Skip to main content

ఓడలు నీటి మీద ఎలా తేలుతాయి?

Tenth Classఅంతంత బరువైన ఓడలు నీటి మీద తేలుతూ ఎలా వెళతాయి అని సందేహం కలగవచ్చు. నీటి సాంద్రత కంటే ఇనుము సాంద్రత చాలా ఎక్కువ. ఏదైనా ఒక వస్తువు నీటిమీద తేలాలంటే ఆ వస్తువుచే తొలగించబడిన నీటిబరువు, ఆ వస్తువు బరువుకు సమానంగా వుండాలి. ఇనుపగుండు విషయంలో అది తొలగించిన నీటి బరువు దాని బరువు కంటే చాలా తక్కువ. అందువల్లనే అది నీటిలో మునిగిపోతుంది. ఓడ నీటి మీద తేలడంలోని రహస్యం దాని నిర్మాణంలో వుంది. ఓడ అడుగు భాగం గుల్లగా వుండి, దాని బరువు కంటే ఎక్కువ పరిమాణం గల నీటిని అది తొలగించగలుగుతుంది. అందువల్లనే అది దాని బరువు కంటే ఎక్కువ ఊర్ధ్వపీడనాన్ని పొందగలుగుతుంది.

ఓడ నీటిమీద తేలుతున్నపుడు అది తొలగించిన నీటి బరువుతో దాని విస్తృతమైన ఆకారం బరువు సమానం అవుతుంది. ఓడ నీటిలోకి ప్రవేశించినపుడు అది తొలగించిన నీటిఘనపరిమాణం దానిలో వినియోగించబడిన ఇనుము ఘనపరిమాణం కంటే చాలా ఎక్కువ. దాని బరువు కంటే ఎక్కువ నీటిని అది తొలగించలేదు కాబట్టి ఆ మేరకే ఓడనీటిలో మునుగుతుంది. ఈ కారణం వల్లనే ఓడలో కొంతభాగం నీటిలో మునిగి, మరికొంతభాగం నీటిమీద తేలి వుంటుంది.
Published date : 13 Nov 2013 11:03AM

Photo Stories