Telangana: ఏకోపాధ్యాయ.. బోధన ఏదయా?

దీంతో విద్యార్థులకు సరైన బోధన లేక అవస్థలు పడుతున్నారు. మీటింగ్ ఉన్నా, లేక సెలవు పెట్టినా ఆ రోజు బడి మూతపడినట్లే. ఏకోపాధ్యాయ టీచర్లు నెలకు రెండు సార్లు మండలంలో జరిగే మీటింగ్‌లకు వెళ్లాల్సి రావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నారు. అంతే కాకుండా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తుంండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో మొత్తం 899 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 95వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 621 ప్రాథమిక పాఠశాలలు, 132 యూపీఎస్, 146 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 155 స్కూళ్లలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా వాటిలో 28 పాఠశాలల్లో విద్యార్థులు లేక మూత పడ్డాయి. మిగతా 127 పాఠశాలల్లో ఒకే టీచర్ చొప్పున బోధిస్తున్నారు.
చదవండి: Digital Training: టీచర్లు, విద్యార్థులకు డిజిటల్ శిక్షణ
ఏ పాఠాలు ఎవరికి చెబుతున్నారో అర్థం కాక విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు బడి మాన్పించి ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, మాసాయిపేట, నార్సింగి మండలాల్లో కసాన్‌పల్లితండా, పోతాన్ శెట్టిపల్లి, గుట్టతండా, వడ్డెరకాలనీ, వల్లభాపూర్, సాయి తండా బీంరావుపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. వీటిలో ఒక్కో పాఠశాలలో 15 నుంచి 30 మంది విద్యార్థులు చదువుతున్నారు.
చదవండి: TRT Syllabus Change : మారిన టీఆర్టీ సిలబస్.. ఇకపై ఇవి చదవాల్సిందే..
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట మండలంలో మొత్తం 14 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ మండలంలోని రాఘవానితండా ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 17 మంది విద్యార్థులకు ఒకే చోట బోధిస్తున్నారు. ఈ ఐదు తరగతులకు ఒకే ఒక్క ఉపాధ్యాయ పోస్టు మంజూరు ఉండటం గమనార్హం. కాగా ఇందులో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని తండావాసులు చెబుతున్నారు.
పాపన్నపేట మండలంలో ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఆరేపల్లి, శేరిపల్లి. అన్నారం తండా, మదిరేకొత్తపల్లి, దౌలాపూర్, మొదల్లకుంట తండా, పాపన్నపేట ఉర్దూ మీడియం, సోమ్లాతండా, అర్కెల తండా, రాజ్యాతండా, దూమాతండా, తమ్మాయిపల్లిలు వీటిలో ఒక్కో దాంట్లో ఒక్కరు చొప్పున బోధిస్తున్నారు. వెల్దుర్తి మండలంలో ఏడు సింగిల్ ఉపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అంగడిపేట, బండమీదిపల్లి, చెర్లపల్లి, కొత్తపల్లి, ఉప్పులింగా పూర్, వర్దవాని చెరువు తండా, పంతులపల్లి, ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్కరు చొప్పున ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తున్నారు.
నిత్యం నిఘా..
జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రత్యేక నిఘా ఉంది. ఉపాధ్యాయులు గైర్హాజరైనా, ఆలస్యంగా వచ్చినా చర్యలు తప్పవు. సకాలంలో బడులు తెరవాల్సిందే. తరచూ తనిఖీ చేస్తున్నాం. తాళం వేసి ఉన్నట్లు తేలితే శాఖాపర చర్యలు తప్పవు.
– రాధాకిషన్, డీఈఓ