సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్
ఐటీఐఆర్
హైదరాబాద్‌లో సమాచార సాంకేతిక పెట్టుబడుల రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐటీఐఆర్ వల్ల కింద పేర్కొన్న ప్రయోజనాలు చేకూరనున్నాయి.
- ప్రత్యక్షంగా దాదాపు 15 లక్షల మందికి, పరోక్షంగా సుమారు 53 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.
- సుమారు రూ.310.849 కోట్ల ప్రత్యక్ష రాబడులు చేకూరుతాయి.
- ఐటీ పెట్టుబడుల సామర్థ్యం రూ.219.440 కోట్లకు పెరుగుతుంది.
- ఐటీ ఎగుమతులు రూ.2,35,000 కోట్లకు చేరుతాయి.
- రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంలో పెరుగుదల సుమారు రూ.30,170 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదన క్లస్టర్లు
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమ వృద్ధికి భారత ప్రభుత్వ ఒక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్ ఉత్పాదనల క్లస్టర్ (ఈఎంసీ)లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇ-సిటీ (602 ఎకరాలు), హైదరాబాద్‌లోని మహేశ్వరంలో (310 ఎకరాలు) ఏర్పాటు చేయనున్న ఈఎంసీల ద్వారా ప్రత్యక్షంగా 0.40 లక్షల మందికి, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.
గేమింగ్, యానిమేషన్
రాష్ట్ర ప్రభుత్వం యానిమేషన్, గేమింగ్, విజువల్/స్పెషల్ ఎఫెక్ట్స్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వేగంగా విస్తరిస్తున్న, ఉజ్వల భవిష్యత్తు ఉన్న రంగంగా గుర్తించింది. గేమింగ్, యానిమేషన్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా 42 బిలియన్ అమెరికన్ డాలర్లు, మనదేశంలో 900 మిలియన్ అమెరికన్ డాలర్ల సామర్థ్యం ఉంది. తెలంగాణ ప్రభుత్వం యానిమేషన్, గేమింగ్ రంగం వృద్ధికి ప్రత్యేకంగా గేమ్ (జీఏఎంఈ) విధానాన్ని రూపొందించింది.
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)కు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని గేమింగ్ అండ్ యానిమేషన్ పార్కుకు కేటాయించారు. ఈ పార్కులో భాగస్వామ్య స్టూడియోలు, ప్రాసెసింగ్ ల్యాబ్‌లు, మీడియా సెంటర్, సమావేశ సౌకర్యాలు, ట్రాన్సిట్ కార్యాలయం/ బిజినెస్ సెంటర్ తదితర నిర్మాణాల అభివృద్ధికి అనుకూలమైన స్థలం ఉంటుంది. గేమింగ్, యానిమేషన్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ‘గేమింగ్ అండ్ యానిమేషన్ అకాడమీ’ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా అర్హులైన విద్యార్థులను ఈ రంగంలో ఉపాధి కోసం సిద్ధం చేస్తారు.
టీ-హబ్
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో నూతన ఆవిష్కరణల కోసం ‘టీ-హబ్’ ఏర్పాటు చేసింది. సాంకేతికమైన స్టార్టప్‌లను అందించడం ద్వారా నవ పరిశ్రమలను ప్రోత్సహించే సంస్థగా ఇది సేవలు అందిస్తుంది. ఇందులో నాణ్యమైన మౌలిక సదుపాయాలు, మార్గదర్శకులు, నిధి దాతలు, నెట్‌వర్క్ తదితరాలకు సంబంధించిన అనుసంధానక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. వివిధ పరిశ్రమలకు అంకురార్పణ నుంచి పరిణతి సాధించే వరకూ మొత్తం అభివృద్ధి చక్రం పొడవునా ఈ స్టార్టప్‌లు దోహదం చేస్తాయి. విభిన్నమైన నూతన పరిశ్రమలను అనుసంధానించడం, వాటికి అవసరమైన మద్దతు అందించడానికి టీ-హబ్ సాయపడుతుంది.
