Skip to main content

నేను కలెక్టర్‌ను.. ఎలా చదువుతున్నావు?.. తెల్లవారుజామున టెన్త్‌ విద్యార్థి ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్‌!

సాక్షి ఎడ్యుకేష‌న్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు పదో తరగతి విద్యార్థుల కోసం ఫిబ్రవ‌రి 6న‌ ‘విద్యార్థి ఇంటి తలుపు తట్టే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Yadadri Bhuvanagiri Collector Visits 10th Class Student House

సంస్థాన్‌ నారాయణపురం మండలం కంకణాలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేశ్యాతండాలో టెన్త్‌ విద్యార్థి దేవరకొండ భరత్‌చంద్రచారి ఇంటికి ఫిబ్రవ‌రి 6న‌ తెల్లవారుజామున 5.30 గంటలకు వెళ్లి తలుపు తట్టారు. ‘నేను జిల్లా కలెక్టర్‌ హనుమంతరావును వచ్చాను’.. అంటూ విద్యార్థి కుటుంబాన్ని పలకరించారు. సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి ఫిబ్రవ‌రి 6న‌ రాత్రి వెళ్లిన కలెక్టర్‌.. అక్కడ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ప్రేరణ కలిగించారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే నిద్రపోయారు. ఫిబ్రవ‌రి 6న‌ తెల్లవారుజామున భరత్‌చంద్ర ఇంటికి వెళ్లారు. ఆ విద్యార్థి పోషకాహార లోపంతో బలహీనంగా ఉండడాన్ని గుర్తించి.. అతని పోషణకు నెలకు రూ.5వేలు సొంత డబ్బులు అందిస్తానని ప్రకటించి, అప్పటికప్పుడే డబ్బులు అందజేశారు.

చదవండి: Collector Venkatesh Dhotre: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి

విద్యార్థి చదువుకు స్టడీ చైర్, నోట్‌ పుస్తకాలు, పెన్నులు ఇచ్చారు. విద్యార్థిని దత్తత తీసుకుంటానని.. టెన్త్‌లో ఉత్తమ మార్కులతో పాస్‌ అయితే మంచి కళాశాలలో చేర్పించి చదివిస్తానని కలెక్టర్‌ భరోసా ఇచ్చారు.
తమకు సొంత ఇల్లు లేదని, గ్యాస్‌ సిలిండర్‌ పథకం అందడం లేదని భరత్‌ తల్లి తెలిపారు. ఇందుకు కలెక్టర్‌ స్పందించి డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

భరత్‌ను పాఠశాలకు తీసుకొచ్చే ఆటోకు  చార్జీలు చెల్లిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయిని రమాదేవిని కలెక్టర్‌ సన్మానించారు. విద్యార్థి కుటుంబానికి సహాయం అందించడానికి గుడిమల్కాపురం మాజీ ఎంపీటీసీ కవిత విద్యాసాగర్‌ ముందుకు వచ్చారు. సైకిల్‌ అందిస్తానని, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, రూ.5వేలు అందజేయనున్నట్లు తెలిపారు. 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

రోజూ వేకప్‌ కాల్‌ 

భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,600 మంది పదో తరగతి విద్యార్థులున్నారని, వారిలో 1,200 మంది ‘సి’గ్రేడ్‌లో ఉన్నారని కలెక్టర్‌ చెప్పారు. సి–గ్రేడ్‌ విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు దత్తత తీసుకొని, వారి ఉత్తీర్ణతకు ప్రేరణ కలిగించే కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. ఈ రోజు తనతో సహా అధికారులు 800 మంది విద్యార్థుల ఇంటి తలుపులను తట్టినట్టు తెలిపారు. రోజూ ఉదయం ఐదు గంటలకే విద్యార్థులను ఫోన్‌ చేసి నిద్ర లేపే కార్యక్రమం రూపొందించామని ఆయన చెప్పారు.  

Published date : 07 Feb 2025 05:00PM

Photo Stories