సామాజిక సమస్య - బాల కార్మిక వ్యవస్థ
Sakshi Education
బంగారు భవిష్యత్తుకు పునాదిపడే దశ బాల్య దశ.ఇలాంటి కీలకదశలో బాలలను చదువు, ఆటలకు దూరంచేసి, శ్రామిక యంత్రాలుగా మార్చటాన్ని బాలకార్మిక వ్యవస్థగా చెప్పొచ్చు. బాలలను కార్మికులుగా మార్చే హక్కు ఎవరికీ లేదు. అయితే వీరు సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల బాలకార్మికులుగా మారుతున్నారు...
బాలకార్మికులు - నిర్వచనాలు
బాలకార్మిక వ్యవస్థకు కారణాలు:
బాలకార్మికులు అధికంగా ఉన్న పరిశ్రమలు:
బాలకార్మిక వ్యవస్థ-పర్యవసానాలు:
ప్రపంచ బాలకార్మికుల్లో 33 శాతం మంది భారతదేశంలో ఉన్నారు. వీరిలో 60 శాతం మంది పదేళ్లలోపువారు. భారతదేశంలో 67 శాతం బాలకార్మికులు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో; 23 శాతం వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు. పొగ, దుమ్ము, మసి, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న కొలిమిల వద్ద పనిచేస్తున్నారు. పొటాషియం, ఆర్సినిక్ వంటి రసాయనాల మధ్య దీర్ఘకాలం పనిచేయటంతో బాలలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. క్షయ, ఊపిరితిత్తులు పాడవటం, వెన్నెముక దెబ్బతినటం, పెరుగుదల లోపించటం, అంటురోగాలు, చర్మ సంబంధిత రోగాల బారినపడుతున్నారు. బాలల్లో శారీరక, మానసిక, నైతికాభివృద్ధి కుంటుపడుతోంది. మూర్తిమత్వ వికాసం జరగటం లేదు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సూచనలు:
సమాజానిదీ బాధ్యతే:
ఒక దేశాభివృద్ధిని ఆ దేశంలోని మహిళలు, బాలల జీవన ప్రమాణాలను బట్టి అంచనా వేయొచ్చు. అమూల్య దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయ సంస్కరణలు, ఉపాధి కల్పన పథకాలు, పేదల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించటం, అవ్యవస్థీకృత రంగాలను ప్రోత్సహించటం, సహకార సంఘాల ఏర్పాటు, సాంఘిక భద్రతా పథకాల రూపకల్పన వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపయోగపడతాయి. అందువల్ల ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
ప్రభుత్వ చర్యలు
బాలకార్మిక వ్యవస్థ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. దీని నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఈ సమస్యతో ఆర్థిక, సాంఘిక అంశాలు ముడిపడి ఉన్నందున నిర్మూలనకు అనేక వ్యూహాలు, పథకాలు అవసరం.
బాలలు-రాజ్యాంగ రక్షణలు
గుర్తుంచుకోండి
- 18 ఏళ్ల లోపు పనిచేసే వారంతా బాలకార్మికులే - బాలల హక్కులపై ఐరాస సదస్సు (యూఎన్‌సీఆర్‌సీ)
- 15 ఏళ్ల లోపు పనిచేసే వారంతా బాలకార్మికులు - అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో)
బాలకార్మిక వ్యవస్థకు కారణాలు:
- బాల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం పేదరికం. రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం 2011-12లో దేశంలో 29.5 శాతం జనాభా పేదరికంలో ఉంది. ప్రతి పది మందిలో ముగ్గురు పేదలే. కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి వల్ల బాలలు శ్రామికులుగా మారుతున్నారు.
- కొన్ని రకాల పరిశ్రమల్లో పెద్దలకంటే పిల్లలు చురుగ్గా పనిచేస్తారు! వీరిని తక్కువ వేతనాలతో పనిచేయించుకోవచ్చనే దురాలోచనతో కొందరు కావాలనే బాలల్ని కార్మికులుగా మారుస్తున్నారు.
- నిరక్షరాస్యత కూడా బాలకార్మిక వ్యవస్థకు కారణం. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు విద్యాభ్యాస ప్రయోజనాలను గుర్తించలేక, తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచి శ్రామికులుగా మారుస్తున్నారు. చాలా మంది పిల్లలు పాఠశాలలో చేరటం లేదు. మరికొందరు చేరినా, మధ్యలో బడిమానేస్తున్నారు.
- వృత్తుల ఆధారిత కుల వ్యవస్థ బలంగా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి వంశపారంపర్య వృత్తుల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.
- ప్రపంచీకరణ కారణంగా పెరుగుతున్న ఆర్థిక అంతరాలు కూడా బాలకార్మికులను పెంచుతున్నాయి.