టీ-హబ్ వ్యవస్థాపక భాగస్వామ్య సంస్థలు.. ఐఎస్‌బీ, ఐఐఐటీ-హెచ్, నల్సార్ విశ్వ విద్యాలయం. ఇవి తమతో పాటు వ్యాపార, సాంకేతిక, న్యాయ నైపుణ్యాలను ఈ సమగ్ర వ్యవస్థలోకి తీసుకొస్తాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ రంగ సాంకేతికతలు; క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ, ఐటీఈఎస్, మొబైల్ అప్లికేషన్లు టీ-హబ్ స్టార్టప్‌లలో కీలక పురోగామి విభాగాలుగా ఉన్నాయి. వీటి అంచనా వ్యయం రూ.35 కోట్లు. ద్వితీయ శ్రేణి టీ-హబ్‌గా వరంగల్ నగరాన్ని గుర్తించారు. ఇక్కడ ఐటీ కంపెనీలు కార్యకలాపాలు వచ్చిన వెంటనే ప్రారంభించుకునేవిధంగా అనువైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి టీఎస్‌ఐఐసీ ద్వారా 15,000 చదరపు అడుగులను కేటాయించారు.
వై-ఫై సౌకర్యం
పరిపాలన, కార్యనిర్వాహక సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం హైదరాబాద్‌లో ఒక వై-ఫై కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పౌరులతో సులభంగా సంబంధ బాంధవ్యాలను నెరపడానికి, డిజిటల్ విధానంలో పౌరులను మమేకం చేయడానికి ఇది దోహదపడుతుంది. మొబైల్ పరిపాలన, వ్యక్తిగతీకరించిన అప్రమత్తతలను అందించడం; వాతావరణ హెచ్చరికలు, ట్రాఫిక్ అప్రమత్తత మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని వాస్తవిక సమయంలో వ్యాప్తి చేయడం దీని లక్ష్యం.
తెలంగాణ రాష్ట్ర డేటా కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచారాన్ని భద్రపరచడానికి, ఆధునిక సర్వర్లను సమకూర్చడం ద్వారా వాటి అవసరాలను తీర్చడానికి మణికొండలో రాష్ట్ర సమాచార నిధి కేంద్రాన్ని (టీఎస్‌డీసీ) నిర్మించారు. అనువర్తనాల నిర్వహణతో పాటు సమాచార నిధి సేవలన్నింటినీ అందించడంలో ఈ కేంద్రం అత్యున్నత స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
మౌలిక సదుపాయాల భవనం మొత్తం విస్తీర్ణం 9000 చదరపు అడుగులు. ఇందులో 1585 చదరపు అడుగుల్లో 35 ర్యాక్‌ల సామర్థ్యంతో మొదటి దశ సర్వర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ నిధులు సమకూరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో 962 చదరపు అడుగుల విస్తీర్ణం, 24 ర్యాక్‌ల సామర్థ్యంతో రెండో దశ సర్వర్‌ను ఏర్పాటు చేస్తారు.
టీఎస్‌డీసీ నిర్మాణ డిజైన్ ద్వితీయ శ్రేణి ప్లస్ (టీఐఏ-942) ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. దీని కనీస క్రియాశీల సమయం 99.749 శాతం. రిడండెంట్ మోడ్‌లో ఎస్‌టీఎం1 లింక్ (155 ఎంబీపీఎస్)తో టీస్వాన్, టీస్కాన్‌లకు టీఎస్‌డీసీ అనుసంధానమై ఉంటుంది. ఇందులో విద్యుత్, ఏసీ, యూపీఎస్, జనరేటర్‌లు, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలతో పాటు భద్రత, యాజమాన్య మౌలిక సదుపాయాలు, విపత్తుల నుంచి పునరుద్ధరించే వ్యవస్థ, కంప్యూటర్, నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాలు తదితర సహకార వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. రెండు రకాల హోస్టింగ్ నమూనాల (హోస్టెడ్, కో-లొకేటెడ్)తో రాష్ట్ర ప్రభుత్వ శాఖల ప్రధాన సేవలు, ఇ-గవర్నెన్స్ అనువర్తనాలను పటిష్టం చేస్తారు.
టీ-స్కాన్
డేటా కోసం నెట్‌వర్క్‌ను 500 నోడ్‌సతో అనుసంధానించడానికి ‘తెలంగాణ సచివాలయ క్యాంపస్ ఏరియా నెట్‌వర్క్’ (టీ-స్కాన్) ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డేటా పోర్‌ట ద్వారా ప్రతి పని ప్రదేశాన్ని పరస్పరం అనుసంధానిస్తారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 10 జీబీ ఈథర్‌నెట్ ద్వారా దీని ప్రధాన వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఒకే బ్లాక్‌లో, యూటీపీ గిగా బైట్ ఈథర్‌నెట్ ద్వారా ఇంటర్-ఫ్లోర్‌లో అనుసంధానం ఉంటుంది.
