పోలీస్ పోస్టుల్లో గర్భిణులకు నేరుగా రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివిధ పోలీస్ పోస్టుల్లో పాల్గొనే గర్భిణులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఫిజికల్ టెస్ట్ లేకుండానే నేరుగా రాత పరీక్షలకు హాజరుకావొచ్చని స్పష్టం చేసింది. ఆ పరీక్షల్లో అర్హత పొందాక ఫిజికల్ టెస్టుల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు జరిగే రాత పరీక్షల్లో పాల్గొన వచ్చని సూచిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకారం.. ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారే రాత పరీక్షలకు అర్హులు. దీనిపై కొందరు గర్భిణులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పరిస్థితిలో తాము ఫిజికల్ టెస్ట్‌లకు హాజరుకాలేమని, రాత పరీక్షకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మంగళవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మెడికల్ రిపోర్టులను పరిశీలించిన తర్వాత వారిని రాత పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు. రాత పరీక్ష తర్వాత ఫిజికల్ టెస్ట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
Also read: Quiz of The Day (January 04, 2023): ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?