- అంతర్జాతీయ కార్మిక సంస్థ బాలకార్మికులు చేసే పనులను 5 రకాలుగా విభజించింది. అవి.. గృహ సంబంధ పనులు, వేతనం లేని గృహ సంబంధ పనులు, వెట్టి చాకిరి, కొంత వేతనం కోసం రోజులో కొంత సమయం పనిచేయటం, చిల్లర పనులు.
బాలకార్మికులు అధికంగా ఉన్న పరిశ్రమలు:
- అగ్గిపెట్టెలు, టపాసుల పరిశ్రమ: 4-15 ఏళ్ల పిల్లలు దాదాపు 50 వేల మంది తమిళనాడులోని శివకాశి పరిసర ప్రాంతాల్లో దాదాపు 12 గంటలు పనిచేస్తున్నారు. వీరు క్లోరైడ్, పొటాషియం, ఫాస్పరస్, జింక్ ఆక్సైడ్ వంటి విషపూరిత రసాయనాల మధ్య పనిచేయటం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
- గనులు, క్వారీలు: కేరళ క్వారీ, ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం పలకల తయారీ పరిశ్రమ, మధ్యప్రదేశ్‌లోని మాందసోర్‌లో బలపాల తయారీ పరిశ్రమ, మేఘాలయ గనుల తవ్వకాల్లో బాలకార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు.
- చేపల పరిశ్రమ: కేరళలోని కోచి, తమిళనాడులో కన్యాకుమారిలో చేపల లోడింగ్, అన్‌లోడింగ్, శుభ్రపరిచే పనుల్లో బాలకార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు.
- చేనేత పరిశ్రమ: కాంచీపురం, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో గాలి, వెలుతురు లేని చేనేత పరిశ్రమల్లో బాలకార్మికులు మగ్గిపోతున్నారు.
- తివాచీ పరిశ్రమ: జమ్మూకాశ్మీర్; ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, బదోయి, మీర్జాపూర్ ప్రాంతాలతో పాటు రాజస్థాన్‌లో తివాచీ పరిశ్రమ అధికంగా కేంద్రీకృతమైంది. బాలకార్మికుల్లో 30 శాతం మంది ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు అంచనా.
బాలకార్మిక వ్యవస్థ-పర్యవసానాలు:
ప్రపంచ బాలకార్మికుల్లో 33 శాతం మంది భారతదేశంలో ఉన్నారు. వీరిలో 60 శాతం మంది పదేళ్లలోపువారు. భారతదేశంలో 67 శాతం బాలకార్మికులు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో; 23 శాతం వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు. పొగ, దుమ్ము, మసి, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న కొలిమిల వద్ద పనిచేస్తున్నారు. పొటాషియం, ఆర్సినిక్ వంటి రసాయనాల మధ్య దీర్ఘకాలం పనిచేయటంతో బాలలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. క్షయ, ఊపిరితిత్తులు పాడవటం, వెన్నెముక దెబ్బతినటం, పెరుగుదల లోపించటం, అంటురోగాలు, చర్మ సంబంధిత రోగాల బారినపడుతున్నారు. బాలల్లో శారీరక, మానసిక, నైతికాభివృద్ధి కుంటుపడుతోంది. మూర్తిమత్వ వికాసం జరగటం లేదు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సూచనలు:
- పేదరికం, నిరక్షరాస్యత, పిల్లల వెట్టిచాకిరి వంటి సమస్యలకు సంబంధించి పూర్తివివరాలు సేకరించాలి.
- సామాజిక సమస్యలు, వెనుకబాటుతనానికి ప్రత్యామ్నాయం చూపేలా విద్యా ప్రక్రియ నిర్వహణ ఉండాలి.
- బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి.
- బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేయాలి.
- సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి.
- బాలకార్మిక వ్యవస్థ సంక్లిష్ట, సామాజిక సమస్య కాబట్టి దీని నిర్మూలనకు దీర్ఘకాల కృషి, బహుముఖ వ్యూహం అవసరం.
సమాజానిదీ బాధ్యతే:
ఒక దేశాభివృద్ధిని ఆ దేశంలోని మహిళలు, బాలల జీవన ప్రమాణాలను బట్టి అంచనా వేయొచ్చు. అమూల్య దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయ సంస్కరణలు, ఉపాధి కల్పన పథకాలు, పేదల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించటం, అవ్యవస్థీకృత రంగాలను ప్రోత్సహించటం, సహకార సంఘాల ఏర్పాటు, సాంఘిక భద్రతా పథకాల రూపకల్పన వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపయోగపడతాయి. అందువల్ల ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
ప్రభుత్వ చర్యలు
బాలకార్మిక వ్యవస్థ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. దీని నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఈ సమస్యతో ఆర్థిక, సాంఘిక అంశాలు ముడిపడి ఉన్నందున నిర్మూలనకు అనేక వ్యూహాలు, పథకాలు అవసరం.
- 1974లో పిల్లల హక్కుల కోసం జాతీయ సిద్ధాంతాన్ని ప్రకటించింది. పిల్లల సంరక్షణ, 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించటం, బలహీన వర్గాల పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ఇందులోని ముఖ్యాంశాలు.