ప్రస్తుతం సచివాలయంలో నెట్‌వర్క్‌కు సుమారు 3000 కంప్యూటర్లు అనుసంధానించి ఉన్నాయి. డి-బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న సచివాలయ నెట్‌వర్క్ యూనిట్ నుంచి నెట్‌వర్క్ నిర్వహణ, పర్యవేక్షణ చేస్తారు. ఇంటర్‌నెట్, ఇంట్రానెట్, ఇ-మెయిల్, వెబ్ తదితర నెట్‌వర్క్ సేవలను అందించడానికి విండోస్, లైనక్స్‌లతో సర్వర్లు ఏర్పాటు చేశారు. ఇది వాణిజ్య పన్నులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ కోసం ఒక డీఆర్ సైట్‌గానూ పనిచేస్తుంది.
టీస్వాన్
రాష్ట్ర ప్రధాన కేంద్రాన్ని (ఎస్‌హెచ్‌క్యూ) జిల్లా కేంద్రాలు (డీహెచ్‌క్యూ), మండల కేంద్రాలతో (ఎంహెచ్‌క్యూ) జీ2జీ స్వాన్ అనుసంధానిస్తుంది. దీన్ని బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ స్థానంలో డీఐటీతో అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న డీఐటీ రూ.249.76 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ఆమోదించింది. టెండర్ల ప్రక్రియ ద్వారా దీనికి సర్వీస్ ప్రొవైడర్ కింద మెసర్‌స టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎంపికైంది. 10 డీహెచ్‌క్యూలను ఎస్‌హెచ్‌క్యూతో, 464 ఎంహెచ్‌క్యూలను సంబంధిత డీహెచ్‌క్యూలతో అనుసంధానించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలవుతుంది. పాత స్వాన్‌తో అనుసంధానించి ఉన్న ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలను కొత్త స్వాన్‌కు మార్చారు. ఇ-సేవ, ఐజీఆర్‌ఎస్, ఆర్‌టీఏ, రెవెన్యూ విభాగాల అవసరాలపై స్వాన్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు.
శాప్‌నెట్
2002 నుంచి ఒక భూతల కేంద్రం పని చేస్తోంది. ఈ ఎర్‌త స్టేషన్ ఇన్‌శాట్-3బి ఉపగ్రహ సేవలను వినియోగించుకుంటోంది. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సొసైటీ శాప్‌నెట్ ఈ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఎర్‌త స్టేషన్‌కు 5 వీడియో చానెళ్లు, ఒక డేటా చానెల్ సామర్థ్యం ఉంది. ఒక అత్యాధునిక డిజిటల్ స్టూడియో ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రత్యక్ష సంభాషణల చానెల్ వినియోగం కూడా పెరిగింది. ప్రస్తుతం 4 చానెళ్లు పని చేస్తున్నాయి. ప్రత్యక్ష సంభాషణలతో బోధన, విద్యా కార్యక్రమాల ప్రసారం కోసం పాఠశాల, కళాశాల, సాంకేతిక, వైద్య విద్యా శాఖలు చానెల్ -1ను వినియోగించుకుంటున్నాయి. వ్యవసాయ శాఖ, ఇందిరా క్రాంతిపథం, పోలీస్ తదితర శాఖలు కూడా ఈ చానెల్‌ను వీడియో సమావేశాల కోసం ఉపయోగిస్తున్నాయి. హెచ్‌ఆర్‌డీ, సామాజిక రంగ కార్యక్రమాల కోసం చానెల్-2, 3లను, పాఠశాలలు, టాస్క్ కోసం చానెల్-4ను కేటాయించారు.
ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులు
దేశంలో ఇ-గవర్నెన్స్ దీర్ఘకాలిక అభివృద్ధికి పునాదులు వేయడానికి, కొత్త ఊతం ఇవ్వడానికి భారత ప్రభుత్వ జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక (ఎన్‌ఈజీపీ) కృషి చేస్తోంది. ఇది సరైన పరిపాలన, సంస్థాగత యంత్రాంగాలను సృష్టించడంపై సమాచారం అందిస్తుంది. కీలక మౌలిక సదుపాయాలూ, విధానాలను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర, సంఘటిత సేవా స్థాయిల్లో అనేక ఉద్యమ తరహా ప్రాజెక్టులను అమలు చేస్తుంది. అధికారుల మార్గదర్శకత్వంలో ఎన్‌ఈజీపీ అమలుపై పర్యవేక్షణ, సమన్వయం కోసం దృఢమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందులో ప్రమాణాలు, విధానపర మార్గదర్శకాల రూపకల్పన/ స్థిరీకరణ, సాంకేతిక సహకారం అందించడం, నిర్వహణ సామర్థ్యాన్ని నిర్మించడం లాంటి అంశాలు ఉంటాయి.
ఇ-గవర్నెన్స్ కిందికి వివిధ శాఖల్లో చేపట్టనున్న కొత్త, పైలట్ ప్రాజెక్టులు, ఐటీ ఆడిట్స్, లక్ష్యసాధన మార్గ నివేదికలు, డీపీఆర్ ప్రజెంటేషన్, మొబైల్ సర్వీస్ డెలివరీ గేట్‌వే (ఎంఎస్‌డీజీ), ఇ-గవర్నెన్స్ అప్లికేషన్లు, జీ2సీ అప్లికేషన్ల కోసం ఇంటర్‌ఫేజ్ సామగ్రిని సమకూర్చుకోవడం, ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించడం లాంటి అంశాలు వస్తాయి.
మీ-సేవ
మీ-సేవ అంటే పౌరుల కోసం ఉద్దేశించిన సేవ అని అర్థం. ‘ఇంటికి చేరువలో పౌర సేవలు’ అనే జాతీయ ఇ-గవర్నెన్స్ దృక్పథం ఆధారంగా రూపొందించిన చక్కని పరిపాలనాపరమైన చొరవ ఇది. సురక్షిత స్టేషనరీలో డిజిటల్ సంతకాలను ఉపయోగించి పౌరులకు ప్రభుత్వ సేవలు అందించే సేవా పోర్టల్ మీ-సేవ. పౌర-కేంద్రీకృతంగా ఉన్న అన్ని సేవలనూ మీ-సేవ కిందికి తీసుకురావడానికి, పౌరులకు పూర్తిగా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ-సేవతో పౌరుడు ఏ సమయంలోనైనా ప్రభుత్వ శాఖల సేవలను ఆన్‌లైన్ విధానం ద్వారా వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3715కు పైగా ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా 34 శాఖలకు చెందిన 311 పౌర కేంద్రీకృత సేవలను అందిస్తున్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా వివిధ శాఖలకు చెందిన 50 సేవలను కూడా మీ-సేవ అందిస్తోంది.
టాస్క్
తెలంగాణలో ప్రతిబంధకంగా ఉన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ (టాస్క్) అకాడమీని స్థాపించారు. సంసిద్ధంగా ఉన్న ఉద్యోగార్హులైన పట్టభద్రుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి టాస్క్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. వివిధ భాగస్వామ్య కళాశాలల్లో సుశిక్షితులైన మార్గదర్శులను నియమించడం ద్వారా ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు సమాచార, ఉద్యోగార్హమైన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు. దీని కోసం అనేక బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికి ఐబీఎం, ఒరాకిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆటోడెస్క్, గూగుల్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ తదితర సంస్థలు సహకారం అందిస్తున్నాయి. సాఫ్ట్‌స్కిల్స్ అభివృద్ధిపై టాస్క్ దృష్టి సారించింది. పట్టభద్రులకు శిక్షణ ఇవ్వడంలో టాస్క్‌కు సహకరించేలా తెలంగాణ ప్రభుత్వం నాస్కామ్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. కళాశాల విద్యార్థుల్లో పారిశ్రామికతత్వాన్ని, ఆర్ అండ్ డీని ప్రోత్సహించే దిశగా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. టాస్క్‌ను జిల్లాలు, మండలాల స్థాయిల్లోకి తీసుకువెళ్లడానికి ప్రణాళికలు వేస్తున్నారు.