపోవడం అనే సంభావ్యతను 100తో గుణించాలి.
P2: దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకునే అక్షరాస్యతా నైపుణ్యాలు కొరవడిన వయోజనులు.
P3: ఆదాయ పేదరిక రేఖకు (ఇది భారత్ లాంటి దేశాలకు వర్తించదు. మనం దారిద్య్రరేఖకు వర్తిసాం కాబట్టి) దిగువన ఉన్న జనాభా. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్‌‌స, జపాన్ లాంటి దేశాల్లో 50 శాతం మధ్యస్థ విలువను గృహస్థ ఆదాయాల (ఖర్చు కాకుండా వ్యక్తుల అధీనంలో ఉన్న ఆదాయం) విలువతో సవరించిన ప్రమాణాన్ని ఆదాయ పేదరిక రేఖగా పరిగణిస్తారు. అమెరికాలో నివసిస్తున్న నల్ల జాతీయులు, మెక్సికన్లు ఆ రేఖకు దిగువన జీవిస్తున్నారు.
P4: 12 నెలలు లేదా అంతకుపైబడిన దీర్ఘకాలిక నిరుద్యోగ రేటు.
  • a = 3
  • ఈ పద్ధతి ప్రకారం మానవ అభివృద్ధి సూచికలను తయారుచేసి ప్రకటించిన మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం వివిధ దేశాల శ్రేణులు (ర్యాంకులు) ఈ కింది విధంగా ఉన్నాయి. అగ్రస్థానంలో నిలిచిన దేశం స్వీడన్. రెండో స్థానంలో నార్వే. 3వ స్థానంలో నెదర్లాండ్‌‌స. ఆ తర్వాత ఫిన్లాండ్. డెన్మార్‌‌క ఉన్నాయి. అంటే.. ఈ దేశాల్లో పేదరికం అత్యల్పంగా ఉంది. ఇంగ్లండ్ 16వ స్థానం, అమెరికా 17వ స్థానాన్ని పొందాయి.

ఇప్పుడు మానవ అభివృద్ధి నివేదికను ఏ విధంగా నిర్మిస్తారో పరిశీలిద్దాం. 2010 తర్వాత ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యాచరణ (యూఎన్‌డీపీ) వినూత్న పద్ధతి ద్వారా గణన నిర్వర్తిస్తుంది. ఈ పద్ధతి ద్వారా చేసే గణనలో మూడు పరిమాణాలు, దృక్కోణాలు ఉంటాయి.
  1. దీర్ఘకాలిక, ఆరోగ్యప్రదమైన జీవనాయుర్దాయం.
  2. విద్యాసూచిక: సగటు విద్యా సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి జీవితకాలంలో సరాసరి విద్యకోసం వినియోగించే సంవత్సరాలు.
  3. ఒక సముచిత జీవన ప్రమాణం- కొనుగోలు శక్తి ఆధారిత సామ్యతను మూలం కల్గిన స్థూల జాతీయ ఆదాయాన్ని పరిగణించాలి.

పై మూడు పరిమాణ దృక్కోణాలతో మూడు రకాలుగా హెచ్‌పీఐ సూచికలను ప్రతిపాదించారు.
  1. జీవనాయుర్దాయ సూచిక
    Current Affirs
  2. విద్యా సూచిక
    EI = (సగటు పాఠశాల విద్యాసూచిక + ఉజ్జాయింపు చేసిన పాఠశాలకాలం)/2
    Current Affirs
    Mean years of schooling Index Current Affirs
    Expected years of schooling Index Current Affirs
  3. ఆదాయ సూచిక (Income Index)
    Current Affirs
పైమూడు భిన్న సూచికలను వర్గమూల విలువలతో క్రమబద్ధీకరిస్తే వచ్చే విలువను గణోత్తర మధ్యస్థ విలువ లేదా ‘జ్యామితిక మధ్యస్త విలువ’ గా పరిగణించి మానవ అభివృద్ధి సూచికకు సమానంగా నిర్వచించవచ్చు
Current Affirs
LEI ని EI, IIతో గుణించి ఘనమూలం చేస్తే వచ్చేదే మానవాభివృద్ధి సూచిక.

25 ఏళ్ల (లేదా ఎక్కువ వయసున్న) వ్యక్తి పాఠశాలలో గడిపిన పూర్తి కాలాన్ని పాఠశాలలో గడిపిన సగటు కాలం (Mean years of schoolity) గా నిర్వచిస్తాం.

అయిదేళ్ల వయసున్న ఓ చిన్నారి తన జీవిత కాలంలో పాఠశాలలో గడిపే కాలాన్ని (ఉజ్జాయింపుగా) (Expected years of schooling)గా నిర్వచిస్తారు.

ఇంతటి ప్రాముఖ్యత ఉన్న హెచ్‌డీఐ ర్యాంకుల్లో భారతదేశం 135 స్థానంలో నిలిచింది. పొరుగు దేశమైన శ్రీలంక 75వ స్థానంలో ఉండగా, థాయిలాండ్ 89వ స్థానంలో ఉండటం గమనార్హం. వీటిని బట్టి పెరుగుదల వృద్ధిరేటు, సంపద, మానవాభివృద్ధికి సంపూర్ణంగా దోహదపడదని అర్థమౌతోంది. విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, రాజకీయ సుస్థిరత, లింగవివక్ష, కుల, మత వివక్షలేని, లంచగొండి రహితమైన దేశానికి మానవాభివృద్ధిలో అధిక ర్యాంకు లభిస్తుందని గమనించవచ్చు.
Published date : 04 Nov 2015 02:24PM

Photo Stories