- 1979లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు గురుపాద స్వామి కమిటీని ఏర్పాటు చేసింది. పేదరికం ఉన్నంత వరకు బాలకార్మిక వ్యవస్థ ఉంటుందని, న్యాయ చర్చల ద్వారా దీన్ని నిర్మూలించలేమని కమిటీ పేర్కొంది. బహు విధానాల రూపకల్పన ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని సూచించింది.
- గురుపాద స్వామి కమిటీ సూచనల ప్రకారం 1986లో బాలకార్మిక వ్యవస్థ (నిషేధం, నియంత్రణ) చట్టం చేశారు. ఈ చట్టం భవన నిర్మాణం, గనుల తవ్వకం, పలకల తయారీ, ఇటుక బట్టీలు వంటి వాటిలో బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. చట్టం ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష విధింపునకు అవకాశమిచ్చింది.
- 1987లో కేంద్ర ప్రభుత్వం బాలకార్మికులకు సంబంధించి జాతీయ విధానం ప్రకటించింది. దీని పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందింది. దీని ప్రకారం బాలకార్మికులకు దశల వారీగా పునరావాసం కల్పించాలి. బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి.
- 1988లో జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు 9 జిల్లాల్లో ప్రారంభమైంది. బాలకార్మిక వ్యవస్థ నుంచి బయటపడిన బాలలకు ప్రత్యేక పాఠశాలలు నడపటం, వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వటం, ఉపకారవేతనం అందించటం, క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం వంటివి ప్రాజెక్టు విధులు.
- 2005 జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 2007, మార్చిలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్)ఏర్పాటైంది. 18 ఏళ్ల లోపు వారి హక్కులకు రక్షణ కల్పించటం, వారికి సేవలందిస్తున్న సంస్థలను పర్యవేక్షించటం, బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులు, సంస్థలపై చర్యలకు సిఫార్సు చేయటం వంటివి కమిషన్ విధులు.
- బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలి. దీనికోసం విద్యా హక్కు చట్టం (2009) చేశారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో 21(ఎ) అధికరణను చేర్చారు. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల వయసున్న పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఆర్థిక కారణాల వల్ల ఏ ఒక్కరూ బడి బయట ఉండకూడదని చట్టం స్పష్టం చేసింది.
బాలలు-రాజ్యాంగ రక్షణలు
- ఆర్టికల్ 15(3): మహిళలు, బాలల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు చేయవచ్చు.
- ఆర్టికల్ 21(ఎ): 6-14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించటం ప్రభుత్వ బాధ్యత.
- ఆర్టికల్ 23(1): బాలలను అమ్మటం, కొనటం, వారితో భిక్షాటన చేయించటం నేరం.
- ఆర్టికల్ 24: 14 ఏళ్ల లోపు పిల్లలను ప్రమాదకర పనిలో పెట్టుకోవటం నిషిద్ధం.
- ఆర్టికల్ 39(ఇ): బాలకార్మికుల ఆరోగ్యం, శ్రమ దుర్వినియోగం కాకుండా వారు శక్తికి మించిన పనుల్లో నిమగ్నం కాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.
- ఆర్టికల్ 39(ఎఫ్): బాలల ఆరోగ్య పరిరక్షణకు ఆటంకంగా ఉన్న పరిస్థితులను తొలగించాలి. వారు సాంఘిక నేరాలకు పాల్పడకుండా, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలి.
- ఆర్టికల్ 45: 0-6 ఏళ్ల బాలలకు ఆరోగ్య పరిరక్షణ, విద్యాభ్యాస వసతులు కల్పించాలి.
- ఆర్టికల్ 46: షెడ్యూల్ కులాలు, తెగల బాలల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- ఆర్టికల్ 47: ప్రభుత్వం బాలలకు పౌష్టికాహారం అందించాలి. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలి.
- ఆర్టికల్ 243 (జి): బాలల సంరక్షణను సంస్థాగతం చేయటం.
గుర్తుంచుకోండి
- 2011 జనాభా లెక్కల ప్రకారం బాలకార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం 5-14 ఏళ్ల మధ్య బాలకార్మికులు 43.53 లక్షలు.
- బచ్‌పన్ బచావో ఆందోళన్ స్థాపకులు కైలాశ్ సత్యార్థి బాల కార్మికుల రక్షణకు, వారి విద్యాభ్యాసానికి కృషిచేసినందుకు 2014లో నోబెల్ బహుమతి లభించింది.
- జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబరు 14ను జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నవంబరు 20 అంతర్జాతీయ బాలల హక్కుల దినం.
- సమీకృత శిశు అభివృద్ధి సేవల (1975) కార్యక్రమం.. బాలలకు పోషకాహారం అందించేందుకు, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించినది.
- 1979ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తించింది.
Published date : 30 Oct 2015 12:30PM